Andhra Pradesh: పేదలకు ఇసుక ఉచితం!
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:23 AM
పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
విధివిధానాల తయారీకి సీఎం ఆదేశం..
జగన్ పాలసీతో ప్రజలకు తీవ్రనష్టం
ఇప్పటికీ వైసీపీ నేతల చేతుల్లోనే డంప్‌లు..
వాటిని ఇంకా స్వాధీనం చేసుకోలేదా?
గనుల శాఖ డైరెక్టర్‌ను ఆరా తీసిన చంద్రబాబు..
ఎవరైనా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవాల్సిందే: సీఎం
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది.. పేదలకు ఎలాంటి మేలు జరిగింది.. 2019-24(మే) వరకు ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది.. ఎవరు లబ్ధిపొందారు.. ప్రభుత్వానికి జరిగిన నష్టం.. పేదలు, గృహ నిర్మాణరంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని ఆదేశించారు. మంగళవారమిక్కడ సచివాలయంలో గనుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఇసుకపై సమీక్ష జరిపారు.
జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహనిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు నివేదించినట్లు తెలిసింది.
ఈ ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను సీఎం ఆరా తీశారు ‘ఆ ఇసుకను ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? భారీ కొండలను తలపించే డంప్‌లు ఎవరి అధీనంలో ఉన్నాయి? వాటిని ఇంకా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదా’ అని అడిగారు. ఉచిత ఇసుక విధానంతోపాటు, గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి బుధవారం మరోసారి గనులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు.
ఇకపై ఆఫ్‌లైన్ ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుకతోపాటు ఇతర అమ్మకాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే విధానం తీసుకురావాలని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి బుధవారం సీఎంకు సమర్పించనున్నారు. సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కార్యదర్శి యువరాజ్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
పీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. భారత్‌లోని బెల్జియం రాయబారి వాండెర్ హసెల్ట్ నేతృత్వంలోని వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందం మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసింది. వారి భేటీ ఫోటోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
For More Andhra Pradesh News and Telugu News..