BJP: వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..
ABN , Publish Date - Mar 15 , 2025 | 10:10 AM
BJP: తెలంగాణలో వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన జోష్‌తో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది.

కరీంనగర్: భవిష్యత్ రాజకీయాలపై తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ నుంచి పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో స్థానిక ఎన్నికలపై కమలం పార్టీ కసరత్తు అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా హై కమాండ్ అడుగులు వేస్తోంది.
ఫుల్ జోష్‌లో కమలం నేతలు..
కరీంనగర్ కేంద్రంగా పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో కమలం నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. కరీంనగర్‌లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే వ్యూహంతో వెళ్లాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరీంనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీకి కరీంనగర్‌లో అంతకంతకూ ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీకి లేని ఫామ్.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం కలిసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావం చూపించింది. ఈ ఎన్నిక ఉత్తర తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేసేలా బీజేపీ హై కమాండ్ దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం దిగువ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.
అగ్ర నేతలకు ఆదేశాలు..
ఈ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేతలు పాల్గొనాలని హై కమాండ్ ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బాధ్యులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చెబుతోంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రజల్లో బలం ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేలా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. గ్రామస్థాయిలో బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేలా ప్లాన్ చేస్తోంది.
హై కమాండ్ ప్లాన్ ఇలా..
బలమైన నేతలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడుతుందని హై కమాండ్ భావిస్తోంది. నేతలు కలిసికట్టుగా పని చేయాలని.. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్లాలని హై కమాండ్ చెబుతోంది. హై కమాండ్ ఆదేశాలతో ఆయా జిల్లాల్లో పట్టు సాధించడం కోసం అగ్రనేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో నేతలు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మీద అభిమానం ఉండే సానుభూతిపరులను గెలిపించేలా పావులు కదుపుతున్నారు. కరీంనగర్ నుంచి ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపించేలా బీజేపీ హై కమాండ్ వ్యూహం రచిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Raghunandan Rao: మా సిఫారసు లేఖలు తీసుకోవాలి
High Court: నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
Hyderabad: మోసాలకు కలరింగ్.. నకిలీ యాప్‌లు, స్కీములకు సెలబ్రిటీల ప్రచారం
Read Latest Telangana News and Telugu News