టీడీపీ నాయకురాలి ఇంటిపైకి పెట్రోల్ బాంబు
ABN , Publish Date - May 29 , 2024 | 03:51 AM
టీడీపీ నాయకురాలి ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. అది ప్రహరీ గేటుకు తగిలి బయటే పడిపోవడంతో ప్రమాదం తప్పింది. ఇది వైసీపీ నేతల పనేనని బాధిత కుటుంబం,

గేటుకు తగిలి పడిపోవడంతో తప్పిన ప్రమాదం
ప్రకాశం జిల్లా జంగనర్సాయపల్లిలో ఘటన
పోలీసుల అదుపులో నలుగురు వైసీపీ సానుభూతిపరులు?
వెలిగండ్ల, మే 28: టీడీపీ నాయకురాలి ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. అది ప్రహరీ గేటుకు తగిలి బయటే పడిపోవడంతో ప్రమాదం తప్పింది. ఇది వైసీపీ నేతల పనేనని బాధిత కుటుంబం, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పందువనాగులవరం పంచాయతీ పరిఽధిలోని జంగనర్సాయపల్లిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిందీ దారుణం. గ్రామానికి చెందిన తీట్ల చెన్నలక్ష్మి టీడీపీ మండల నాయకురాలు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి మద్దతుగా ఆమె పనిచేశారు. దీంతో పగ పెంచుకున్న ప్రత్యర్థులు చెన్నలక్ష్మి కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది. చెన్నలక్ష్మి కుటుంబ సభ్యులతో ఆరుబయట నిద్రిస్తుండగా మంగళవారం వేకువజాము రెండు గంటల సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి.. పెట్రోల్ నింపిన బీరు బాటిల్‌కు నిప్పంటించి ఆమె ఇంట్లోకి విసిరారు. అది ప్రహరీగేటుకు తగిలి అక్కడే పడిపోవడంతో ప్రమాదం తప్పింది. పేలిన శబ్దం, మంటలు రావడంతో ఉలిక్కిపడి లేచిన కుటుంబసభ్యులు పెద్దగా కేకలు వేయడంతో దుండగులు మిగిలిన రెండు పెట్రోల్ బాటిళ్లను రోడ్డుపై పడేసి పారిపోయారు. తమను అంతమొందించేందుకు వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని చెన్నలక్ష్మి కుటుంబసభ్యులు ఆరోపించారు. కనిగిరి డీఎస్పీ రామరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామానికి చెందిన నలుగురు వైసీపీ సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.