సీఎంను తిట్టీన వ్యవహారం.. కేటీఆర్‌పై కేసు కొట్టివేత
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:15 AM
సీఎం రేవంత్‌రెడ్డిని అసభ్య పదజాలంతో కించపరిచిన వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిని అసభ్య పదజాలంతో కించపరిచిన వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది ఆగస్టు 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ‘చీప్ మినిస్టర్’.. ‘ఢిల్లీ గులాం’.. అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తనంతా తొలగిస్తామని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో.. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న ధర్మాసనం.. రాజకీయ నాయకులు హూందాగా వ్యవహరించాలని.. సామాజిక మాఽధ్యమాల వేదికగా అసభ్య పదజాలం వినియోగించడం మానేయాలని హితవు పలికింది. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.