Share News

AP Elections: ఎన్నికల వేళ వెరీ ‘హాట్‌’!

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:13 AM

ఎల్‌నినో బలహీనపడుతున్నా... దాని ప్రభావం మరో మూడు నెలల వరకూ ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జూన్‌ వరకూ దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత నెల రెండో వారం నుంచే దేశంలో..

AP Elections: ఎన్నికల వేళ వెరీ ‘హాట్‌’!

  • ఇటు ఎన్నికల హీటు.. అటు మండుటెండలు

  • ఈ వేసవిలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మంటలే

  • దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

  • తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం

  • ఈసారి ఎక్కువ రోజులు వడగాడ్పులు: ఐఎండీ

  • రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

  • నేడు, రేపు ఆరెంజ్‌ అలెర్ట్‌.. వడగాడ్పులు ఎక్కువే

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో భారతదేశం విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోనుంది. ఒక పక్క ఎన్నికల హీటు.. మరో పక్క మండుటెండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది ఎన్నికల ‘వేడి’.. సాధారణ ఎన్నికల ‘వేడి’కి సమానంగా ఉండనుందని భావిస్తున్నారు..!

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో బలహీనపడుతున్నా... దాని ప్రభావం మరో మూడు నెలల వరకూ ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జూన్‌ వరకూ దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత నెల రెండో వారం నుంచే దేశంలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి చివరి వారం నుంచి దక్షిణ, మధ్య, పశ్చిమ భారతంలో పలుచోట్ల వడగాడ్పులు వీయడంతోపాటు పగటి ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. మార్చిలోనే తీవ్రంగా ఉన్న ఎండలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ భరించలేనంతగా ఉండనున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఇంకా వడగాడ్పులు సాధారణం కంటే ఎక్కువ రోజులు వీయనున్నాయి. ప్రధానంగా మధ్య భారతం, దానికి ఆనుకుని దక్షిణ, పశ్చిమ, తూర్పున ఉన్న పలు రాష్ట్రాల్లో వేసవి అత్యంత దారుణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ ఎండలు, వర్షాలపై బులెటిన్‌ విడుదల చేసింది. ఈశాన్య, వాయవ్య భారతంలో కొన్నిప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. 3నెలల వేసవి సీజన్‌లో దక్షిణ, మధ్య, తూర్పు భారతంలో నెలకు సగటున 3 రోజులు వడగాడ్పులు వీస్తుంటాయని, ఈ ఏడాది మాత్రం 4 నుంచి 8 రోజులు వీయనున్నాయని అంచ నా వేస్తున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక, ఏపీ, రాజస్థాన్‌, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌లలో వడగాడ్పుల ప్రభావం అసాధారణంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

AP Politics: అవ్వా తాతలకు జగన్‌ వెన్నుపోటు


ఆరోగ్యంపైనా ప్రభావం..

ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఎండలు, వడగాడ్పులపై వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈశాన్య, పశ్చిమ హిమాలయ ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. మధ్య, దక్షిణ భారతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. మధ్య భారతం దానిని ఆనుకుని దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. కాగా, ఏప్రిల్‌లో దేశంలో సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వాయవ్య, మధ్య, దక్షిణ భారతంలో కొన్నిచోట్ల మాత్రం తక్కువ వర్షాలు కురుస్తాయి. ఇదిలావుండగా వడగాడ్పుల సీజన్‌ ప్రధానంగా వృద్ధులు, పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈనెల 19వ తేదీ నుంచి దేశంలో ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. కాబట్టి తీవ్ర ఎండలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్రా సూచించారు.

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 06:55 AM