Share News

ట్యాక్స్‌ కట్టకుండానే తోలేశారు

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:52 AM

వైసీపీ హయాంలో చివరి మూడేళ్లు అరబిందో సంస్థకు స్వర్ణయుగమనే చెప్పాలి.

ట్యాక్స్‌ కట్టకుండానే తోలేశారు

అడ్డదిడ్డంగా అంబులెన్స్‌లు నడిపిన అరబిందో

గత మూడేళ్లు ప్రభుత్వానికి రోడ్‌ ట్యాక్స్‌ ఎగవేత

అయినా వైసీపీ హయాంలో అరబిందోకు రైట్‌రైట్‌

సర్కారు మారినా మాయని మమకారం

అరబిందో ఒక్కో ఎత్తుకు ఉన్నతాధికారుల సాయం

ట్యాక్స్‌ మినహాయింపు కోరిందే తడవుగా ఫైల్‌

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో చివరి మూడేళ్లు అరబిందో సంస్థకు స్వర్ణయుగమనే చెప్పాలి. 108, 104 అంబులెన్స్‌లను నిర్వహించే టెండరును 2021లో ఆ సంస్థ దక్కించుకుంది. అప్పటినుంచి 2024 జూన్‌ వరకూ అరబిందో అంబులెన్స్‌లు రోడ్డుపై అడ్డదిడ్డంగా నడిచాయి. రోడ్‌ ట్యాక్స్‌, ఫినెనెస్‌, బీమా వంటి తప్పనిసరి నిబంధనలనూ గాలికి వదిలేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ సంస్థకు నిబంధనలు గుర్తుకు వచ్చాయి. రోడ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆరోగ్యశాఖకు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌కు అరబిందో ప్రతినిధులు లేఖ రాశారు. అప్పుడు ఆరోగ్యశాఖ అధికారులు, ట్రస్ట్‌ ఉన్నతాధికారులు ఏమనాలి? ముందు రోడ్‌ ట్యాక్స్‌ కట్టండి... తర్వాత మినహాయింపు గురించి ఆలోచిద్దామని తేల్చిచెప్పాలి. ట్యాక్స్‌ కట్టడి చివరి మూడేళ్ల కాలానికి భారీ జరిమానాలు వేసి ముక్కుపండి వసూలు చేయాలి. కానీ ఆ సంస్థ ఇచ్చిన లేఖను తీసుకుని ఆగమేఘాల మీద ఫైల్‌ను నడిపించారు. అరబిందో కోరిన మినహాయింపునకు ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా ఆమోదిస్తూ.. ఫైలును రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(ఆర్‌టీఏ)కి పంపింది. ఫైల్‌ను పరిశీలించిన ఆర్టీఏ అధికారులు షాక్‌ అయ్యారు. మూడేళ్లు రోడ్‌ ట్యాక్స్‌ లేకుండా వాహనాలు ఎలా తిరగనిచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు తమ చేతుల్లో ఉండదని, సీఎం అనుమతి తీసుకోవాలని సూచించారు. ఫైల్‌ సీఎంకు పెడితే ఏం జరుగుతుందో.. ఉన్నతాధికారులు ముందే గ్రహించారు. ఫైల్‌ను తమ దగ్గరే ఉంచుకున్నారు. మూడేళ్లకుపైగా అరబిందో ఆధ్వర్యంలో వెయ్యికిపైగా అంబులెన్స్‌ తిరుగుతున్నాయి. వాహనాలు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. రోడ్‌ట్యాక్స్‌, ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌లు తానే కట్టుకోవాలన్న నిబంధనను అరబిందో ఉల్లంఘించింది. ఇన్సూరెన్స్‌ల గడువు ఎప్పుడో తీరిపోయింది. అయినా రెన్యువల్‌కు పోలేదు. రోడ్‌ ట్యాక్స్‌ కడుతుంటేనే వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఫిట్‌నెస్‌ ఉంటేనే ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకొస్తాయి. ఈ మూడూ లేకపోతే వాహనాలను రోడ్డు మీద తిప్పడానికి వీల్లేదు. అయితే, వీటిల్లో ఒక్క నిబంధన కూడా అప్పటి అధికారులు, అరబిందో పాటించలేదు.

అరబిందోకు స్వస్తి..?

108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోకు స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు దీనిపై అధికారులకు ఎప్పుడో స్పష్టత ఇచ్చారు. ‘మేం తప్పుకొంటాం’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనంతో ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. వెంటనే అరబిందోను తప్పించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రంగంలోకి దిగిన అధికారులు.. సంబంధిత ప్రక్రియను ప్రారంభించారు. కాగా, చాలా జిల్లాల్లో అరబిందో.. పెట్రోల్‌ బంక్‌లకు నెలవారీ బిల్లులు ఎగ్గొట్టినట్టు సమాచారం. దీంతో కొన్ని బంక్‌లు అరబిందో వాహనాలకు డీజిల్‌ నింపడం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ హయాంలో అరబిందో సంస్థ ఆడిందే ఆట.. పాడిందే పాట. ట్యాక్స్‌ కట్టకుండా అరబిందో అంబులెన్స్‌లు రోడ్డెక్కినా అడిగిన వారు లేరు. ఫిట్‌నెస్‌ లేదని వాహనాలను టచ్‌ చేసే సాహసం ఎవరికీ ఆనాడు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారులు, అరబిందోపై అదే ప్రేమను వొలకబోస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారగానే అరబిందో వేయడం మొదలుపెట్టిన ఒక్కో ఎత్తుకు సహకారం అందిస్తున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 04:52 AM