ఎన్నికల్లో ‘నెటిజన్స్’ ఎవరి వైపు?
ABN , Publish Date - May 22 , 2024 | 02:15 AM
కోవిడ్ సంక్షోభం తర్వాత జనంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే,...
కోవిడ్ సంక్షోభం తర్వాత జనంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే, 2019 ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఫేస్‌బుక్, ప్రస్తుత సార్వత్రక ఎన్నికల్లో చతికిలపడింది. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న ఎంగేజ్‌మెంట్ గత కొన్ని రోజులుగా ఎలా మారుతూ వచ్చిందో పీపుల్స్ పల్స్ బృందం అధ్యయనం చేసింది.
గత నెల రోజులుగా జాతీయంగా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, బీజేపీ విధానాలపై చేస్తున్న విశ్లేషణాత్మక వీడియోల్ని సగటున 2 కోట్ల మంది వ్యూయర్స్ చూశారు. 1.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఈ చానెల్‌లో గత మూడు వారాల్లో అప్‌లోడ్ చేసిన వీడియోలు 11 కోట్ల మందికి చేరాయి. అదే సమయంలో 2.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ య్యూ ట్యూబ్ చానెల్‌లో గత మూడు వారాల్లో పెట్టిన అత్యధిక వీడియోలకు వచ్చిన వ్యూస్ వేలల్లోనే ఉన్నాయి. 52 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూ ట్యూబ్ చానెల్‌లో గత మూడు నాలుగు వారాల్లో అప్‌లోడ్ చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్ని కేవలం చూసి వదిలేస్తున్నారా? లేక వీటి ప్రభావం ఎన్నికలపై ఉంటుందా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి యూ ట్యూబ్‌లో జాతీయంగా బీజేపీకి సుమారు 51 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు 15.7 శాతం పెరిగి 59 లక్షలకు చేరింది. 5 నెలల కింద కాంగ్రెస్‌కి 38 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు అది 27 శాతం పెరిగి 48 లక్షలకు చేరింది. నరేంద్రమోదీ ఇన్‌స్టాగ్రాంలో 8.9 కోట్ల మంది ఫాలోవర్స్‌తో శాచురేషన్ పాయింట్‌కి చేరుకున్నారు. 80 లక్షల ఫాలోవర్స్‌తో రాహుల్ గాంధీ ఆయనకు చాలా దూరంలో ఉన్నారు. కానీ, గడిచిన ఏడాదికాలంలో ఆయన ఫాలోవర్స్ గణనీయంగా పెరిగారు. ఇలాంటి పెరుగుదల మోడీ ఖాతాలో కనిపించలేదు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీకి ఇన్‌స్టాగ్రాంలో ఫాలోవర్స్ 18 లక్షల నుంచి 27 లక్షలకు పెరిగారు. పక్షంరోజుల కింద ఆయన ఫాలోవర్స్ సంఖ్య 70 లక్షలకు రాగా, ఐదురోజులక్రితం అది 80 లక్షలకు చేరింది. ఇన్ స్టాగ్రామ్‌లో బీజేపీకి 79 లక్షల మంది ఫాలోవర్స్, కాంగ్రెస్ ఫాలోవర్స్ 54 లక్షలకు చేరారు. రామమందిర్ ప్రారంభోత్సవం వరకు మోదీ ఇన్‌స్టాగ్రాం ఎంగేజ్‌మెంట్ అధికంగా ఉండేది. కానీ, ఆ తర్వాత వారం నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆయనకు రాహుల్ గాంధీ కన్నా పది రెట్లు అధిక వ్యూసే వస్తున్నా, రాహుల్ గాంధీ ఖాతాకు ఉన్నంత ఎంగేజ్‌మెంట్ మోదీ ఖాతాకు లేదు. అదానీ, అంబానీ గురించి మోదీ మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్‌గా రాహుల్ గాంధీ చేసిన రెండు వీడియోలకు 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇవన్నీ దేనికి సంకేతం?
తమకు కావాల్సిన కస్టమైజ్డ్ సమాచారం లేదా విశ్లేషణ కోసం ప్రజలు యూ ట్యూబ్ చానెళ్లను చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సొంతంగా ప్రధాన స్రవంతి మీడియా లేకున్నా, సోషల్ మీడియా, యూ ట్యూబ్ చానెళ్లు దాని విజయంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 65 శాతం మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. 18-–19 ఏళ్ల వయసున్న కొత్త ఓటర్లు తెలంగాణలో 9 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 10.3 లక్షల మంది ఉన్నారు. కొత్త ఓటర్లు మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. కాబట్టి, వీరిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంది. 5 నెలల క్రితం, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ యూ ట్యూబ్ చానెల్ సబ్‌స్క్రైబర్స్ లక్షా పదివేలమంది. ఇప్పుడు అది 64 శాతం పెరిగి లక్షా 81 వేలకు చేరింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీకి 24 వేలు ఉండగా, 304 శాతం పెరిగి 92 వేలకు చేరింది. కాంగ్రెస్‌కి లక్ష ఉండగా, అది 150 శాతం పెరిగి నుంచి 2 లక్షల 50 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 5 నెలల కింద వైఎస్‌ఆర్‌సీపీకి 4.5 లక్షలు ఉండగా, ఇప్పుడు అది 26 శాతం పెరిగి 5.7 లక్షలకు చేరింది. టీడీపీకి సుమారు 2.4 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు అది 85 శాతం పెరిగి 5.2 లక్షలకు చేరింది. జనసేనకు 13 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉండగా, ఇప్పుడు అది 15.6 లక్షలకు చేరింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ని జాగ్రత్తగా గమనిస్తే నెటిజన్స్ ఎవరివైపు చూస్తున్నారనేదానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైసీపీ అధికారిక ఖాతాకు ప్రస్తుతం 2.1 లక్షల మంది ఫాలోవర్స్, టీడీపీకి 3.2 లక్షల మంది, జనసేనకు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారికి ఎక్కువ ఓట్లు వస్తాయని కాదు. ఫాలోవర్స్, స్పాన్సర్డ్ వీడియోలను పక్కనపెడితే, గడిచిన మూడు వారాల్లో వైసీపీ పెట్టిన వీడియోల కంటే, టీడీపీ, జనసేన పేజీలలో పెట్టిన కంటెంట్‌కి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ కనిపిస్తోంది. జగన్ గులకరాయి దాడి వీడియోలను వైసీపీ పేజీల కంటే కూటమి పేజీల్లోనే జనం ఎక్కువగా చూశారు. తాము గెలుస్తున్నామని జగన్ ఐ ప్యాక్ ప్రతినిధులతో మాట్లాడిన వీడియో ఆయన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో 5 లక్షల మందికి మాత్రమే చేరింది. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నెటిజన్స్ ఎటువైపు ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసిన కంటెంట్ కంటే, రాష్ట్ర బీజేపీ షేర్ చేసిన కంటెంట్‌కి ఎంగేజ్‌మెంట్ పెరిగింది. ఈ కోణంలో నెటిజన్స్ షిఫ్ట్ అవుతున్న తీరును అధ్యయనం చేస్తే ఆంధ్రాలో ఎక్కువమంది కూటమి, తెలంగాణలో అత్యధికులు బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు చూచాయగా తెలుస్తోంది. జాతీయ డిజిటల్ మీడియా ముఖ చిత్రాన్ని గమనిస్తే... బీజేపీపై నెటిజన్స్ కొంతవరకు అసంతృప్తి కనబరుస్తున్నట్టుగా, గతంలో కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు తరలి వెళ్లినట్టు ట్రెండ్స్ చెప్తున్నాయి. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ ఇస్తున్న సంకేతాలకు అనుగుణంగా ఎన్నికల తుది ఫలితాలు ఉంటాయా, లేదా అన్న ప్రశ్నకు సమాధానం జూన్ 4న తెలుస్తుంది.
జి.మురళికృష్ణ
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