Share News

దీపావళి జరుపుకోవడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణం.. ఆశ్చకరమైన నిజాలు ఇవే

ABN , Publish Date - Oct 28 , 2024 | 01:43 PM

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా దీపాల వెలుగుల మధ్య నిర్వహించుకునే దీపావళి పండగ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సందడి మొదలైంది. అయితే దీపావళి పండగకు సంబంధించిన నమ్మకాలు ఒక్కో విధంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైన కథనాలు ఒకసారి గమనిద్ధాం.

దీపావళి జరుపుకోవడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణం.. ఆశ్చకరమైన నిజాలు ఇవే

దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రధానమైన పండగలలో దీపావళి ఒకటి. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా ఈ పర్వదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ పండగను హిందువులే కాదు జైనులు, సిక్కులు, కొందరు బౌద్ధ మతస్తులు కూడా జరుపుకుంటారు.

‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ అని కూడా పిలిచే ఈ పండగ సాధారణంగా అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మధ్యలో వస్తుంది. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31 - నవంబర్ 1 తేదీల మధ్య వచ్చింది. అమావాస్య తిథి అక్టోబరు 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోవడానికి ప్రాంతాలను బట్టి ప్రాంతాలను బట్టి విభిన్న గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఏ ప్రాంతంలో ఏ కథ మనుగడలో ఉందో ఈ ప్రత్యేక కథనంలో గమనిద్దాం..


పురాణాలు ఏం చెబుతున్నాయి?

చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సూచికగా ఈ పండగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి పదం సంస్కృతం నుంచి వచ్చింది. ‘దీపాల వరుస’ అని అర్థం వస్తుంది. శక్తివంతమైన ఈ కాంతి రూపం భౌతిక భావనను మాత్రమే కాదు ఆధ్యాత్మిక చింతనను కూడా సూచిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈ పండగ ప్రజలకు ఒక సాంస్కృతిక, మతపరమైన ఆచారంగా కాలక్రమేణా మారింది.


ఉత్తర భారతదేశంలో..

రావణుడిని సంహరించిన తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు రావడంతో దీపావళి జరుపుకుంటారనే గాథ ఒకటి ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణ్‌తో కలిసి 14 ఏళ్లు వనవాసం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆ సమయంలో అయోధ్య ప్రజలు వారి ఇళ్లలో దీపాలు వెలిగించి రాముడికి సంతోషంగా స్వాగతాలు పలికారు. ఆశ, ధర్మానికి సూచికగా ఈ విధంగా దీపాన్ని వెలిగించారు. అందుకే ఉత్తర భారతదేశంలో ప్రతి ఏడాది దీపావళిని జరుపుకుంటుంటారు.


దక్షిణ భారతదేశంలో...

దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నరకాసురునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడు అజేయుడిగా నిలిచేందుకు తల్లి చేతిలో మరణించేలా వరం పొందాడు. లోకకంటకుడిగా తయారై ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడును చెప్పుకున్నారు. మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడి అవతరం ఎత్తారు. ఈ యుగంలో నరకాసురుడి తల్లి సత్యభామగా పుట్టింది. దీంతో భార్యతో చేతనే నరకారసురడి సంహరింపజేశాడు. అక్కడితో నరకాసురుడి పీడ విరగడైంది. నరకాసురుని మరణం దుఃఖం కంటే వేడుక నిర్వహణకే అర్హమైనదిగా భావించి దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. అందుకే ప్రతి ఏడాది దీపావళి జరుపుకుంటుంటారు.


పురాణాలు చెబుతున్న రెండవ కథ ఇదే..

దీపావళికి సంబంధించి పురాణాలు చెబుతున్న రెండవ కథ సిరిసంపదలు కలగజేసే లక్ష్మీ దేవీతో ముడిపడి ఉంది. దేవుళ్లు, రాక్షసుల మధ్య జరిగిన భారీ యుద్ధం తర్వాత అమ్మవారు క్షీర సముద్రం నుంచి ఉద్భవించారని చెబుతారు. ఆమె రాక సిరి సంపద మూలకంగా భావిస్తారు. అందుకే దీపావళి వేడుకల సమయంలో ప్రజలు తమ ఇళ్లను దీపాలతో వెలిగిస్తారు. చీకటిని జయించే సత్యానికి దూతగా, ఆలోచనలు పుట్టించే శక్తిగా కాంతిని కోలుస్తారు. అందుకే ప్రతి ఏడాది ఈ పండగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే

ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే

ఆ కాలంపోయింది.. కివీస్ చేతిలో భారత్ ఓటమిపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 28 , 2024 | 02:34 PM