RK Kothapaluku : చంద్రబాబు చేతికి జగన్ జుత్తు!
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:10 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్‌రెడ్డి జుత్తు మాత్రమే కాదు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్‌రెడ్డి జుత్తు మాత్రమే కాదు– ఏకంగా పీక ఇప్పుడు చంద్రబాబు చేతికి చిక్కింది. మొదటి నుంచీ డబ్బు పిచ్చి ఉన్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు కావాలన్న దురాశను అణువణువునా నింపుకొన్న గౌతమ్ అదానీతో చేతులు కలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 25 ఏళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడేలా అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం తెర మీదకు వచ్చింది. రెండు రోజుల క్రితం వరకు గుట్టుగా ఉన్న ఈ అతి భారీ కుంభకోణం అమెరికా చట్టాల పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబు చేతికి పాశుపతాస్త్రం దొరికినట్టయింది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతతోపాటు రాజకీయ ప్రత్యర్థి జగన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే గొప్ప అవకాశం ఈ కేసు వెలుగులోకి రావడంతో చంద్రబాబుకు లభించింది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమ సంపాదనకు అలవాటుపడిన జగన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ‘నాకేంటి?’ అన్న ధోరణిలోనే వ్యవహరించారు. ఫలితంగానే ఈ కేసు జగన్ మెడకు చుట్టుకుంది. ‘గతంలో నేను అధికారంలో ఉన్నానా? ఎప్పుడైనా నేను సెక్రటేరియట్‌కు వెళ్లానా?’ అని ఘీంకరించిన జగన్‌రెడ్డి ఇప్పుడు కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే అవినీతికి పాల్పడ్డానని ఎలా చెప్పగలరని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. సెకీని అడ్డుపెట్టుకొని అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు జగన్‌రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచంగా వచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు న్యాయస్థానానికి సమర్పించిన చార్జ్‌షీటులో పేర్కొన్నాయి. తనకు ఏ పాపం తెలియదని జగన్‌రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంలో ఆధారాలు సేకరించాయి. అమెరికాలో ఉంటున్న గౌతమ్ అదానీ ప్రతినిధి సాగర్ అదానీ ఫోన్‌ను అమెరికా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని విశ్లేషించినప్పుడు ఈ ముడుపుల బాగోతం బయటపడింది. అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూపు సేకరించిన వేల కోట్ల నిధుల నుంచి దాదాపు 2200 కోట్లను ముడుపుల కోసం మళ్లించారు. భారతదేశంలో ఏయే రాష్ర్టాలలో ఎవరెవరికి ఎంత మొత్తంలో లంచాలు ఇచ్చారనే వివరాలు కూడా సాగర్ అదానీ ఫోన్‌లో లభించాయి. దీంతో ఈ కేసులో తిరుగులేని ఆధారాలు లభించినట్టయింది. ఇప్పుడు ఈ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగిందో చూద్దాం!
‘పవర్’ఫుల్ డీల్...
