Share News

చంద్రబాబు: నాడు, నేడు, రేపు!

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. ఉద్యోగుల విషయంలో వారి పనితీరును మదింపు చేసేందుకు ఆరు నెలల కాలాన్ని ప్రొబేషనరీ పిరియడ్‌గా...

చంద్రబాబు: నాడు, నేడు, రేపు!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. ఉద్యోగుల విషయంలో వారి పనితీరును మదింపు చేసేందుకు ఆరు నెలల కాలాన్ని ప్రొబేషనరీ పిరియడ్‌గా పరిగణిస్తారు. పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే సర్వీసు క్రమబద్ధీకరిస్తారు. నాయకులకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారు ఎప్పటికప్పుడు ప్రజల మనసు గెలుచుకుంటూనే ఉండాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల పనితీరును సమీక్షించుకుందాం! గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనితీరు, వ్యవహార శైలి పట్ల విరక్తి చెందిన ప్రజలు కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అవసరమైన సంఖ్యా బలాన్ని కూడా ప్రజలు జగన్‌కు ఇవ్వలేదు. అయినప్పటికీ జగన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోరు. ఈ కారణంగా ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభ సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించిన జగన్‌రెడ్డి శాసనసభను బహిష్కరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినవారు ఓటమికి కారణాలను సమీక్షించుకొని ప్రజాభిమానాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నించడం – మెజారిటీ సాధించినవాళ్లు తమ పని తీరుతో ప్రజల మనసు మళ్లీ గెలుచుకొనే ప్రయత్నం చేయడం సహజం. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకొనే బదులు ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. తన అతి మంచితనం, అతి నిజాయితీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన ఆత్మవంచన చేసుకుంటున్నారు.


మచ్చుకైనా తనలో కనిపించని సుగుణాలను ఆపాదించుకొనే ప్రయత్నం చేయడం విడ్డూరంగా కూడా ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి నెల రోజులు గడవక ముందే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని జగన్‌ తనను తాను వంచించుకొనే ప్రయత్నాలు మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తయిన సందర్భంగా జగన్‌రెడ్డికి చెందిన రోత పత్రికలో ఒక కథనాన్ని వండి వార్చారు. ఈ కథనం ప్రకారం... ‘‘ఈ ఆరు నెలల్లో హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకల్లోలమైంది. ఆగని హత్యాచారాలతో మహిళా లోకం భీతిల్లుతోంది. అధికార వ్యవస్థపై ప్రభుత్వం కక్ష గట్టడంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రెడ్‌ బుక్‌ బాధితులయ్యారు. ఏడు వేలకు పైగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతలు మృగ్యం అవడంతో సామాన్యుల జీవితం ఛిద్రమైంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ దారుణాలన్నీ జగన్‌ పాలనలోనే జరిగాయన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేకుండా పోయిందని అప్పుడు హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ హక్కులను కాలరాశారు. కొంత మంది పోలీసు అధికారులను కిరాయి సైనికులుగా మార్చుకొని జగన్‌రెడ్డిని ఎదిరించిన వారిపై కేసులు పెట్టి వేధించారు. ఎంపీ రఘురామకృష్ణ రాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను చెరబట్టారు. నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడిన ప్రజలు ఈ అరాచకాలను ఎన్నికల వరకు మౌనంగా భరించి ఎన్నికల్లో మాడు పగిలేలా తీర్పు ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో నిరూపించిన జగన్‌రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు పాలనలో, తన హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయట! అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చారు. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద రైతు ధర్నాలకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో జగన్‌రెడ్డి ఊహించుకుంటున్నంత వ్యతిరేకత లేనందున రైతు ధర్నాలు పేలవంగా జరిగాయి. వైసీపీ నాయకులు సైతం అప్పుడే ఉద్యమాలు ఏమిటి? అని విసుక్కున్నారు. కొంత మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. నిజంగానే చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారనే అనుకున్నా జగన్‌రెడ్డి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే మరో నాలుగున్నరేళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఐదేళ్లు భరించారు కదా!


ఇదీ వైరుధ్యం...

