Share News

Great Nicobar Biodiversity: నికోబార్‌లో నమ్మకద్రోహం

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:58 AM

గ్రేట్ నికోబార్‌ దీవి పై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాజెక్టు పర్యావరణ, సామాజిక అంశాలపై తీవ్రమైన ప్రభావాలు కలిగించనుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా అద్భుతమైన జీవవైవిధ్యం, ఆదివాసీ సంస్కృతులు నాశనం అవుతాయని పరిశోధనలు, వ్యాసాలు సూచిస్తున్నాయి

Great Nicobar Biodiversity: నికోబార్‌లో నమ్మకద్రోహం

సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై బహిరంగ చర్చలలో ఏ పదమూ, ‘జాతీయ మీడియా’లా భ్రమలు కల్పించదు, తప్పుదోవ పట్టించదు. జాతీయ మీడియాగా పరిగణన పొందుతున్న వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానెల్స్‌ ఆలోచనా రీతులు సంకుచిత పరిధిలోనే ఉండిపోతున్నాయి. సైద్ధాంతిక, పక్షపాత గంతలు కట్టుకుని వాస్తవాలను చూస్తున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) నుంచి, తరచు ఎన్‌సిఆర్‌ నుంచి మాత్రమే మన సువిశాల భారతదేశ సంఘటనలు, పరిణామాలను అవి చూస్తున్నాయి. అధికార పీఠానికి అన్ని విధాల చేరువలో ఉండడం వాటిని ప్రలోభపరుస్తుంది, సంతృప్తి పరుస్తుంది. కనుకనే వార్తాపత్రికల సంపాదకీయ పుటలో కేంద్ర కేబినెట్‌ మంత్రుల వ్యాసాలు తరచు ప్రచురితమవుతుంటాయి. ఇక టెలివిజన్‌లో భారతావని విలక్షణ వైవిధ్యం భిన్న పార్టీలకు చెందిన రాజకీయ వేత్తల మధ్య అరుపులు, కేకల వ్యవహారానికి పరిమితమవుతోంది! ఈ కారణంగానే మన సువిశాల మాతృభూమి వేర్వేరు ప్రాంతాలలోని విభిన్న సామాజిక సముదాయాల జీవనస్థితిగతులపై నిశిత, సమగ్ర అధ్యయనాలకు సంబంధించిన కథనాలకు ‘జాతీయ’ వార్తాపత్రికలలో అల్ప ప్రాధాన్యం మాత్రమే లభిస్తుండగా, ‘జాతీయ’ టెలివిజన్‌లో అసలు ప్రస్తావనకే నోచుకోవడం లేదు! ‘జాతీయ మీడియా’పై నా సంశయాలు సంవత్సరాలుగా పెరుగుతూనే ఉన్నాయి.


అవి సహేతుకమైనవని పెద్ద ఎత్తున వెల్లడవుతోన్న ఒక జాతీయ కళంకం గురించిన రెండు ప్రశస్త వ్యాస సంకలనాలు ధ్రువపరిచాయి. మరి ఎన్‌సిఆర్‌లోని ఏ టెలివిజన్‌ స్టూడియోలోను ఆ విషయమై ఎన్నడూ ఎలాంటి చర్చ కనీస మాత్రంగానైనా జరగలేదు. జరగగలదనే ఆశాభావానికి సైతం ఆస్కారం లేదు. నేను ప్రస్తావించిన లజ్జాకర విషయం గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ప్రణాళికా బద్ధ విధ్వంసం. చెన్నై నుంచి వెలువడే ఫ్రంట్‌ లైన్‌ మ్యాగజైన్‌ (3 మార్చి, 2025 సంచిక), పంకజ్‌ సేఖ్సారియ సంకలనం చేసిన వ్యాస సంపుటంలో ఆ అంశంపై నిశిత, విపుల వ్యాసాలు ఉన్నాయి. పంకజ్‌ సంకలనం ‘The Great Nicobar Betrayal’ ఒక దుర్బల దీవిని ప్రభుత్వం బుద్ధిపూర్వకంగానే విపత్తులోకి నెట్టివేస్తోందని పేర్కొంది. పంకజ్‌ స్వయంగా అండమాన్‌ నికోబార్‌ దీవులలో పలు సంవత్సరాల పాటు పరిశోధన నిర్వహించారు. ఆయన సంకలనంలోని వ్యాస రచయితలకు కూడా ఆ దీవుల స్థితిగతుల గురించి పరిశోధనల రూపేణా ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రాజెక్టుతో గ్రేట్‌ నికోబార్‌ దీవికి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆ వ్యాసాలు అన్నీ స్పష్టం చేశాయి ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,000కోట్లు. ఇది ఇంకా తప్పకుండా పెరుగుతుందని నిశ్చితంగా చెప్పవచ్చు. ఈ దుర్భల దీవిలో ఒక నౌకాశ్రయం, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్‌ ప్రధాన భూభాగం నుంచి వలసవెళ్లే లక్షలాది ప్రజల ఆవాసానికిగాను ఒక పట్టణాన్ని ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. 910 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్‌ నికోబార్‌ దీవి నికోబార్ దీవుల సముదాయంలో చాలా పెద్దది. ‘అండమాన్‌, నికోబార్‌’ అనే ద్వీప సముదాయంలో భాగంగా ఉన్న గ్రేట్‌ నికోబార్ భూకంపాలకు ఆస్కారమున్న ప్రాంతం. ఈ దీవిలో గత దశాబ్దంలో 400కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 2004లో గ్రేట్‌ నికోబార్‌ సునామీ తాకిడికి గురయింది. దీవి అంతా ధ్వంసమయింది.


