రైల్వే జోన్ కార్యాలయాలకు టెండర్లు
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:26 AM
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి శనివారం రాత్రి టెండర్ ప్రకటన జారీ అయింది.
రూ.149 కోట్ల అంచనాతో పిలుపు.. డిసెంబరు 27 వరకు గడువు
29న ప్రధాని పర్యటనలో శంకుస్థాపనకు చాన్స్.. ప్రహరీకి పునాదులు
విశాఖపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి శనివారం రాత్రి టెండర్ ప్రకటన జారీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ఎన్నికల ప్రచారానికి విశాఖపట్నం వచ్చినప్పుడు కొత్త రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోన్ కార్యాలయాలకు అవసరమైన భూముల కోసం అన్వేషించారు. విశాఖ మహా నగర పాలక సంస్థ, రైల్వే నుంచి గతంలో తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ముడసర్లోవలో 52 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉండడంతో కొంతకాలం వివాదం సాగింది. ఇవన్నీ కాకుండా డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వెనుకనున్న వైర్‌లెస్ కాలనీలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయాలని 2022, నవంబరులో ఏర్పాట్లు చేశారు. అయితే, ఏం జరిగిందో ఏమో రాత్రికి రాత్రి నిర్ణయం మార్చుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వైసీపీ ప్రభుత్వం భూముల అప్పగింతలో జాప్యం చేయడంతో జోన్ పనులు ప్రారంభించలేక పోతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
భూములు ఇస్తే వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. 2024లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టారు. రైల్వే శాఖకు వెంటనే భూములు అప్పగించాలని విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఆగస్టు నెలాఖరులో రైల్వేకి భూములు అప్పగించి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కూడా చేయించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఈ ఏడాది డిసెంబరులో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామని ప్రకటించారు. ఈ హామీ ప్రకారం డిసెంబరు నెల ఇంకా వారం రోజులు ఉండగానే జోన్ భవన నిర్మాణాలకు టెండర్ వెలువడింది. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురం సెజ్‌లో పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ ఏర్పాటు చేయబోయే హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ భవనాల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.
రూ.149.16 కోట్లు కేటాయింపు
విశాఖ నగరంలోని ముడసర్లోవలో రూ.149.16 కోట్ల వ్యయంతో రైల్వే జోనల్ కార్యాలయాలు నిర్మించనున్నారు. తొలుత దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తారు. ఇది 11 అంతస్థుల్లో ఉంటుంది. రెండు బేస్‌మెంట్లు ఉంటాయి. దీంతోపాటు ఇతర భవనాలు కూడా నిర్మిస్తారు. టెండర్లు సమర్పించడానికి డిసెంబరు 27 వరకు గడువుంది.
కార్యకలాపాలకు ఓకే
రైల్వే జోన్ భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి 24 నెలల గడువు విధించారు. అంటే రెండేళ్లు. అయితే, ఏయే నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తి చేయాలన్నది స్పష్టత లేదు. కాబట్టి నిర్మాణాలకు మరో ఏడాది అదనంగా పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు జోన్ కార్యకలాపాలు ప్రారంభించకుండా ఉండడం సమంజసం కాదు కాబట్టి, తాత్కాలికంగా ఖాళీగా ఉన్న భవనాల్లో తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.