Share News

Nandigam Suresh: హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు

ABN , Publish Date - Sep 19 , 2024 | 08:40 AM

జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ పేరు ఉంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన ఉన్నారు. నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి చెందింది.

Nandigam Suresh: హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు
Nandigam Suresh

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ పేరు ఉంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన ఉన్నారు. నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి చెందింది. హత్యపై మరియమ్మ కుమారుడు ఫిర్యాదు చేశాడు. అందులో నందిగం సురేష్ పేరును కూడా పేర్కొన్నాడు. అయితే అప్పట్లో వైసీపీ అధికారం ఉండడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదు. తాజాగా మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌పై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు.


టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సురేష్ ఏం చెప్పారంటే..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ రెండు రోజుల విచారణ పూర్తయింది. ప్రెస్‌మీట్‌ ఉందని, దానికి హాజరుకావాలని పిలిపించారని, అందుకే తాను ఆ రోజు వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నానని సురేష్‌ పోలీసులకు చెప్పారు. రెండు రోజుల విచారణలో 45 ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యధిక ప్రశ్నలకు సురేష్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. సమాధానాలు ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాచారం చెప్పారని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.


మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌పై దాడికి కుట్ర పన్నారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దాడికి పాల్పడడానికి ముందు ఆ పార్టీ ముఖ్యనేతలు, అల్లరిమూకలు అందరూ తొలుత వైసీపీ ఆఫీస్‌కు వెళ్లారని భావిస్తున్నారు. ఆ రోజు అక్కడే ఉండడంతో నందిగం సురేష్‌పై అధికారులు ఫోకస్ పెట్టారు.

Updated Date - Sep 19 , 2024 | 08:52 AM