ఆ దీవివాసులు అయిన ఆదివాసీలలో అనేక మంది సునామీలో కొట్టుకుపోయారు. మరెంతో మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఆ సముద్ర ఉత్పాతం ఊహించని, ఆకస్మిక పరిణామం. అయితే ఇప్పుడు అమలవుతున్న కొత్త ప్రాజెక్టు ప్రభుత్వం ఒక విపుల ప్రణాళికతో ఆ దీవి ప్రాకృతిక, సాంస్కృతిక సమగ్రతపై సంకల్పించిన దాడి! అవును, అక్షరాలా దౌర్జన్యమే, సందేహం లేదు. నౌకాశ్రయ నిర్మాణంతో అరుదైన భారీ తాబేళ్ల ఆవాస ప్రదేశాలన్నీ ధ్వంసమవుతాయి. ఇంకా పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతుంది. నిర్మించనున్న పుర నివేశం (టౌన్‌షిప్‌)తో 130చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని కోటికి పైగా వృక్షాలు ఉన్న దట్టమైన అడవి అంతరించిపోతుంది. ఈ దీవి చాలా అరుదైన, స్థల విశిష్ట వృక్ష, కీటక, పక్షి, జంతు జాతులు, సరీసృపాలకు నెలవు. ఈ జీవ వైవిధ్యమంతా నాశనమై పోతుంది. ఇదంతా పర్యావరణ పరమైన హాని కాగా సామాజిక మూల్యాలు అంతే తీవ్రమైనవి. అసలే దుర్బలురు అయిన ఆ దీవి మూలవాసులు అందరూ మరింతగా పేదరికంలోకి జారిపోతారు. గిరిజన సముదాయాలను కాపాడాలనే రాజ్యాంగ నిర్దేశాలు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతాయి. గ్రేట్‌ నికోబార్‌లో ప్రస్తుతం 8500 మంది నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలయితే జనాభా సంఖ్య 40 రెట్లు పెరుగుతుంది. ఆ దీవి సంస్కృతి, పర్యావరణంపై భారతదేశ ప్రధాన భూభాగం నుంచి జనాభా వలసల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ మార్పు చాలా హానికరంగాను, మార్చలేనిదిగాను ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


అండమాన్‌ నికోబార్‌ దీవులలో విస్తృతంగా క్షేత్ర పరిశోధనలు చేసిన అజయ్‌ సైని, అన్విత అబ్బి ఇటీవల ఒక వ్యాసంలో ఇలా రాశారు: ‘గ్రేట్‌ నికోబార్‌ మెగా ప్రాజెక్టు కేవలం ఒక పర్యావరణ విపత్తు మాత్రమే కాదు; అభివృద్ధి పేరిట జరుగుతున్న ఉద్దేశపూర్వక, భయంకర, భాషాసంబంధి, సాంస్కృతిక జాతి సంహారం’. ఈ మెగా ప్రాజెక్టు గ్రేట్‌ నికోబార్‌ను సామాజిక నిర్మాణాలను పర్యావరణ వ్యవస్థలనూ పూర్తిగా ధ్వంసంచేస్తుంది. ఆర్థిక లబ్ధిపరంగా చూసిన అది సమర్థనీయమైన ప్రాజెక్టు కానేకాదు. ఫ్రంట్‌లైన్‌లో వెలువడిన ఒక వ్యాసం శీర్షిక ‘The numbers do not add up’ (సంఖ్యలు కలిసిరావు) ఆ వాస్తవాన్ని ప్రభావదాయకంగా చెప్పింది. నౌకాశ్రయం, పర్యాటక రంగం నుంచి సంభావ్య రాబడి పెద్దగా ఉండదని, ఆ ప్రాజెక్టును ఆర్థికంగా ప్రయోజనకరంగా చేయదని రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిచేందుకు భారీ ధనరాశులను ఉపయోగించడం వాస్తవంగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ ప్రయోజనాలకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాసాలను చదవడం ద్వారా ఆ దీవి పర్యావరణాన్ని పరిరక్షించి సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించవలసిన శాసన విహిత బాధ్యతలు ఉన్న ప్రభుత్వ సంస్థలు, ఆదివాసీల హక్కులను రక్షించవలసిన రాజ్యాంగ బాధ్యత ఉన్న అధికారులు తమ విధ్యుక్త ధర్మాలను ఎలా విస్మరిస్తున్నారో దిగ్భ్రాంతి గొలుపుతుంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, భారతీయ వన్యప్రాణుల సంస్థ, నీతి ఆయోగ్‌, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్షేత్ర వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించకుండా, సాధ్యాసాధ్యాలను నిర్దుష్టంగా అంచనా వేయకుండా మెగా ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను ఎంత నిరాలోచనగా మంజూరు చేశాయో పంకజ్‌ సంకలన గ్రంథం, ఫ్రంట్‌లైన్‌లోని వ్యాసాలు విపులంగా వివరించాయి.


