Industries: పరిశ్రమలశాఖకు పెరిగిన కేటాయింపులు
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:08 AM
రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ, విదేశీ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల శాఖకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు భారీగా పెంచింది. గతేడాది రూ. 2,732 కోట్లు కేటాయించగా..

2014 తర్వాత తొలిసారి 3,527 కోట్లు
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ, విదేశీ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల శాఖకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు భారీగా పెంచింది. గతేడాది రూ. 2,732 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 3,527 కోట్లు ప్రతిపాదించింది. గతంతో పోలిస్తే రూ. 795 కోట్లు అధికం. గత జనవరిలో దావోస్ సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సేకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పెట్టుబడులు ప్రవాహంలా వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన విద్యుత్ వాహనాల పాలసీ, విద్యుత్ పాలసీలతో ఈ రంగాల్లోని దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతేడాది ప్రారంభించిన ఎంఎ్‌సఎంఈ పాలసీతో దేశీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయి. కొత్త కంపెనీల రాకతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమల శాఖకు రూ. 3,527 కోట్లు కేటాయుంచింది. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం, జౌళిశాఖ కోసం రూ. 237 కోట్లు కేటాయించారు. మహేశ్వరంలోని ఎలక్ర్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ కోసం రూ. 21.50 కోట్లు, జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణకు రూ. 125 కోట్లు, 10 ఫార్మా క్లస్టర్ల భూసేకరణ కోసం రూ. 50 కోట్లు బడ్జెట్టులో ప్రతిపాదించారు.