డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,307 కోట్లు
ABN , Publish Date - May 08 , 2024 | 04:48 AM
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన 2023-24 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1307 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...
ఆదుకున్న అమెరికా, ఐరోపా మార్కెట్లు.. ఒక్కో షేరుపై రూ.40 తుది డివిడెండ్
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన 2023-24 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1307 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ.959 కోట్లతో పోలిస్తే లాభం 36 శాతం పెరిగినా డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 5 శాతం తగ్గింది. అలాగే క్యు4లో కంపెనీ ఆదాయం కూడా 12 శాతం వృద్ధితో రూ.6,297 కోట్ల నుంచి రూ.7,083 కోట్లకు చేరింది. కాని డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే రెండు శాతం తగ్గింది. ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా లాభం 24 శాతం వృద్ధితో రూ.4,507 కోట్ల నుంచి రూ.5,568 కోట్లకు, ఆదాయం రూ.24,588 కోట్ల నుంచి రూ.27,916 కోట్లకు చేరాయి.
డివిడెండు: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరు పై రూ.40 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని మంగళవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ‘గత ఆర్థిక సంవత్సరం మేమ మంచి పనితీరు కనబరిచాం. మాకు ఇది మర్చిపోలేని చారిత్రక సంవత్సరం ఇది. వచ్చే పదేళ్లలోనూ మేము సరికొత్త ఔషధాల ద్వారా రోగులకు సేవ చేస్తాం’ అని కంపెనీ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ విలేకరులతో చెప్పారు.
ఆదుకున్న ఉత్తర అమెరికా : 2023-24 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ దేశీయ ఆదాయం ఐదు శాతం తగ్గి రూ.4,640 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఉత్తర అమెరికా మార్కెట్ ఆదాయం 29 శాతం పెరిగి రూ.12,990 కోట్లకు చేరి కంపెనీని ఆదుకుంది. యూరోపియన్ దేశాల ఆదాయం కూడా ఐదు శాతం పెరిగింది. కొత్త ఔషధాల విడుదలతో వర్థమాన దేశాల నుంచి లభించే ఆదాయం తొమ్మిది శాతం పెరగడం కంపెనీకి కలిసొచ్చింది. ‘గత ఆర్థిక సంవత్సరం మా ఆదాయం, లాభాల పెరుగుదలకు అమెరికా మార్కెట్ బాగా దోహదం చేసింది. లైసెన్సింగ్, సహకారం వంటి చర్యల ద్వారా భవిష్యత్ వృద్ధికీ చర్యలు తీసుకున్నాం’ అని ప్రసాద్ చెప్పారు.
కొత్త ఔషధాలు: గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కంపెనీ 21 కొత్త ఔషధాలను మార్కెట్‌లో విడుదల చేసింది. క్యూ4లో ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఐదు ఔషధాలు విడుదల చేస్తే అందులో నాలుగు ఔషధాలను అమెరికా మార్కెట్‌లో విడుదల చేసింది. క్యు4లో అమెరికా ఎఫ్‌డీఏ వద్ద తొమ్మిది అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్లు (ఆండాస్) ఫైల్ చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి డాక్టర్ రెడ్డీస్ అమెరికా ఎఫ్‌డీఏ వద్ద 17 ఆండాస్ ఫైల్ చేసినట్టయింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఎఫ్‌డీఏ వద్ద ఫైల్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్న జనరిక్ ఔషధాల సంఖ్య 86కి చేరింది. ఇందులో 81 ఆండాస్ కాగా, ఐదు మాత్రం న్యూ డ్రగ్ అప్లికేషన్లు (ఎన్‌డీఏలు).
కొత్త సీఎ్‌ఫఓగా ఎంవీ నరసింహం
ఎంవీ నరసింహంను కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా నియమించేందుకు డాక్టర్ రెడ్డీస్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. సీఎ్‌ఫఓగా రిటైర్ అవుతున్న పరాగ్ అగర్వాల్ స్థానంలో నరసింహం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. తెలుగు వారైన నరసింహం ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ డిప్యూటీ సీఎ్‌ఫఓగా పని చేస్తున్నారు. ‘‘క్యూ4లో కంపెనీ ఆదాయ, లాభాల వృద్ధికి వ్యూహాత్మక సహకారాలు కీలకంగా పని చేశాయి. ఈ వృద్ధిరేటు కొనసాగించేందుకు భవిష్యత్‌లోనూ మేము కన్జుమర్ హెల్త్, డిజిటల్ థెరప్యూటిక్స్, సరికొత్త ఔషధాలపై దృష్టి పెడతాం’’ అని అగర్వాల్ చెప్పారు.