TG Budget 2025: రైతు భరోసాకు పెరిగిన నిధులు
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:59 AM
రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తుండగా ఈసారి రూ.18 వేల కోట్ల కేటాయించింది. రూ.3 వేల కోట్లు పెంచటం గమనార్హం.

గతంలో ఏడాదికి 15 వేల కోట్లు.. ఈసారి బడ్జెట్‌లో 18 వేల కోట్లు
హైదరాబాద్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తుండగా ఈసారి రూ.18 వేల కోట్ల కేటాయించింది. రూ.3 వేల కోట్లు పెంచటం గమనార్హం. ఇదివరకు ఒక పంటకు రూ. 5 వేల చొప్పున.. రెండు పంటలకు కలిపి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు పంపిణీ చేయగా... ఈ యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.6 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అంటే రైతులకు ఇక నుంచి ఏడాదికి రూ.12 వేలు అందనుంది. ఈ నిధులు కోటిన్నర ఎకరాలకు సరిపోతాయి. వానాకాలంలో 150 లక్షల ఎకరాలకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లు, యాసంగిలో కూడా 150 లక్షల ఎకరాలకు రూ.9 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ రూ.24,439 కోట్లు కేటాయించింది. ఇందులో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు పోగా... మిగిలిన రూ.6,439 కోట్లను ఇతర పథకాలకు ఖర్చు చేయనుంది.
రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు కేటాయించింది. 2024-25లో రైతు బీమాలో 42.16 లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు. ఒక్కొక్కరికి రూ.3,400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. పంటల బీమా పథకానికి రూ.1,300 కోట్లు, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకానికి రూ.1,800 కోట్లు కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలకు నామమాత్రపు కేటాయింపులు చేశారు. మార్కెట్ స్థిరీకరణ నిధికి నిధుల కేటాయింపులు చేయలేదు. కాగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రభుత్వంరూ.600 కోట్లు కేటాయించింది. ఒక్కొక్కరికి ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలనేది ఈ పథకం లక్ష్యం. దీనికి 3.50 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. తాజా కేటాయింపుల ప్రకారం రూ.600 కోట్లతో 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.