భవిష్యత్ అవసరాల కోసం పది వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు జగన్‌రెడ్డి ప్రభుత్వం 2021లో టెండర్లు పిలిచింది. అంతకు కొద్దిగా ముందు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ 12000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరాకు టెండర్లు పిలవగా... యూనిట్ 2.92 రూపాయల వంతున సరఫరా చేయడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ ఎనర్జీ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాయి. తాము ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు సరఫరా చేసే విద్యుత్‌ను ఆయా రాష్ర్టాలకు సరఫరా చేసి ఏడు శాతం కమీషన్లు తీసుకోవడం వరకే సెకీ పాత్ర పరిమితం. అంటే, ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కేంద్ర సంస్థ అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందన్న మాట! అదానీ, అజూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సెకీద్వారా యూనిట్ 2.92 రూపాయల వంతున విద్యుత్ కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఇదే సమయంలో రాజస్థాన్‌లో ఉత్పత్తి అయిన సోలార్ పవర్‌ను యూనిట్‌కు 1.99 పైసలకే గుజరాత్‌కు విక్రయించారు. దీంతో భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ధరలు పడిపోతాయని భావించిన గౌతమ్ అదానీ రంగప్రవేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని కలిశారు. ఆ వెంటనే సెకీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. అదానీ, అజూర్ కంపెనీలతో 2.92 రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ యూనిట్ 2 రూపాయల 49 పైసలకే సరఫరా చేస్తామని సెకీ ఆఫర్ ఇచ్చింది. అంతకు ముందే అప్పటి ముఖ్యమంత్రితో అదానీ సమావేశం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పది వేల మెగావాట్ల విద్యుత్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసుకుంది. ఇదంతా రహస్యంగా జరిగిపోయింది. ఇప్పుడు సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే కుంభకోణం జరిగిందని ఎలా చెబుతారు? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. గతంలో నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండేది. పోటీ లేకుండా పనులు దక్కించుకోవాలనే కంపెనీలు ఎన్బీసీసీని కవచంగా వాడుకునేవి. పనులను ముందుగా ఎన్బీసీసీకి నామినేషన్‌పై కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఎన్బీసీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం కింద డీల్ కుదుర్చుకున్న కంపెనీలు పనులు పొందేవి. చివరికి ఇదొక ప్రహసనంగా మారడంతో ఎన్బీసీసీ ఉనికిలో లేకుండా పోయింది. ఇప్పుడు సోలార్ విద్యుత్ ప్రమోషన్ పేరిట ఏర్పాటైన సెకీ కూడా ఎన్బీసీసీ బాపతే. ఇదొక కమీషన్ ఏజెంట్ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అదానీతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందో, రాష్ట్ర ప్రజలపై రెండు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు అదనపు భారం ఎలా పడబోతున్నదో చూద్దాం!
ధరల షాకు ప్రజలకే!
అదానీతో రహస్య అవగాహన కుదిరిన తర్వాత అప్పటికే పిలిచిన పదివేల మెగావాట్ల టెండర్లను రద్దు చేసుకున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం సెకీ ద్వారా అదానీ నుంచి 12000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదానీ కంపెనీతో యూనిట్‌కు 2.92 రూపాయలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి యూనిట్ 2.49 రూపాయలకే సరఫరా చేయడానికి ఆఫర్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి యూనిట్‌కు 2.49 రూపాయల వంతున చెల్లించే విధంగా రూపొందించిన ప్రతిపాదనలను జగన్ మంత్రి మండలి ఆమోదించింది. ఆ సమయంలోనే కేంద్రంతోపాటు వివిధ రాష్ర్టాలు కుదుర్చుకున్న సౌర, పవన విద్యుత్ ఒప్పందాల ధర రెండు రూపాయల 30 పైసల నుంచి రెండు రూపాయల 40 పైసల వరకు ఉండింది. అయినా పెద్ద తేడా లేదు కదా అని సరిపెట్టుకుందాం! మంత్రివర్గం ఆమోదించిన ధర ఒకటి కాగా సెకీ ద్వారా అదానీ కంపెనీకి చెల్లించాల్సిన ధర మరో విధంగా పీపీఏ కుదుర్చుకున్నారు. ఇందుకు మంత్రిమండలి ఆమోదం లేదు. మంత్రి మండలి ఆమోదించిన దానికి భిన్నంగా అంతర్ రాష్ట్ర పంపిణీ చార్జీలు, అంతర్ రాష్ట్ర నష్టాల రూపంలో అదనపు చార్జీలు చెల్లించడానికి పీపీఏలు కుదుర్చుకున్నారు. ముందుగా 7000 మెగావాట్లకు అదానీతో పీపీఏ కుదుర్చుకున్నారు. అంతర్ రాష్ట్ర పంపిణీ చార్జీల రూపంలో ఒక యూనిట్‌కు రెండు రూపాయల 21 పైసలు చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్నారు. దీంతో యూనిట్‌కు ధర 4 రూపాయల 70 పైసలు అయింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలపై సాలీనా రూ.3750 కోట్ల అదనపు భారం పడుతుంది. 25 ఏళ్లకు గాను ఈ భారం రూ.లక్షా 56 వేల 151 కోట్లకు చేరుతుంది. ఇది కాకుండా అంతర్ రాష్ట్ర పంపిణీ నష్టాలు, జీఎస్టీ పెరుగుదల, సోలార్ ప్యానల్స్ ధర పెంపు రూపంలో ఒక్క యూనిట్‌కు 43 పైసలు అదనంగా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ కారణంగా సాలీనా మరో 870 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఫలితంగా అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేసే ధర ఒక్క యూనిట్‌కు 5 రూపాయల 13 పైసలకు చేరుతుంది. ఇంతకంటే ద్రోహం, దారుణం ఉంటుందా? ‘అబ్బే... కుంభకోణమే జరగలేదు’ అని ఎలా చెప్పగలరు? రాష్ట్రంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొని ఉంటే అంతర్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ చార్జీలు, నష్టాల రూపంలో చెల్లించాల్సిన చార్జీల భారం తప్పేది కదా? రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పిలిచిన పదివేల మెగావాట్ల విద్యుత్ టెండర్లను ఎందుకు రద్దు చేశారు? ఈ టెండర్లలో పాల్గొన్న సంస్థలు ఒక యూనిట్ 2 రూపాయల 49 పైసలకే సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. అయినా వాటిని కాదని టెండర్లను రద్దు చేసి మరీ సెకీని ముందు పెట్టి అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేయడానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధపడింది. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడబోతోందని స్పష్టం అవుతుంది. తనను అర్ధరాత్రి నిద్రలేపి మరీ సంబంధిత ఫైలుపై సంతకం పెట్టమన్నారని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పడం గమనార్హం.
ఇదీ జగన్ నైజం...
తప్పు చేసి కూడా ఎదురుదాడికి తెగబడటం జగన్‌రెడ్డి నైజం. ఇప్పుడు ఈ భారీ కుంభకోణం విషయంలో కూడా ఎదురుదాడినే ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే అదానీతో ఏమి సంబంధం ఉందని అమాయకత్వం నటించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌రెడ్డి తన రోత మీడియా ద్వారా ఈ మేరకు ప్రచారం చేసుకుంటున్నారు. అదానీ, అజూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సెకీ... ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు కుదుర్చుకోలేకపోయింది? జగన్‌రెడ్డి ప్రభుత్వం అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ సెకీతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంది? ట్రాన్స్‌మిషన్ నష్టాలు, ట్రాన్స్‌మిషన్ చార్జీలను అదనంగా చెల్లించడానికి మంత్రి మండలి ఆమోద ముద్ర లభించిందా? రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో పాల్గొన్నవారు యూనిట్ 2 రూపాయల 49 పైసలకు ఇవ్వడానికి ముందుకు రావడంతో... అదానీ కూడా సెకీతో అంతకు ముందు 2.92 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని కూడా 2.49 రూపాయలకే సరఫరా చేయడానికి సంప్రదింపులు జరపడం నిజం కాదా? పీపీఏ కుదిరిన నాటికి అదానీ కంపెనీ అసలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకపోవడం నిజం కాదా? సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న అజూర్ కంపెనీ మధ్యలో ఎందుకు మాయమైంది? మొత్తం 7000 మెగావాట్లకు గాను 2024 సెప్టెంబరు నుంచి 3 వేలు, 2025 సెప్టెంబరు నుంచి మరో 3000, మిగిలిన వెయ్యి యూనిట్లను 2026 సెప్టెంబరు నుంచి సరఫరా చేస్తామని సెకీ పేర్కొనడం నిజం కాదా? ఇంతా చేసి ఈ ఏడాది సెప్టెంబరు నుంచి మూడు వేల మెగావాట్లు సరఫరా చేయాల్సిన అదానీ కంపెనీ ఇంకా ఉత్పత్తి కూడా ప్రారంభించక పోవడం నిజం కాదా? వేరే రాష్ర్టాలలో ఉత్పత్తి చేయబోతున్న విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాక... అదే అదానీ కంపెనీకి రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇవ్వడం ఏమిటి? దేశంలో ఎక్కడా లేని విధంగా 25 ఏళ్ల పాటు రైతులకు చౌకగా యూనిట్ 2.49 రూపాయలకే సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని అప్పట్లో గొప్పలు చెప్పుకొని... తెర వెనుక 5 రూపాయలకు పైగా చెల్లించడానికి పీపీఏ ఎలా కుదుర్చుకున్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ ద్వారా అదానీ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఎందుకు నిరాకరించాయి? ఈ అంశాలను లోతుగా పరిశీలిస్తే ఏ స్థాయిలో కుంభకోణం జరిగిందో స్పష్టమవుతుంది. సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న అజూర్ కంపెనీకి మొండి చేయి చూపించింది ఎవరు? అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ కూడా అయిన అజూర్ కంపెనీని వేల కోట్ల రూపాయల నిధులు సేకరించడానికి వాడుకున్న అదానీ చివరికి ఆ కంపెనీకి ఏమీ దక్కకుండా చేయడం వల్లనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జగన్ పేరాశ, అదానీ దురాశవల్ల ఈ భారీ కుంభకోణం బద్ధలైంది. సాగర్ అదానీ ఫోన్ లభించి ఉండకపోతే అమెరికా ఏజెన్సీలు కూడా ఈ పాపాల పుట్టను ఛేదించి ఉండేవి కావు. ఇండియాలో జగన్‌తో సహా ఎవరికి ఎంత మొత్తం బదలాయించాలో ఫోన్లో వివరంగా నిక్షిప్తం చేశారు. ప్రాథమిక ఆధారాలను సరిపోల్చుకున్న తర్వాతే గ్రాండ్ జ్యూరీ ఈ కేసు దాఖలుకు అనుమతి ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు ఏం చేస్తారు?
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రస్తుతం. అదానీ కంపెనీ నుంచి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతున్నది. ప్రజలపై రెండు లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. ఈ పాపానికి ఒడిగట్టింది జగన్‌రెడ్డి కాదా? ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏమిటి? సెకీ ద్వారా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకొని తీరాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? ప్రజలపై రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే అవుతుంది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతున్నది? దాని పర్యవసానం అదానీ కంపెనీపై ఏ మేరకు ఉంటుందన్నది అప్రస్తుతం. అమెరికా ఏజెన్సీల రంగ ప్రవేశంతో అదానీ గ్రూపు కంపెనీలకు రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలు ముఖం చాటేస్తాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్న విధంగా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేసే స్థితి కూడా అదానీకి ఉండకపోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఏ రూపంలో లంచాలు ఇచ్చింది అజూర్ కంపెనీ పూసగుచ్చినట్టు అమెరికా ఏజెన్సీలకు వివరించినందున అదానీ గ్రూపు ఇందులో నుంచి బయటపడలేకపోవచ్చు. ఇక జగన్‌రెడ్డి విషయానికి వస్తే... ఆయన ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేతికి చిక్కారు. గతంలో తనపై సీబీఐ, ఈడీ సంస్థలు అవినీతి కేసులు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేసినా అవి విచారణకు నోచుకోకుండా టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో అడ్డుకుంటూ వస్తున్న జగన్ అండ్ కో ఇప్పుడు కూడా తప్పించుకోగలరా? తన చేతికి చిక్కిన జగన్‌రెడ్డిని చంద్రబాబు విడిచిపెడతారా? అదానీ కంపెనీ నుంచి జగన్‌రెడ్డికి 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని రుజువవుతుందో లేదో తెలియదుగానీ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా ట్రాన్స్‌మిషన్ చార్జీలు, ట్రాన్స్‌మిషన్ నష్టాల రూపంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్న పాపానికి జగన్‌రెడ్డి విచారణను ఎదుర్కోక తప్పదు. తనకు అందివచ్చిన ఈ మహదావకాశాన్ని చంద్రబాబు వదులుకోకపోవచ్చు. వదులుకుంటే ఆయన రాజకీయంగా ఘోర తప్పిదం చేసినవారవుతారు. ఇదే చంద్రబాబు చేసి ఉంటే జగన్‌రెడ్డి ఇప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు పంపి ఉండేవారు. సీబీఐ కేసులలో తప్పించుకు తిరుగుతున్న జగన్‌రెడ్డిని ఈ కేసులో పకడ్బందీగా ఇరికించే అవకాశం చంద్రబాబు ప్రభుత్వానికి అందివచ్చింది. ఇంత పెద్ద కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి జగన్‌రెడ్డికి దారులు మూసుకుపోయాయి. ఇప్పటి దాకా ఆయనను కాపాడుతూ వచ్చినవాళ్లు ఈ వ్యవహారంలో ఆయనను ఆదుకోకపోవచ్చు. సీబీఐ, ఈడీ కేసులలో అదానీ సహకారాన్ని కూడా జగన్‌రెడ్డి పొందుతూ వచ్చారు. ఇప్పుడు అదానీనే అమెరికాలో విచారణను ఎదుర్కోబోతున్నందున ఆయన వైపు నుంచి కూడా సహకారం లభించదు. వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు ఇప్పుడు జగన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వానికి చిక్కారు. చంద్రబాబు ఆడబోయే గేమ్ ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం!
సాయిరెడ్డీ... టైమ్ అండ్ ప్లేస్ చెప్పు!
ఈ విషయం అలా ఉంచితే గత వారం నేను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కాకపోతే ముఖాముఖి కాకుండా ‘మేధావులు, విశ్రాంత న్యాయమూర్తులు, మీడియా సంస్థలు, ఇంకా ఎవరెవరి సమక్షంలోనో చర్చ జరగాలి. తగ్గేదేల్యా?’ అని సినిమా డైలాగులు పలికారు. ఇంకా నయం– ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో చర్చ జరగాలని కోరలేదు. అయినా ఆయన అంతగా ముచ్చటపడుతున్నందున ఎందుకు కాదనాలి? టైం, ప్లేస్ నువ్వే డిసైడ్ చెయ్. పిలవాల్సిన వారందరినీ పిలుచుకో. కొంచెం ముందుగా నాకు తెలియజేస్తే చాలు వచ్చేస్తాను. నిన్ను నలుగురిలో నిలబెట్టి కడిగేయాలని నాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఇంతవరకూ నాకు ఈ అవకాశం లభించలేదు. ఇప్పుడు నువ్వే ముచ్చటపడుతున్నావు కనుక నీ నిజ స్వరూపాన్ని ప్రజలందరికీ చూపించే అవకాశం దక్కుతుంది. గత ఐదేళ్లలో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో అధికారంలో ఉన్న కేసీఆర్, జగన్‌రెడ్డికీ నాకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఉభయ రాష్ర్టాల ప్రజలందరికీ తెలిసిందే. అయినా మద్యం, మైనింగ్ వ్యవహారాల్లో నేను ఏదో డీల్ చేశానని చెబుతున్నావు కదా? అదే నిజమైతే మద్యం, మైనింగ్ వ్యవహారాల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని అంగీకరిస్తున్నావా ఓ మాయామశ్చీంద్రా? మీడియా అధిపతిగా నన్ను మంచి చేసుకోవాలని మీరు భావించారనే అనుకుందాం!
అప్పుడు కూడా మీరు వెధవ పనులు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా! ఆ వెధవ పనులను కప్పిపుచ్చడానికి నాతో డీల్స్ కుదుర్చుకున్నానని అంగీకరిస్తున్నావా? ఒక ఆడిటర్‌గా అనైతిక చర్యలకు పాల్పడినందుకు నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని మీ చార్టెడ్ అకౌంటెంట్స్ సంస్థ నోటీసు ఇచ్చింది కదా? దానిపై కూడా స్టే తెచ్చుకొని తప్పించుకుంటున్నావు. తప్పుడు పనులు చేసి ఉండకపోతే స్టే తెచ్చుకోవడం ఎందుకో? దొంగ లెక్కలకు మారుపేరైన నువ్వు కూడా సవాళ్లు విసరడం గొప్పగా ఉంది. ఎంతైనా నీ బరితెగింపును అభినందించాలోయ్ విజయ సాయీ! ఎందుకైనా మంచిది జగన్‌రెడ్డి అనుమతి తీసుకొని చర్చకు సిద్థపడు. జగన్ ముందు కూర్చోడానికి కూడా ధైర్యం లేని నీకు తేడా వస్తే వీపు పగిలిపోయే ప్రమాదం ఉంది. టేక్ కేర్!
ఆర్కే