Share News

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:25 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఉండబోదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి.

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

  • పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం వెనకడుగు

  • గత నిర్ణయాలపై సమీక్ష.. ప్రజావ్యతిరేకతపై విశ్లేషణ

  • ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్వవైభవం తెచ్చేలా యోచన

  • ఈ క్రమంలోనే కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఉండబోదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి. తాజా ఎన్నికల్లో ఊహించని విధంగా సీట్లు కోల్పోయిన బీజేపీ గతంలో తాను తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి దారితీసిన అంశాలేమిటో విశ్లేషించుకుంటోంది. ‘పెట్టుబడుల ఉపసంహరణ-ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ’ అందులో ప్రధానమైనదిగా గుర్తించి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే కొంత సమాచారం ఉండడం వల్లే విశాఖ స్టీల్‌ ప్లాంటును సందర్శించినప్పుడు మంత్రి కుమారస్వామి ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉండదని, ప్రధానికి అన్నీ వివరించి రెండు నెలల తరువాత సరైన నిర్ణయం ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పక్కనపెట్టి, వాటిని మళ్లీ పట్టాలపైకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను మాత్రం నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారానే సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఆదాయం రాని స్థిరాస్తులు ఇప్పటికే గుర్తించారు. వాటిని సరైన రీతిలో విక్రయించి, ఆయా మొత్తాలను వాటిలోనే పెట్టుబడులుగా పెట్టి, శిక్షణ పొందినవారిని ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించి, ఆయా సంస్థలు పూర్వం ఎలా సమర్థంగా పనిచేశాయో అదే స్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలో విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ, విక్రయ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్టేనని అంటున్నారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో ఉత్పత్తికి ఎటువంటి విధానాలు అనుసరిస్తారనే దానిపై స్పష్టత లేదు. సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలా వీలుకాకపోతే యాజమాన్య బాధ్యత సెయిల్‌కే ఇచ్చి, ప్లాంటునడపాలని కోరుతున్నారు. ఈ రెండూ కాకుంటే అవసరమైన రుణాలు తీసుకోవడానికి రాష్ట్రపతి పేరిట ఉన్న భూములను ప్లాంటు పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతున్నారు. వీటిలో ఏదైనా అభ్యంతరం లేదని చెబుతున్నారు. వీటిని ఒకవైపు పరిశీలిస్తూనే, మరో వైపు ప్లాంటుకు చెందిన నిరర్థక ఆస్తులను అమ్మడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చెన్నై, హైదరాబాద్‌లలో మార్కెట్‌ యార్డులను విక్రయించాలని ప్రతిపాదించారు. ఇలా ఎన్ని ఆస్తులు విక్రయిస్తారో తెలియదు. అయితే విశాఖ స్టీల్‌ప్లాంటు విషయంలో అనుసరించబోయే ప్రణాళిక ఏమిటో వివరించాకే ఈ ఆస్తుల ప్రక్రియ కొనసాగించాలని అధికార, కార్మిక వర్గాలు సూచిస్తున్నాయి.

Updated Date - Jul 13 , 2024 | 09:16 AM