AP News : సోకులకే 120 కోట్లు
ABN , Publish Date - Jun 18 , 2024 | 04:12 AM
కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియారెడ్డికే
ఐటీ సలహాదారు శ్రీనాథ్‌రెడ్డి భార్యే సుప్రియ
జగన్ బెంగళూరు, హైదరాబాద్
ప్యాలెస్‌లకు అందాలు దిద్దింది ఈమే
వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ
తొలుత తాడేపల్లి.. తర్వాత రుషికొండ పనులు
పాంథియన్ డిజైన్స్ పేరిట ఇంటీరియర్, డిజైన్లు
ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే
ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధువనేదే అర్హతా?
రూ. వందకు అయ్యే పనికి వెయ్యి రూపాయలు
నీళ్లలా రూ. వందల కోట్ల ప్రజాధనం ఖర్చు
కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రుషికొండకు గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీదు రూ. 450 కోట్లు. ఇందులో కేవలం ప్యాలెస్‌లో సోకుల కోసమే రూ. 120 కోట్లకుపైగా ఖర్చుచేశారు. ఈ వర్క్స్‌ను తన సమీప బంధువు సుప్రియారెడ్డికి జగన్ అప్పగించారు. ఆయన రెండో కంటికి తెలియకుండా మూడేళ్లలో ఏకంగా రాజభవనాన్నే నిర్మించుకున్నారు. అలాగే, మూడో మనిషి చొరబడకుండా ప్యాలెస్‌లోని పనులను కూడా సమీప బంధువుకే అప్పగించిన వైనం ఇప్పుడు పర్యాటక శాఖలో చర్చనీయాంశంగా మారింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విలువలు, విశ్వసనీయత... ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, మాజీగా మారిన తర్వాతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుకుతున్న చిలుక పలుకులివి! ఆయనవి మాటలు మాత్రమే! ఆచరణకు ఆమడ దూరం. రుషికొండ మీద జనం సొమ్ముతో విలాసాల ప్యాలెస్ నిర్మించిన ఆయన... అదే ముసుగులో దగ్గరి బంధువుకు కోట్లు కుమ్మరించారు.
పర్యావరణాన్ని పణంగాపెట్టి వందల కోట్ల ప్రజాధనం నీళ్లుగా ఖర్చుచేసి వారితో రుషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారు. చెవ్వా సుప్రియారెడ్డి అనే సమీప బంధువే జగన్ అభిరుచికి తగినట్లుగా, భారతిరెడ్డి ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లు, ఇంటీరియర్‌ను రూపొందించారు. జగన్ వద్ద నాడు ఐటీ సలహాదారుగా పనిచేసిన దేవిరెడ్డి శ్రీనాధ్‌రెడ్డి భార్య సుప్రియారెడ్డి. జగన్ తరపున ఇసుక వ్యాపార సామ్ర్యాజాన్ని నడి పిన సోదరుడు అనిల్‌రెడ్డికి ఈమె సమీపబంధువు. ఆమెదీ, జగన్‌దీ ఒకే ఊరు. ఉమ్మడి కడప జిల్లా భక్రాపురంలో వారివి పక్కపక్క ఇళ్లే. సుప్రియారెడ్డికి చెందిన పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకే రుషికొండ టూరిజం ప్రాజెక్టు డిజైన్స్, ఆర్కిటెక్చువల్, ఇంటరీయర్ ప్రాజెక్టును ఇచ్చారు.
ఒక్క రుషికొండనే కాదు, రాష్ట్రంలోని టూరిజం ప్రాజెక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించినట్లుగా నాటి జగన్ ప్రభుత్వం ఓ నోట్‌ఫైల్‌లో పేర్కొంది. అయితే, ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన వర్క్ ఇచ్చారు....ఆ సంస్థకు ఉన్న అర్హతలు, అనుభవం ఏపాటివో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ సంస్థకు టెండర్ ఎలా ఇచ్చారనేదీ ఆ శాఖలో ఉన్నవారికి తెలియదు.