ఈ హానికర వ్యవహారంలో గౌరవనీయ శాస్త్రవేత్తలు సైతం భాగస్వాములు కావడం కలవరం కలిగిస్తోంది. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ మాజీ డైరెక్టర్‌ ఒకరు 2018లో ఈ మెగా ప్రాజెక్టుకు ఆక్షేపణ తెలుపడాన్ని పంకజ్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. ‘చాలా ఆందోళనకరమైన ప్రాజెక్టు అని, దాన్ని అమలుపరిస్తే ప్రపంచ సాగర జీవవైవిధ్యపు అరుదైన ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమవుతాయని’ ఆ శాస్త్ర వేత్త అన్నారు. ‘గ్రేట్‌ నికోబార్‌ జీవ వైవిధ్యాన్ని యథాతథంగా పరిరక్షించాలని, ఆ దీవి స్వతస్సిద్ధ పర్యావరణ వనరులను జాతీయ ఆస్తులుగా పరిరక్షించాలని ఆ శాస్త్రవేత్త సూచించారు. అయితే కొద్ది సంవత్సరాల అనంతరం ఒక ప్రభుత్వ కమిటీ చైర్మన్‌గా నియమితుడైన ఆ శాస్త్రవేత్త మాట మార్చి గ్రేట్‌ నికోబార్‌లో ఆ ప్రతిపాదిత మెగా ప్రాజెక్టును అమలుపరిచి తీరాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు! స్వతంత్ర వైఖరి ఉన్న యువ శాస్త్రవేత్తలు ఆ మెగా ప్రాజెక్ట్‌ను స్ఫూర్తిదాయకంగా వ్యతిరేకించారు. యువ పర్యావరణవేత్తలు రోహన్‌ అర్థర్‌, టిఆర్‌ శంకర్‌ రామన్‌లు ఫ్రంట్‌లైన్‌లో రాసిన ఒక వ్యాసంలో గ్రేట్‌ నికోబార్‌లోని సమృద్ధ జీవ వైవిధ్యాన్ని, అక్కడి ఆదివాసీ సమూహాలకు తమ ప్రాకృతిక పరిసరాలతో ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని వివరించి, ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు ‘నష్టపరిహారంగా అభివృద్ధిపరిచే అడవులు’, దెబ్బతిన్న ప్రవాళ భిత్తికల ‘పునరుద్ధరణ’ పథకాలు ప్రయోజకరమైనవి కాబోవని’ స్పష్టం చేశారు. ‘ప్రణాళికాబద్ధ పర్యావరణ విపత్తును వైజ్ఞానిక పరిశోధకులుగా మేము సమర్థించలేమని’ వారు నిక్కచ్చిగా చెప్పారు.


పంకజ్‌ సంకలన గ్రంథానికి ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ముందు మాట రాశారు. ‘పాలక వర్గాలు పర్యావరణ భద్రతను కాపాడేందుకు, సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పూనుకోవనేది ప్రపంచ దేశాల అనుభవం. ప్రజా ఉద్యమాలు మాత్రమే ప్రభుత్వాలు అలా పర్యావరణ, ప్రజాహితకరంగా వ్యవహరించేలా చేస్తాయి’ అని గాడ్గిల్‌ పేర్కొన్నారు. గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్ట్‌ను నౌకా లేదా వాణిజ్య మంత్రిత్వ శాఖ కాకుండా హోం మంత్రిత్వ శాఖ నిర్వహించడం గమనార్హం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం కూడా. ప్రాజెక్ట్‌పై విమర్శలు, ఆక్షేపణలను ముందుగానే అణచివేసేందుకే ఇలా జరుగతుందన్నది స్పష్టం. నిజానికి జర్నలిస్టులు ఇప్పుడు ఆ దీవిని సందర్శించడం అంతకంతకూ కష్టతరమవుతోంది. ఈ వ్యాసరచనకు ఆధారాలు అయిన క్షేత్ర పరిశోధనలు నిర్వహించిన రచయితలు, యువ పరిశోధకులు ఆ మెగాప్రాజెక్ట్‌ను తప్పుపడుతూ, దాని సంభావ్య విపత్కర పర్యవసానాలకు పాలకులే బాధ్యులు అని నిష్కర్షగా చెప్పారు. ఇందుకు వారు మన ఉమ్మడి కృతజ్ఞతలకు పాత్రులు. వారు అదే సమయంలో మన ‘జాతీయ మీడియా’ సిగ్గుపడేలా చేశారు సుమా!

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Apr 05 , 2025 | 05:58 AM