విచిత్రమేమిటంటే, చంద్రబాబు పాలన అరాచకంగా ఉందని జగన్‌రెడ్డి భావిస్తూ ఉండగా, చంద్రబాబు మెతక వైఖరి వీడాలని తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొంత మంది వైసీపీ నాయకులు తాము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది తెలుగుదేశం పార్టీకి దగ్గరై తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణం. ‘చంద్రబాబు నాయుడు బతికుంటే 2029 తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఆయనను జైల్లో పెడతాం’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా నోరు పారేసుకున్నారు. మనిషి లక్షణాలు ఉన్నవారు ఎవరూ... ‘బతికుంటే’ అన్న మాట వాడరు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని కూడా జీవించాలని కోరుకుంటాం. చంద్రబాబును వృద్ధుడిగా పరిగణిస్తున్న విజయసాయిరెడ్డి కౌమార దశలో ఏమీ లేరే? ఆయనకు కూడా 68 ఏళ్లు వస్తున్నాయి. చంద్రబాబుకు, ఆయనకూ మధ్య వయసు తేడా ఆరేళ్లు మాత్రమే. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎవరైనా ‘బతికివుంటే’ అని అనివుంటే అరెస్టు చేసి లాకప్‌లో చావగొట్టి ఉండేవారు. ‘బోసడీకే’ అన్న పదం వాడినందుకే కదా తెలుగుదేశం నాయకుడు పట్టాభిని అరెస్టు చేయించి పోలీసులతో దొంగ దెబ్బలు కొట్టించారు. ఆయన ఇంటిపై దాడి చేయించారు. చంద్రబాబును బతికివుంటే అని అంటున్న విజయసాయిరెడ్డి స్వేచ్ఛగానే తిరుగుతున్నారు కదా? ఆయనపై ఎవరూ దాడి చేయలేదే? హత్యకు కుట్ర చేస్తున్నారని కేసులు కట్టలేదే? ఈ తేడా చాలు– జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు చంద్రబాబు పాలనలో జరగడం లేదని చెప్పడానికి! తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని అనుకోవడం జగన్‌రెడ్డి ఇష్టం. అదే నిజమైతే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తనను ప్రజలు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా? ఆత్మస్తుతి, పరనింద ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టవు. చంద్రబాబు ఆరు నెలల పాలనలో నమోదైన కేసులు, జగన్‌రెడ్డి హయాంలో జరిగిన అరాచకాల్లో కొన్నింటికి సంబంధించినవి మాత్రమే. నాడు జరిగిన అక్రమాలు బయటపడుతున్న కొద్దీ ప్రజలకు మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. జగన్‌ అండ్‌ కో వెనకేసుకు వస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఆయనకు కిరాయి సైనికులుగా పనిచేసిన వారే. అందుకే తట్టుకోలేకపోతున్నారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి వంటివారు నోరు పారేసుకోగలుగుతున్నారు.


అక్కడే ఎందుకో...

సెకీని అడ్డుపెట్టుకొని అదానీతో కుదుర్చుకున్న సౌర విద్యుత్‌ కుంభకోణంలో రూ.1750 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారాయని అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం జగన్‌పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇందుకు రాజకీయ కారణాలు ఉండవచ్చునుగానీ ప్రజలు మాత్రం ఈ తాత్సారాన్ని హర్షించడం లేదు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ఈ సాచివేత ధోరణి వల్ల జగన్‌ అండ్‌ కో రెచ్చిపోతున్నారు. దొంగతనం చేసినవాడే దొంగా దొంగా అని అరచినట్టుగా సౌర విద్యుత్‌ కుంభకోణంపై జగన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే తప్పు చేసినట్టుగా జగన్‌ అండ్‌ కో మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్థానంలో జగన్‌రెడ్డి ఉండివుంటే ఈ వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేయించకుండా ఉండేవారా? సౌర విద్యుత్‌ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలపై పరువు నష్టం దావా వేసిన జగన్‌రెడ్డి ఒక గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. కేసు పూర్వాపరాలను తెలుసుకోకుండానే, అవతలి పక్షం అభిప్రాయం తెలుసుకోకుండానే న్యాయస్థానాలు ఇలాంటి గ్యాగ్‌ ఆర్డర్లు ఎలా ఇస్తాయో తెలియదు! అంతకు ముందు విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసి ఉపశమనం పొందారు. వీరందరూ ఢిల్లీ హైకోర్టునే ఎందుకు ఎంచుకుంటున్నారో తెలియదు. నేరం జరిగినట్టు ఆరోపణలు వచ్చిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉండగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడం ఏమిటి? ఏది ఏమైనా జగన్‌రెడ్డి అండ్‌ కో పెడబొబ్బలు పెడుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు లేవు. సోషల్‌ మీడియాలో పచ్చి బూతులతో విరుచుకుపడుతున్న వారిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం ప్రదర్శించాకే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట అరాచకంగా ఇళ్లలోని ఆడవారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటాన్ని ఏ చట్టం మాత్రం అనుమతిస్తుంది? ఈ ఆరు నెలల్లోనే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని జగన్‌ అండ్‌ కో భావిస్తుంటే అది వారి ఇష్టం.


