CBI: జగన్ అక్రమాస్తుల కేసులో పలు కీలక అంశాలు వెల్లడించిన సీబీఐ
ABN , Publish Date - May 02 , 2024 | 07:32 AM
న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.
న్యూఢిల్లీ: సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల (Jagan Illegal Assets Case) విచారణకు ప్రత్యేక కోర్టు (Special Court) ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme Court) సీబీఐ అఫిడవిట్ (CBI Affidavit) దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. కేసులో దాఖలైన క్వాష్ (Quash), డిశ్చార్జ్ (Discharge) పిటిషన్లపై (Petition) తీర్పులు ఇవ్వక ముందే ఆరుగురు న్యాయమూర్తుల బదిలీ అయ్యారని, ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు అయ్యాయని, వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే... జడ్జీలకు స్థానచలనం అవుతోందని సీబీఐ పేర్కొంది.
తాజా న్యాయమూర్తి కూడా కనీసం రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని, ఈ కేసులో ఉన్న నిందింతులు అంతా... శక్తిమంతులేనని సీబీఐ పేర్కొంది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారని, విచారణ వేగంగా జరగాలంటే సీబీఐ కోర్టులో ఖాళీలు భర్తీచేయాలని సీబీఐ అభిప్రాయపడింది. ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టుకు సీబీఐ దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇందులో 911 మంది సాక్షులున్నారని, అంతా 50 ఏళ్లు పైబడిన వారేనని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి విచారణలో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
గత విచారణ సందర్భంగా... సీబీఐ తీరుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందు ఉంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు 2013లో దాఖలైంది. ఆ తర్వాత 95 మంది నిందితులు, కంపెనీలు... డిశ్చార్జి పిటీషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారని.. నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లలో ఒకటి హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
2013 తర్వాత 95 మంది నిందితులు, కంపెనీలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను విచారించిన ఆరుగురు న్యాయమూర్తులు మాత్రం ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయ్యారని ఈ కేసులో ఉన్నత స్థానాల్లో ఉన్న శక్తిమంతమైన రాజకీయ నాయకులున్నారని సీబీఐ పేర్కొంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారంది. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నాయని, ఈ కేసులోని ప్రధాన నిందితుడు, ఇతర సహ నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ కింది కోర్టులో విచారణ ప్రక్రియ సాగకుండా, తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పిందని సీబీఐ పేర్కొంది. కేసుల విచారణలో జాప్యానికి కారణం కోర్టులు కాదని.... అందుకు పిటిషనర్, ఇతర నిందితులే కారణమని ఆ తీర్పులో ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు సీబీఐ పేర్కొంది. చట్టంలోని వివిధ నిబంధనల కింద నిందితులు ఒకదాని తర్వాత ఒక పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారని హైకోర్టు తన తీర్పులో తెలిపిందని, ప్రధాన నిందితుడో, సహనిందితులో ఎవరో ఒకరు ఏదో ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉపశమనం కోరుతూ రావడం వల్లే విచారణలో జాప్యం జరుగుతున్నట్లు హైకోర్టు తేల్చి చెప్పిందని, దీనికితోడు 95 మంది నిందితులు, కంపెనీలు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశాయని దర్యాప్తు పేర్కొంది.
2013 నుంచి ఇప్పటివరకు సీబీఐ కోర్టుకు అరుగురు ముఖ్య న్యాయమూర్తులు వచ్చారని, వారంతా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్నప్పటికీ తుది ఉత్తర్వులు జారీ చేయక ముందే బదిలీ అయిపోయారని సీబీఐ దర్యాప్తు సంస్థ తెలిపింది. ప్రస్తుత సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి 2022 మే 4న బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని డిశ్చార్జి పిటిషన్లపై నిర్దిష్ట సమయానుగుణంగా విచారణ జరిపారని, సుమోటో రిట్ పిటిషన్ 11/2023లో తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ దిశ్చార్జి పిటిషన్లపై ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 30వ తేదీన వాటిపై తీర్పు వెలువరించాల్సి ఉందని సీబీఐ తెలిపింది. కానీ ఆయన మాత్రం బాధ్యతలు చేపట్టి కనీసం రెండేళ్లు పూర్తికాక ముందే బదిలీ అయిపోయారని పేర్కొంది.
ప్రస్తుతం హైదరాబాద్ సీఐబీ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారని, ప్రస్తుతం అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతలనూ ఒకే ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారని సీబీఐ తెలిపింది. ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసుపై రోజువారీగా విచారణ చేపట్టారంది. ఎమ్మార్, వివేకానందరెడ్డి హత్యలాంటి సున్నిత కేసులతోపాటు, హైదరాబాద్ లోని సీబీఐ, ఏసీబీ విభాగం, బెంగుళూరులోని సీబీఐ బీఎస్ఎఫ్‌బి విభాగం, చెన్నైలోని సీబీఐ ఈఓడబ్ల్యూ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులనూ ప్రిన్సిపల్ జడ్జే విచారిస్తున్నారంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు, ప్రిన్సిపల్ జడ్జి కోర్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో.... 911 మంది సాక్షులు, లక్షల పేజీలున్న 1,671 డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటన్నింటినీ ట్రయల్ కోర్టు పరిశీలించి విచారించాల్సి ఉందంది. ఈ కేసులో చాలా మంది సాక్షులు 50 ఏళ్లు పైబడిన వారు, సీనియర్ సిటిజన్లు ఉన్నారని వారందర్నీ విచారణ సమయంలో కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది. అందువల్ల జగన్మోహన్రెడ్డి ఆక్రమాస్తులకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీకో, మరేదైనా కోర్టుకో బదిలీ చేస్తే అది సాక్షులకు అనవసరమైన ఇబ్బందులను తెచ్చి పెడుతుందని, అందువల్ల ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీచేయాలన్న వాదనను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
గ్రాబింగ్ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!
నవ సందేహాలకు జగన్ జవాబివ్వాలి: షర్మిల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News