‘విడదల రజనీ’ కిడ్నాప్‌పై విచారణకు ఆదేశించండి
ABN , Publish Date - Apr 28 , 2024 | 03:25 AM
ఎస్సీ మహిళ విడదల రజనీ కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న గుంటూరు పశ్చిమ ఆర్వో రాజ్యలక్ష్మిపై తగిన చర్యలు తీసుకోండి
సీఈవోకు నన్నపనేని, మన్నవ సుబ్బారావు ఫిర్యాదు
అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఎస్సీ మహిళ విడదల రజనీ కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి ఆమేరకు ఫిర్యాదు చేశారు. ‘గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఈ నెల 25న ఎస్సీ మహిళ విడదల రజనీ సిద్ధమయ్యారు. అమితు ఆమె కిడ్నాప్ అయ్యారు. వైసీపీ అభ్యర్థి పేరు కూడా విడదల రజనీ కావడంతో వారు, పోలీసులతో కలసి కుట్రపూరితంగా ఈ కిడ్నాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన ఆ హక్కును కాలరాస్తూ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ఎస్సీ మహిళ అయినందునే ఈ కిడ్నా్‌పకు పాల్పడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని పొందుపర్చిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడదల రజనీ అఫిడవిట్‌ను పరిశీలించకుండా, ప్రతిపక్షాల ఫిర్యాదులను పట్టించుకోకుండా వ్యవహరించిన రిటర్నింగ్ అధికారి రాజ్యలక్ష్మిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని సీఈవోకి ఫిర్యాదు చేశారు.