ఎప్పటి సంగతో సరే... ఇప్పుడు మాకేంటి?

ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు విషయానికి వద్దాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టించలేరు. అందునా కుప్పకూలిన వ్యవస్థలను గాడిలో పెట్టడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే పనిలేదు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కావడం లేదు. ప్రజలు కూడా వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించారు. శుక్రవారం నాడు ‘విజన్‌–2047’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తే, ఆయనలో కొన్ని పాత వాసనలు పోయినట్టుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అంటే సీఈవో మాత్రమే కాదు, స్వతహాగా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడైన ముఖ్యమంత్రికి రాష్ర్టాభివృద్ధి పైనే కాకుండా తన భవిష్యత్తు రాజకీయంపై కూడా విజన్‌ ఉండాలి. చంద్రబాబులో ఉన్న ప్రధానమైన అవలక్షణం ఏమిటంటే, అధికారంలోకి రాగానే ఆయన రాజకీయం మరచిపోయి సీఈవో అవతారం ఎత్తుతారు. ప్రభుత్వాలకు స్వల్ప కాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలూ ఉండాలి. రాజకీయానికి వస్తే దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వం దీర్ఘకాలంలో ఏం చేస్తుందో తెలుసుకొని అంత వరకు వేచివుండరు. ప్రభుత్వం వల్ల తమకు ఇప్పటికిప్పుడు కలుగుతున్న ప్రయోజనాలను బట్టి ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారు. దీని ప్రకారం విజన్‌–2047 డాక్యుమెంటు ప్రజలకు ఎక్కదు. 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్‌–2020 అని పలవరించేవారు. ఆ క్రమంలో విద్యుత్‌ సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా 2004లో అధికారాన్ని కోల్పోయారు. ప్రజలను సమాయత్తపరచకుండా సంస్కరణలను అమలు చేస్తే ఫలితం అలాగే ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవర్‌ రిఫామ్స్‌ అమలు చేసి తాను పవర్‌ కోల్పోయానని చంద్రబాబు స్వయంగా చెప్పుకొన్నారు. రాష్ర్టాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమేగానీ వాటి వల్ల ఓట్లు వస్తాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా! అందుకే ఈ ఐదేళ్లలో ఏం చెయ్యాలి, ఏం చేయగలమో చెప్పుకోవాలి. జగన్‌ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు కనిపించక నిరాసక్త వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆరు నెలల్లోనే టీసీఎస్‌, గూగుల్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోగలిగారు. ప్రజలు గుర్తించేది ఇలాంటి వాటినే! 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తామని చెబితే ప్రజల చెవికెక్కదు. ఆమాట కొస్తే పేదరికం లేని సమాజం ఎలా సాధ్యం? సంపన్న దేశాలలో సైతం పేదరికం ఉంది. అక్కడి ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగున్నరేళ్లలో ఏమి చేయబోతున్నదీ చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నించాలి. ఆయన ఆలోచనలు ఆ దిశగానే ఉండాలి. ‘‘నా మటుకు నేను 2047 వరకు బతికే అవకాశమే లేదు. అలాంటప్పుడు అప్పుడు ఆవిష్కృతమయ్యే అద్భుతంపై నాకు ఆసక్తి ఏముంటుంది?’’ అందరూ ఇలాగే ఆలోచిస్తారు. చంద్రబాబు అద్భుతమైన విజన్‌ ఉన్న నాయకుడే, కాదనలేము. అయితే నాయకుడు అనేవాడు ప్రజలను తనతో పాటు నడిపించగలగాలి. ప్రజలను వదిలేసి వేగంగా ముందుకు పరిగెత్తకూడదు. అందుకే స్వల్పకాలిక, అంటే ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేయబోతున్నదీ ప్రజలకు స్పష్టంగా వివరించి ఆ తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు ప్రయత్నించాలి.


2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐవీఆర్‌ఎస్‌, ఆర్టీజీఎస్‌ వంటి వాటిపై ఆధారపడ్డారు. తాను నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రభుత్వం పట్ల 70 శాతానికి పైగా ప్రజలు సంతృప్తి చెందుతున్నారని వస్తోందని మురిసిపోయారు. ఎంత బాగా పనిచేసినా మనవంటి సంక్లిష్ట సమాజంలో 70 శాతం ప్రజలు ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉండరు. ఈ మౌలిక విషయాన్ని మరచిపోయి చంద్రబాబు తనను తాను మభ్యపెట్టుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి కూడా తనను తాను మభ్యపెట్టుకున్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం ఆషామాషీ విషయం కాదు. అందుకే ఈ మధ్య ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా తప్పుతున్నాయి. అయినా ఐవీఆర్‌ఎస్‌ అని పట్టుకొని వేలాడటం ఎందుకు? ముఖ్యమంత్రిని సంతృప్తిపరిచే విధంగా నివేదికలు ఇవ్వడం అధికారులకు పరిపాటే. అంచేత అలాంటి నివేదికలపై ఆధారపడకుండా సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. గత అనుభవాల నుంచి ఏమి నేర్చుకున్నాము అన్న దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌) కూడా ఈ కోవలోకే వస్తుంది. అమరావతిలోని కంట్రోల్‌ రూంలో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం పాలకుడిగా ముఖ్యమంత్రికి అవసరం. అదే సమయంలో ప్రజలకు నష్టం కలిగించేవి ఏమీ జరగకుండా చూడటం, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవస్థలతో పనిచేయించడం చాలా ముఖ్యం. ఇది జరగనప్పుడు ప్రజలు సంతృప్తి చెందరు.


జనం మనసు తెలుసుకోవడమెలా?

2014–19 మధ్య రియల్‌ టైం గవర్నెన్స్‌ను అమలు చేసినా అధికారం పోవడానికి కారణం అన్వేషించాలి కదా? ఆ పని చేయకుండా పాత పాటే అందుకుంటే మళ్లీ ప్రతికూల ఫలితాలే వస్తాయి. అమరావతిలో కూర్చొని ఏ గ్రామంలో ఏ వీధిలైటు వెలుగుతున్నదో లేదో చెప్పగలను అని గతంలో చంద్రబాబు ఒక సందర్భంలో చెప్పారు. పాలనలో మెరుగులు దిద్దడానికి మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రజలకు ఉపశమనం కలగనప్పుడు, నువ్వు తెలుసుకుంటే మాకేమిటి? నువ్వు తెలుసుకోకపోతే మాకేమిటి? అని ప్రశ్నిస్తారు. టెక్నాలజీ వాడకం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏఐ వల్ల ప్రజలకు ఏమి మేలు జరుగుతుందో వివరించి వారికి ఆ మేలు జరిగేలా చూడాలి. అప్పుడు మాత్రమే రాజకీయంగా ఉపయోగం ఉంటుంది. టెక్నాలజీ వాడకంలో గానీ, కష్టపడటంలో గానీ చంద్రబాబుకు మరెవరూ సాటిరారు. అయినా తాను రాజకీయంగా ఇన్ని ఒడుదొడుకులు ఎందుకు ఎదుర్కోవలసి వచ్చిందో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తీసుకుందాం. ఆయన పెద్దగా కష్టపడినట్టు కనిపించరు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ఆయన ఎన్నికల్లో అనుకూల ఫలితాలే పొందుతున్నారు. తాజా ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోయినా తన ప్రభుత్వం మనుగడకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అది చేస్తూ, ఎవరిని ఎక్కడ కట్టడిచేయాలో అది చేస్తూ ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతున్నారు. చంద్రబాబు కూడా ఈ మోడల్‌నే అనుసరించాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌నే తీసుకుందాం. రెండు రోజులపాటు ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు సమావేశాలు జరిగాయి. అంత సుదీర్ఘ సమావేశాలు అవసరమా? తన ప్రభుత్వానికి ఏమి కావాలి? ఏం జరుగుతోంది? ముందుగానే తెలుసుకొని ఆ విధంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తే సరిపోతుంది కదా! గంటల తరబడి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లు ఇచ్చుకోవడం వల్ల ప్రజల మనసు చూరగొనలేరు. నాయకుడు అంటే తీరికగా ఉంటూ, తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేవాడు అయి ఉండాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో ఈ లక్షణం పుష్కలంగా ఉంది. అందుకే ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు అన్నట్టుగా ఉండకూడదు. చంద్రబాబులో పాత వాసనలు పోని పక్షంలో 2029 పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో మద్యం విధానం చర్చకు వచ్చినప్పుడు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారా? బెల్టు షాపులు ఎక్కడైనా పెట్టారా? లేదా? అన్నది తెలుసుకోవడానికి మందు బాబులకు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఫోన్‌ చేసి ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకుందామని చంద్రబాబు సూచించగా ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా వ్యతిరేకించారు. మందుబాబులకు ఫోన్‌ చేస్తే నోటికి తోచింది చెబుతారు కనుక అది సరైనది కాదని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. జగన్‌ పాలనలో నాసి రకం మద్యం తాగి అనేక మంది రోగాల బారినపడ్డారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే జరిపించకపోయినా మందుబాబులు అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది.


