AP Election Result 2024: కలిసొచ్చిన ‘ఫ్యామిలీ’!
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:11 AM
ఈసారి ఎన్నికల్లో ఓ విశేషం కనిపించింది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకమయ్యారు.
బాబుకు కుటుంబ సభ్యుల అండ
భార్య, కోడలు, కుటుంబ సభ్యుల ప్రచారం
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎన్నికల్లో ఓ విశేషం కనిపించింది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం నారా, నందమూరి కుటుంబాలు అండగా నిలిచి విస్తృతంగా ప్రచారం చేశాయి. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన సొంత కుటుంబ సభ్యుల్లో అనేక మంది ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా మారారు. రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణాన్ని ఆయన సొంత కుటుంబంలోని పరిస్థితులు ప్రతిఫలించాయి.
జగన్ చెల్లెలు షర్మిల, తల్లి విజయలక్ష్మి గత ఎన్నికల్లో వైసీపీ కోసం పెద్దఎత్తున ప్రచారం చేశారు. అన్నతో విభేదాల నేపథ్యంలో ఈసారి షర్మిల కాంగ్రె్‌సలో చేరి జగన్‌కు ప్రత్యర్థిగా నిలిచారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కుటుంబ సభ్యులకే ప్రచారాస్త్రం కావడం గమనార్హం. హత్య కేసు నిందితులను జగన్ వెనకేసుకురావడంపై షర్మిల, వివేకా కుమార్తె సునీత తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. కొడుకు, కుమార్తెలకు నచ్చజెప్పలేక విజయలక్ష్మి ఈసారి ఎన్నికల సమయానికి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ నుంచే షర్మిలకు మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష వేయించాలని పోరాడుతున్న సునీత కడపలో వైసీపీ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఓడించి షర్మిలను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. జగన్ భార్య భారతి మాత్రమే ఈసారి వైసీపీ ప్రచారంలో కనిపించారు.
ఇంతకుముందు లేనివిధంగా..
చంద్రబాబు కుటుంబంలో మహిళలు గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ పాల్గొనలేదు. రాజకీయాలకు కూడా దూరంగా ఉండేవారు. ఈసారి మాత్రం క్రియాశీలంగా పనిచేశారు. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి బయటకు వచ్చారు. రాజమహేంద్రవరంలో మకాం పెట్టి.. బాబును చూసేందుకు జైలుకు వచ్చేవారిని కలిసేవారు. తర్వాత ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు.
చంద్రబాబు అరెస్టుకు మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమె యాత్రకు మహిళల్లో బాగా స్పందన రావడంతో ఆమె పర్యటనల్లో పార్టీ తరఫున మహిళా సమావేశాలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తన భర్త చంద్రబాబు తరఫున కుప్పంలో నామినేషన్ కూడా దాఖలు చేశారు. నియోజకవర్గంలో కొన్ని రోజులు ఉండి ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేశారు. అక్కడ పార్టీ ప్రచారం తీరును పర్యవేక్షించారు. పార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకుని ఎన్నికల అంశాలపై సమీక్ష జరిపారు.
చంద్రబాబు కోడలు, లోకేశ్ సతీమణి బ్రాహ్మణి కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆమె తన భర్త పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రచారంలో పాల్గొన్నారు. హెరిటేజ్ కంపెనీ పనుల్లో నిత్యం బిజీగా ఉంటున్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రచారంలోకి దిగడం విశేషం. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులతో సమావేశం కావడంతోపాటు వివిధ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులతో సమావేశాలు నిర్వహించి వారిని ఓట్లు అభ్యర్థించారు. డ్వాక్రా సంఘాల్లో పనిచేస్తున్న పేద వర్గాల మహిళలతో కూడా సమావేశాలు జరిపారు. ఆమె ప్రచారం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేతల్లో ఉత్సాహం నింపింది. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీ హీరో రోహిత్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కొన్ని చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు.