Hyderabad: విమానంలో ముంబై వెళ్లి.. డ్రగ్స్ కొనుగోలు చేసి.. బస్సులో నగరానికి..
ABN , Publish Date - Jan 13 , 2024 | 10:36 AM
విమానంలో ముంబైకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి.. బస్సులో నగరానికి చేరుకుని విక్రయిస్తున్న స్మగ్లర్‌తో పాటు, ఓ వినియోగదారుడిని ఫలక్‌నుమా, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

- నిందితుడి అరెస్ట్
- ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): విమానంలో ముంబైకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి.. బస్సులో నగరానికి చేరుకుని విక్రయిస్తున్న స్మగ్లర్‌తో పాటు, ఓ వినియోగదారుడిని ఫలక్‌నుమా, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 3.12 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్(MDMA drugs)ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డీసీపీ సాయిచైతన్య(South Zone DCP Sai Chaitanya) కథనం ప్రకారం.. ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ అమీర్‌కు నటుడు కావాలనే కోరిక. యాక్టింగ్, మోడలింగ్ కోసం కొంతకాలం క్రితం ముంబైకి వెళ్లాడు. అక్కడ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకొని నగరానికి వచ్చి ఇక్కడ వినియోగదారులకు అమ్మేవాడు. ఇటీవల ముంబై నుంచి నగరానికి మకాం మార్చిన అమీర్ ఫలక్‌నుమాలోనే ఉంటూ రియల్ ఎస్టేట్ మీడియేటర్‌గా పనిచేస్తున్నాడు. అవసరమైనప్పుడు విమానంలో ముంబైకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని హర్షద్ వద్ద 26 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్స్ కొని నగరానికి వచ్చాడు. శుక్రవారం వట్టేపల్లి వద్ద స్నేహితుడు జుబేర్‌కు డ్రగ్స్‌ను అందజేస్తుండగా ఈస్టుజోన్ టాస్క్‌ఫోర్స్, ఫలక్‌నుమా పోలీసులు మాటువేసి నిందితులను పట్టుకున్నారు. ముంబైకి చెందిన ప్రధాన స్మగ్లర్ అర్షద్ అలియాస్ రెహమాన్ పటేల్ పరారీలో ఉన్నాడు.