కానీ ఆ సంస్ధే రుషికొండ ప్రాజెక్టులో కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఆ సంస్థ పేరిట సుప్రియారెడ్డినే చక్రం తిప్పారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు వ్యయం 500 కోట్లకు చేరుకుంది. ఇందులో సుప్రియారెడ్డికి చేరింది ఎంత? నికరంగా ప్రభుత్వం రుషికొండపై ఖర్చుపెట్టినదెంతో తేలాల్సి ఉంది. ఇది తేలాలంటే సర్కారు రుషికొండ ప్రాజెక్టు వర్క్‌లపై సిట్‌తో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని పర్యావరణ, ఆర్థికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
జగన్ భవనాలకు అందాలు...
జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనే వ్యక్తిని తన ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. అయితే, అప్పటికే ఆయన భార్య సుప్రియారెడ్డి.. జగన్ భవనాలను చక్కదిద్దుతున్నారు. జగన్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్ ప్యాలె్‌సలకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లు, ఇంకా అదనపు హంగులు అద్దినది ఆమెనే. అయితే, అప్పటికి ఆమెకు ప్రత్యేకంగా కంపెనీలేదు. 2019లో మేలో జగన్ అధికారంలోకి వచ్చారు. తాడేపల్లిలోని తన ప్యాలె్‌సను క్యాంపు ఆఫీసుగా చేసుకున్నారు.
ఆ తర్వాత కొద్ది నెలలకే, ఆగస్టులో సుప్రియారెడ్డి డైరెక్టర్‌గా పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె భర్త దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, మరో వ్యక్తి డైరెక్టర్‌లుగా ఉన్నారు. తాడేపల్లి ప్యాలె స్‌ను పూర్తిస్థాయి క్యాంపు ఆఫీసుగా మార్చాక, అందులో ఆర్కిటెక్చువల్, ఇంటీరియర్ డిజైన్స్ సుప్రియారెడ్డియే చేశారని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె డిజైన్స్ నచ్చిన తర్వాతే జగన్ కుటుంబం సుప్రియాకు రుషికొండ ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఏ ప్రతిపాదికన ఇచ్చారు?
జగన్ వ్యక్తిగతంగా తన ఇంటి నిర్మాణం, డిజైన్ పనులను సుప్రీయారెడ్డికి ఇచ్చుకోవచ్చు. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, రుషికొండ ప్రాజెక్టు ప్రభుత్వానిది. ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా ఒకరికి అప్పగించాలంటే నిర్ధిష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. టెండర్‌లు పిలవాలి. అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలి. ఆ తర్వాతే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. మరి సుప్రియారెడ్డికి చెందిన పాంథియన్ డిజైన్స్‌కు ఏ ప్రాతిపదికన రుషికొండ ప్రాజెక్టు అప్పగించారు? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న.
నిజానికి రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజె క్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసేందుకు టెండర్లు పిలవగా, ఆర్వీ అసోసియేట్స్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దక్కించుకుంది. ప్రాజెక్టు వ్యయంలో మూడు శాతం ఫీజుగా ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం ఉంది. మరి పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఎలా ఎంపిక చేశారు? ఆర్కిటెక్చువల్, ఇంటీరియర్ డిజైన్స్ కోసం టెండర్లు పిలిచారా? నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చారా? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు.
ఆ కంపెనీని ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం వద్ద ఏ రికార్డూ లేదు. అయితే, ప్రాథమిక ఆర్కిటెక్చువల్ ప్లాన్‌లకు ఆ సంస్థ డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఓ ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా సేవలందించగలదా? అలా అని జగన్ చెబితే ప్రజలు నమ్మాలా? టూరిజం చెబుతోన్న వివరణలో మరో కోణం ఉంది. ప్రాథమిక డిజైన్లు ఉచితంగా ఇచ్చినా, అసలు సిసలైన డిజైన్లకు ఆ సంస్థ భారీగానే ఫీజులు తీసుకున్నట్టు చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.
సుందరీకరణకు 120 కోట్లపైనే....