అయినా జగన్‌ పట్టించుకోలేదు. అది వేరే విషయం. జగన్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు విరక్తి చెందడానికి కారణాలు గుర్తించి ప్రస్తుత ప్రభుత్వంలో అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఏ సర్వేలూ అవసరం ఉండవు. కలెక్టర్ల సమావేశంలో కూడా స్వల్పకాలిక కార్యాచరణతో కూడిన టార్గెట్లపై చర్చ జరగలేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ కార్యకర్తలకు తెలిసినట్టుగా అధికారులకు తెలియవు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించే కార్యక్రమం నిర్వహిస్తే కావాల్సినంత ఫీడ్‌ బ్యాక్‌ లభిస్తుంది. ముఖ్యమంత్రుల మెప్పు పొందడానికే అధికారులు పరిమితం అవుతారు. ‘తల్లికి వందనం’ అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక్క కలెక్టర్‌ కూడా చెప్పలేదే? మంచా– చెడా అన్నది పక్కన పెడితే ప్రజలు సంక్షేమ పథకాలకు అలవాటుపడ్డారు. వారికి అవి సకాలంలో అందకపోతే ఎంత గొప్ప భవిష్యత్తును ఆవిష్కరించినా పోపోవయ్యా అనే అంటారు. పాలనలో వాట్సాప్‌ విధానాన్ని ప్రవేశపెడతారో లేక మరో రకంగా పాలిస్తారో మాకెందుకు? మాకు రావాల్సినవి ఇవ్వండి, ఇస్తామన్నవి ఇవ్వండి అని మాత్రమే అడుగుతారు. ఇదే స్వల్పకాలిక కార్యాచరణ అంటే. స్వల్పకాలిక కార్యాచరణను అమలు చేసుకుంటూ దీర్ఘకాలిక కార్యాచరణకు పూనుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలా కాకుండా ఐవీఆర్‌ఎస్‌, ఆర్టీజీఎస్‌ వంటి పదాలను వల్లెవేయడం వల్ల ఫలితం ఉండదు. 2004, 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణం చంద్రబాబుకు తెలుసు. ఆయన విజన్‌ను మెచ్చుకునేవాళ్లు ఓటర్లు కారు. అందుకే ఆయన పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్టుగా ఉంటోంది.


రాష్ట్రం కోసమైనా...

తాను ఇప్పుడు చంద్రబాబు ఫోర్‌ పాయింట్‌ ఓ (4.0) అని ఆయన చెప్పుకొంటున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని కూడా చెప్పారు. అప్పుడు ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రాజకీయ కార్యాచరణకు కూడా తగిన సమయం కేటాయించారు. 1999లో మళ్లీ గెలిచిన తర్వాత పూర్తిగా సీఈవో అవతారం ఎత్తారు. ఆహా ఓహో అనేవాళ్ల మాటలు నమ్మి ప్రజలకు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితి రాకూడదు. రాజకీయాలకు తగినంత సమయం కేటాయించకపోతే మళ్లీ కింద పడి లేవడానికి ఆయనకు వయసు సహకరించదు. ముఖ్యమంత్రిగా అద్భుత పనితీరును ప్రదర్శించడం అంటే విజన్‌తో ముందుకు వెళ్లడమే కాదు, రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరుస్తూ తాను రాజకీయంగా బలపడటం కూడా! ఈ విషయంలో వెనుకాడితే అది చారిత్రక తప్పిదం అవుతుంది. జగన్‌రెడ్డి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఏ కారణం వల్లనైనా అతను మళ్లీ బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబుదే అవుతుంది. తనకోసం కాకపోయినా రాష్ట్రం కోసమైనా జగన్‌రెడ్డి వంటి శక్తులు బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇకపై చంద్రబాబు వ్యవహార శైలి, నిర్ణయాలు ఈ దిశగానే ఉండాలి, ఉంటాయనీ ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం పట్ల ప్రస్తుతం ప్రజల్లో సంతృప్తిగానీ, అసంతృప్తిగానీ లేవు. ఇకపై ప్రభుత్వ పనితీరు, కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలిని బట్టి ప్రజల అభిప్రాయం మారుతుంది. తాజా ఎన్నికల్లో జగన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పరిగెత్తారు. ఈ విషయాన్ని కూటమి నేతలు అనుక్షణం గుర్తుపెట్టుకుంటే వారికే మంచిది!

ఆర్కే


4-ED.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Dec 15 , 2024 | 12:53 AM