Vinayaka Chavithi Special 2024: గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామాగ్రి..?
ABN , Publish Date - Sep 06 , 2024 | 03:23 PM
రేపే వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఊరు వాడా వినాయకుడి పందిళ్లుతో ముస్తాబవుతుంది. వివిధ రకాల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంట్లో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తారు.
రేపే వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఊరు వాడా వినాయకుడి పందిళ్లుతో ముస్తాబవుతుంది. వివిధ రకాల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంట్లో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తారు.
పండగ వేళ.. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించేందుకు కొన్ని పద్దతులు పాటించాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజ ఎలా చేయాలి.. అలాగే గణపతిని ఎలా ఆరాధించాలని వారు ఈ సందర్భంగా సోదాహరణగా వివరిస్తున్నారు.
కావాల్సిన సామాగ్రి...
వినాయక చవితి రోజు.. సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంటే ఇంటిని తడి గుడ్డతో తుడుచుకోవాలి. తలంటు సాన్నం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. అనంతరం ఇంట్లో మట్టి వినాయకుడి ప్రతిమతోపాటు పూజా సామాగ్రిని తెచ్చుకోవాలి. ఈ పూజకు కావాల్సిన సామాగ్రి.. గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, ఆవునెయ్యి, ఒత్తులు, అగరబత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, 21 రకాల పత్రితోపాటు స్వామి వారికి నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్జోపవీతం..
నైవేద్యంగా ఇవి సమర్పించాలి..
ముందుగా పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పొసి..పూర్ణకుంభంలో కొత్త బియ్యం చేసి, వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. ఇంట్లో వినాయకుడి ఫొటో ఉంటే.. దానిని శుభ్రంగా తుడిచి.. ఆయన నుదుట కుంకుమతోపాటు పసుపు పెట్టాలి. ఈ ఫొటోను సైతం పూజలో ఉంచాలి. అనంతరం వినాయకుడి ప్రతిమ, ఫొటోపైన పాలవెల్లిని కట్టాలి. దానికి అరటి పళ్లు, వెలక్కాయ, యాపిల్, పంపరపనసకాయ, మామిడాలకుతో అలంకరించాలి. వినాయకుడికి గొడుగు పెట్టాలి. గణపతికి ఇష్టమైన పిండి వంటలు.. ఉండ్రాళ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించాలి.
పూజ ఇలా ప్రారంభించాలి..
ఓం శ్రీ మహాగణాధిపతయే నమ: అని చెప్పి.. శుక్లాంబరధరం విష్ణుం అంటూ శ్లోకం చదవి పూజ ప్రారంభించాలి. అనంతరం ఆచమనం స్వీకరించాలి. ఆ తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి. ఆ క్రమంలో షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. శ్రీవినాయక అష్టోత్తర శతనామావళి చదవాలి. పూజ పూర్తయ్యాయ గణపతి వ్రత కథ వినాలి. వినాయక వ్రత కల్పం పుస్తకంలోని పద్యాలు, కథలు చదవాలి. చివరకు మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేయాలి.
వినాయకుడి ప్రతిమను ఇంటికి తీసుకు వచ్చే ముందు..
ఇక వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకు వచ్చేముందు దానికి ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలి. అంటే.. విగ్రహంలో వినాయకుడి చేతులు, తొండం విరగడం కానీ.. విగ్రహంలో పెచ్చులుగా ఉండడం కానీ లేకుండా చూసుకోవాలి. హిందూ సంప్రదాయం ప్రకారం.. వినాయకుడి ప్రతిమలో మూషికం అంటే ఎలుక, ఓ దంతం, అంకుశం, మోదక ప్రసాదం కచ్చితంగా ఉండాలి.
ఈ విగ్రహాన్ని మాత్రం ఎవరికీ ఇవ్వవద్దు.. ఎందుకంటే..
చవితి పండగ రోజున విగ్రహం ప్రతిష్టించే వారు.. గణపతి తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం విగ్రహం ఎడమ వైపున చంద్రుడు ఉంటాడు. కుడివైపున తొండం ఉండే విగ్రహంలో సూర్యుడు ఉంటాడు. ఇక ఇంట్లో పూజకు కూర్చున్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవడం శ్రేష్టం. ఇక నాట్యం చేస్తున్న గణపతి విగ్రహాన్ని మాత్రం ఇంట్లో ప్రతిష్టించ వద్దు. ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.
వినాయకుడి పూజకు ముందు..
గణపతి పూజను ప్రారంభించడానికి ముందు జిల్లేడు ఆకులు, రేగు పండ్లు, రావి, దానిమ్మ, బిల్వ పత్రాలు, గరిక, మారేడు, జమ్మి, ఉమ్మెత్త, పత్రి, మామిడి, గన్నేరు, అరటి ఆకులు, వెలక్కాయ. మొక్కజొన్న కంకులు, అరటిపళ్లు, జాజి, బంతిపూలతోపాటు మీ ప్రాంతంలో దొరికే రకరకాల పండ్లు, పూలతో స్వామి వారిని పూజించాలి.
ఈశాన్యంలో ప్రతిష్టించి.. ఇలా చేస్తే విద్యార్థులకు..
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈశాన్యంలో పూజ గది ఉంటుంది. వినాయకుడి ప్రతిమను ఈశాన్యంలో ప్రతిష్టించి పూజించాలి. వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం పేదవారికి దానధర్మాలు చేయాలి. అలాగే గోమాతను ఆరాధించాలి. అందువల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే.. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కచ్చితంగా విజయం దక్కుతుందిన పండితులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’
Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..
Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..
Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..