Crop Damage: చెడగొట్టు వానకు రైతు విలవిల!
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:39 AM
రాష్ట్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కోతకు వచ్చిన సుమారు 400 ఎకరాల వరి పంట నేలవాలింది.

పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటనష్టం
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
నష్ట పరిహారమిచ్చి ఆదుకుంటామని ప్రకటన
ములుగు/మహబూబాబాద్ అగ్రికల్చర్/యాదాద్రి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కోతకు వచ్చిన సుమారు 400 ఎకరాల వరి పంట నేలవాలింది. వడగండ్ల ధాటికి మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో మండలంలో వరి, మిర్చి పంట దెబ్బతిన్నది. కమలాపురం వద్ద 30 ఎకరాల్లో పొగాకు పంట తడిసి ముద్దయ్యింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో 2 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు వరద నీటిలో మునిగి నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి మిర్చి తడిసిపోయింది. కొత్తగూడలో వడగండ్ల వానతో 150 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 250 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీటిలో 150 ఎకరాల్లో మామిడి, 93 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనాలు రూపొందించారు.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీతక్క
మంత్రి సీతక్క ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శుక్రవారం పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, నష్ట పరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. పంట నష్టంపై తక్షణమే సర్వే మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి తక్షణ సాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పరిశీలించారు.
నేడు రాష్ట్రానికి వర్ష సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరగనుంది. ఆదివారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు, పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపు 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇక శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వివరించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News