ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajamahendravaram : నలుగురిపై వేటు

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:29 AM

పోలవరం భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

  • ‘పోలవరం ఫైళ్లకు నిప్పు’ కేసులో సస్పెన్షన్‌

  • ఇద్దరు డీటీలకు షోకాజ్‌.. విచారణాధికారిగా జేసీ

  • ఎవరినీ రక్షించాలనే ప్రయత్నాలొద్దు

  • బాధ్యులపై చర్యలు తప్పవు: మంత్రి దుర్గేశ్‌

  • తగలబెట్టిన పత్రాలన్నీ జిరాక్స్‌ కాపీలు,

  • పనికిరాని కాగితాలన్న ఆర్డీవోపై ఆగ్రహం

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/ధవళేశ్వరం, ఆగస్టు 18: పోలవరం భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు అధికారులకు షోకాజు నోటీసులు ఇచ్చారు. సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్‌ కె.రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేయగా, డిప్యూటీ తహశీల్దార్లు ఎం.కుమారి, ఎ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించామని, ఆర్డీవో ప్రాథమిక విచారణలో అవి ప్రాధాన్యం లేని పత్రాలుగా గుర్తించినప్పటికీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని చెప్పారు. కాగా, ఈ ఘటనపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చినరాముడును కలెక్టర్‌ నియమించారు. ఆయన ధవళేశ్వరం ఇరిగేషన్‌ ఆఫీసుకు వెళ్లి, పరిస్థితిని ఆరా తీశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎస్పీ నరసింహ కిశోర్‌ స్వయంగా ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు.


ధవళేశ్వరం పీఎ్‌సలో కేసు

ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై డిప్యూటీ కలెక్టర్‌ కె.వేదవల్లి ధవళేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఎస్పీ నరసింహ రమేష్‌ ఆదేశాల మేరకు సెక్షన్‌ 326(ఎఫ్‌) రెడ్‌విత్‌ 3(5) భారతీయ న్యాయ సమ్మత చట్టం, సెక్షన్‌ 4 ఆఫ్‌ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం-1984 ప్రకారం సీఐ గణేష్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సస్పెండైన ఉద్యోగులతో పాటు షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడానికి రైతుల దగ్గర నుంచి ఏ రికార్డులు తీసుకుంటారు? ఆఫీసులో ఎలాంటి రికార్డులు నిర్వహిస్తారు? నిర్వాసితులకు నష్టపరిహారం అందించే విధివిధానాలు ఏమిటి? అని ప్రశ్నిస్తూ, వాటికి పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసులు అందజేశారు.


పరిహారం కోసం జిరాక్స్‌లే ఇస్తారు: ముప్పాళ్ల

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చేటప్పుడు అధికారులకు సంబంధిత రైతులు ఆధార్‌, రేషన్‌కార్డులకు సంబంధించిన జిరాక్స్‌ పత్రాలే ఇస్తారని, అధికారులు అవి జిరాక్స్‌లే.. ఇబ్బందిలేదని చెప్పడం సరికాదని ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఆదివారం ఆయన ధవళేశ్వరంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ భద్రపరచాలని చెప్పినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. పెద్దిరెడ్డి అక్రమాలు మదనపల్లిలో బయటపడిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో జగన్‌ ప్రభుత్వం శ్మశానాలు, ప్రభుత్వ భూములను వైసీపీ వాళ్లపేర రాయించుకుని, అధికారులకు లంచాలు ఇచ్చి, పరిహారం దోచేశారని ఆరోపించారు. వీటన్నింటిపైనా విచారణ చేయాలని ముప్పాళ్ల డిమాండ్‌ చేశారు.


జూన్‌ నాటికి విశాఖకు నీరు

ఇటీవల సీఎం చంద్రబాబు అనకాపల్లిలో పర్యటించిన సందర్భంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిస్థితిని పరిశీలించి, వచ్చే జూన్‌ నుంచి విశాఖపట్నానికి మంచినీరు, పరిశ్రమలకు 23.44 టీఎంసీల నీరు అందివ్వాలని సర్కిల్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తునిలో ఉన్న ఎల్‌ఎంసీ సర్కిల్‌ అధికారులు అత్యవసర పనుల కోసం రూ.1,093 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. ఈఎల్‌ఎంసీ కోసం మొత్తం 202 కిలోమీటర్ల మేర 10,306 ఎకరాల భూమి సేకరించారు.

ఇంకా 43.68 ఎకరాల సేకరించాల్సి ఉంది. ఈ కాలువ పనులను 8 ప్యాకేజీలుగా విభజించారు. 2వ ప్యాకేజీ పనులు పూర్తయ్యాయి. మిగతా ప్యాకేజీల్లో కొంతమేర పనులు జరిగాయి. ఇంతలోనే భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటన చోటు చేసుకుంది.


ఎన్నో అనుమానాలు

గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దేవీపట్నం తదితర వరద ప్రాంతాల నుంచి జనం బయటకు వచ్చేట్టు ఒత్తిడి చేసింది కానీ, వారికి పునరావాసం కల్పించలేదు. పూర్తిగా నష్టపరిహారమూ ఇవ్వలేదు. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి కూడా చాలావరకూ భూసేకరణ పూర్తయింది.

అందులో కూడా సమస్యలున్నాయి. భూసేకరణలో లోపాలున్నాయి. ఒకరి పేరు మీద వేరేవారు డబ్బులు కాజేసిన సంఘటనలున్నాయి. చాలామందికి న్యాయపరంగా ఇవ్వకుండా, బినామీ పేర్ల మీద కూడా రూ.కోట్లు కాజేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి ఫైళ్లకు నిప్పు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.


అన్ని కోణాల్లో విచారణ: దుర్గేశ్‌

పోలవరం భూసేకరణ కార్యాలయ ఆవరణలో పలు పత్రాలు, ఫైళ్లు తగులపెట్టిన ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆదివారం ఉదయం ఆయన ధవళేశ్వరంలోని కార్యాలయానికి వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సెక్షన్‌ సిబ్బందితో మాట్లాడుతూ ఎవరి అనుమతి లేకుండా ఫైళ్లకు నిప్పు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించారంటూ మండిపడ్డారు. సొంత ఇంట్లో చెత్త తగులబెట్టినట్లుగా ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను కాల్చేస్తారా అని ప్రశ్నించారు.

అవన్నీ జిరాక్స్‌ కాపీలు, అవసరం లేని పత్రాలుగా పేర్కొన్న ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎవరినీ రక్షించే ప్రయత్నాలు చేయవద్దన్నారు. కాలిపోయిన పత్రాల్లో ఒరిజినల్స్‌ కూడా ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జేసీని ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, పోలవరం ఫైళ్ల దహనం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ నరసింహ కిశోర్‌ తెలిపారు. ఉదయం పోలవరం భూ సేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సిబ్బందిని ఆయన విచారించారు. పత్రాలు, ఫైళ్లు తగులబెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. విచారణాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి కుట్రకోణం దాగి ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


రెండు రోజుల్లో నివేదిక: జేసీ

ఫైళ్ల దహనం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని జాయింట్‌ కలెక్టర్‌ చినరాయుడు తెలిపారు. రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నామని, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.

Updated Date - Aug 19 , 2024 | 04:30 AM

Advertising
Advertising
<