Share News

2025లో జోరుగా విదేశీ పెట్టుబడులు!

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:25 AM

గత సంవత్సరం భారత స్టాక్‌ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ).. 2024లో తమ ఇన్వె్‌స్టమెంట్లను భారీగా వెనక్కి తీసుకున్నారు. దాంతో ఈ ఏడాది మొత్తానికి ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు...

2025లో జోరుగా విదేశీ పెట్టుబడులు!

2024లో ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు భారీగా వెనక్కి

కొత్త ఏడాదిలో మళ్లీ పుంజుకోవచ్చంటున్న మార్కెట్‌ విశ్లేషకులు

గత సంవత్సరం భారత స్టాక్‌ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ).. 2024లో తమ ఇన్వె్‌స్టమెంట్లను భారీగా వెనక్కి తీసుకున్నారు. దాంతో ఈ ఏడాది మొత్తానికి ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.5,000 కోట్ల స్థాయికి పరిమితం కానున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లో అధిక వాల్యువేషన్లు, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ నిరాశపర్చడం, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గుదల కారణంగా అక్కడి బాండ్ల రేటు పెరగడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రధాన కారణమయ్యాయి. కొత్త సంవత్సరం (2025)లో ఈ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పుంజుకోవచ్చని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మెరుగుపడనున్న కార్పొరేట్‌ కంపెనీల పనితీరు ఇందుకు దోహదపడనుందని వెంచురా సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విభాగ అధిపతి వినీత్‌ బోలింజ్‌కర్‌ అన్నారు.


అయితే, మన మార్కెట్లో చాలా కంపెనీల షేర్లు ఇప్పటికీ అధిక ధరల వద్ద ట్రేడవుతుండటంతో పాటు ఆసియాన్‌, లాటిన్‌ అమెరికా మార్కెట్లలో షేర్లు ఆకర్షణీయ ధరలకు లభిస్తుండటం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు, అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సహా అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, ట్రంప్‌ సుంకాల వడ్డన వంటి పరిణామాలు మన మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పరిమితం చేసే ప్రమాదమూ లేకపోలేదన్నారు. డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ నెల 24 నాటికి మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.5,052 కోట్లుగా నమోదయ్యాయి. డెట్‌ మార్కెట్లో మాత్రం రూ.1.12 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కాగా, 2023లో ఎఫ్‌పీఐలు మన ఈక్విటీల్లో నికరంగా రూ.1.71 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అంతక్రితం సంవత్సరం (2022)లో రూ.1.21 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2019 నుంచి 2021 వరకు వరుసగా పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చారు. ఈ ఏడాది విషయానికొస్తే, జనవరి, ఏప్రిల్‌, మే, అక్టోబరు, నవంబరుల్లో పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకున్నారు. కేవలం అక్టోబరు, నవంబరులో మొత్తం రూ.1.16 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.


కొనసాగనున్న

ఎఫ్‌డీఐల జోష్‌

అంతర్జాతీయ అనిశ్చితులు, సవాళ్ల నేపథ్యంలోనూ ఈ ఏడాది భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగానే వచ్చాయి. ఈ జనవరి నుంచి నమోదైన నెలవారీ ఎఫ్‌డీఐల సగటు 450 కోట్ల డాలర్ల పైమాటే. 2025లోనూ ఎఫ్‌డీఐల జోష్‌ కొనసాగనుందని.. మోదీ సర్కారు వ్యాపార, పెట్టుబడి సానుకూల విధానాలతో పాటు భారత్‌లో పెట్టుబడులపై ఆకర్షణీయ రిటర్నులు లభిస్తుండటం, చౌకగా నిపుణులు లభిస్తుండటం, సులభతర నియమావళి, అనుమతులకు సింగిల్‌ విండో సిస్టమ్‌, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాలు ఇందుకు దోహదపడనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జనవరి-సెప్టెంబరు కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలు 4,213 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 2023లో ఇదే కాలానికి వచ్చిన 2,973 కోట్ల డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడులు 42 శాతం పెరిగాయి.


గడిచిన 10 ఆర్థిక సంవత్సరాల్లో (2014-2024) దేశంలో వచ్చిన ఎఫ్‌డీఐలు అంతక్రితం పదేళ్లతో పోలిస్తే 67 శాతం వృద్ధి చెంది 99,100 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా, 2004-2014 మధ్యకాలంలో దేశీయ తయారీ రంగంలోకి వచ్చిన ఈక్విటీ ఎఫ్‌డీఐలు 9,800 కోట్ల డాలర్లుగా నమోదుకాగా.. 2014-2024 కాలానికి 69 శాతం వృద్ధితో 16,500 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ శతాబ్దంలో ఇప్పటివరకు (2000-24) వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని దాటాయి.

Updated Date - Dec 26 , 2024 | 05:25 AM