రుషికొండ ప్యాలెస్ బడ్జెట్ ఎంత? తొలుత ఎన్ని కోట్లతో నిర్మించాలనుకున్నారు? ఆ తర్వాత ఎన్ని కోట్లకు చేరిందో తెలిస్తే జగన్ అభిష్టాల విలువ ఎంత ఖరీదో తెలిసిపోతుంది. ఫేజ్1-, ఫేజ్2 భవనాల నిర్మాణంకోసం 120 కోట్లు వ్యయం కానుందని అంచనావేశారు. కానీ ఇప్పుడు మొత్తం వ్యయం 450 కోట్లపైమాటే. ఇందులో అందాల కోసమే 120 కోట్లపైనే ఖర్చుపెట్టినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్‌లో 100 రూపాయలకు దొరికే వస్తువును అంతర్జాతీయ ప్రమాణాలు పేరుచెప్పి వెయ్యిరూపాయలకుపైనే కొనుగోలు చేయించినట్లు చెబుతున్నారు.ప్యాలె్‌సలో వాడిన కర్టెన్‌లు, వాటి పరికరాల ఖర్చు 10 కోట్లపైనే ఉంటుందని చెబుతున్నారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు, ఆయన, భారతీ కుటుంబం రుషికొండ ప్యాలెస్‌లో నివాసం ఉంటారు, క్యాంపు ఆఫీసు ఇక్కడే ఉంటుందన్న ధీమాతో ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుపెట్టించారు. ఇప్పటివరకు అక్కడ ఎంత ఖర్చుపెట్టారు...ఏ కేటగిరీలో ఎంత వ్యయం చేశారో ఆడిటింగ్ జరగ లేదు. ఏ పనికి ఎంత మేర నిధులు వాడాల్నో పరిమితి లేదు. దీంతో అడిగినంత ఇచ్చేశారు.
నచ్చినట్లుగా పరికరాలు కొన్నారు. ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని పణంగాపెట్టి రుషికొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులో అధికార, నిధుల దుర్వినియోగం బయటకు రావాలంటే ప్రత్యేకంగా సిట్‌తో విచారణ చేయించాలని పర్యావరణ, ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ఏమాత్రం అనుభవం లేని సుప్రియారెడ్డి కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇచ్చారో నిగ్గుతేల్చాలని, ఇందులో జగన్, ఇతరుల పాత్రపై విచారించాలని వారు కోరుతున్నారు.
‘అమ్మగారు చెప్పినట్లే చేయండి’
సుప్రియారెడ్డి ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా ఖరీదైనవని రుషికొండ ప్యాలెస్‌లోని ఏర్పాట్లు, వాటిపై చేసిన వ్యయాన్ని పరిశీలిస్తే అర్ధమవుతోంది. ప్రభుత్వ సొమ్మేకదా అని డిజైన్‌లు, ఇంటరీయర్స్‌కు, ఇతర హంగులు, ఆర్భాటాలకు అడ్డగోలుగా ఖర్చుచేయించారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
యూరోపియన్, ఇటాలియన్, అమెరికన్ సంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనబడేలా ఖరీదైన డిజైన్లు చేయించారని, దానిపై పరిమితికి మించిన ఖర్చుచేయించారని పర్యాటక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు. ’’అమ్మగారు చెప్పినట్లే చేయండి. అన్నీ ది బెస్ట్ ఉండాలి. ఎందులో రాజీపడినట్లుగా ఇంటీరియర్స్ ఉండకూడదు.’’ అని పలుసందర్భాల్లో ప్యాలె్‌సనుంచి టూరిజంలోని ఓ ఉన్నతాధికారికి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
‘తిరుపతిలో కొండపై వేంకటేశ్వరస్వామి గుడి కట్టలేదా? సింహాచలంలో నృసింహస్వామి ఆలయం నిర్మించలేదా? శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి ఆలయం లేదా?...జగన్ కోసం రుషికొండపై భవనం కడితే తప్పేమిటి?’
- నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఉవాచ