Share News

Investigation : వెంటాడిన నేరం...!

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:22 AM

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో అరెస్టయి, ప్రత్యేక విమానంలో నెదర్లాండ్స్‌కు తరలిన ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే శుక్రవారం హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు–ఐసిసి) ముందు హాజరైనారు.

Investigation : వెంటాడిన నేరం...!

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో అరెస్టయి, ప్రత్యేక విమానంలో నెదర్లాండ్స్‌కు తరలిన ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే శుక్రవారం హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు–ఐసిసి) ముందు హాజరైనారు. అలసిపోయి ఉంటారు, ప్రత్యక్షంగా రానక్కరలేదు అంటూ న్యాయమూర్తులు ఇచ్చిన మినహాయింపు మేరకు, సమీపంలో ఉన్న డిటెన్షన్‌ సెంటర్‌నుంచి ఆయన విడియోలింకు ద్వారా తొలిసారిగా విచారణకు హాజరైనారు. మాదకద్రవ్యాలమీద యుద్ధం పేరిట తన ఏలుబడిలో వేలాదిమందిని చంపిన నేరానికి ఐసిసి ఆయనను విచారిస్తోంది. దశాబ్దంన్నరకు పైగా ఐసిసి తనను వెంటాడుతున్నకాలంలో, అడపాదడపా ఆ న్యాయస్థానాన్ని అవమానిస్తూ, నన్ను నువ్వేం చేయలేవంటూ అసభ్యపదజాలంతో చేసిన వ్యాఖ్యలన్నీ ఈ సందర్భంగా ఆయనకు గుర్తుకొచ్చివుంటాయి.


దేవుడు క్షమించడు, పాపులను శిక్షించేవరకూ విశ్రమించడు అని దుతర్తే హయాంలో ఆయన తుపాకీగుళ్ళకు బలైన వారి కుటుంబీకులు సంతోషిస్తున్నారు. ఒక వదరు,పొగరుబోతుకు తగినశాస్తి జరిగిందని అంటున్నారు. తన నేరాలూ ఘోరాలమీద ఆయనకు పశ్చాత్తాపమేమీ లేదు. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అణచివేయడం తప్పుకాదని వాదిస్తూ, ఆ ముసుగులో తాను నిబంధనలను ఉల్లంఘించిన నేరాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. వీధులను శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని జీవులు సహజంగానే చస్తాయంటూ డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నేరంమీద అమాయకులను సైతం కాల్చిపారేసిన గతాన్ని నిజం కాదంటున్నాడు. ఇప్పుడు ఆయన లాయర్‌ ఈ అరెస్టు అక్రమమంటున్నాడు కానీ, దేశ పాలకుడుగా తాను ఎంతటి అమానుషత్వానికైనా ఒడిగట్టవచ్చునని దుతర్తే స్వయంగా గతంలో పలుమార్లు చెప్పుకున్నాడు. 2016లో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు కావడానికి ముందు, దావౌనగర మేయర్‌గా ఉన్నకాలంలో డెత్‌స్వ్కాడ్‌లను రహస్యంగా నిర్వహించాడు. కేసులు, విచారణలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా, ఈ ప్రైవేటు సైన్యమే నేరగాళ్ళకు మరణశిక్ష విధించేది. తన హయాంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ప్రజలకు చూపించి, దేశాన్ని ప్రక్షాళించడానికి తనలాంటి హీరో అవసరమని ప్రజలను నమ్మించి అధ్యక్షుడైనాడు. దేశం మొత్తం తన అధీనంలోకి రావడంతో ముసుగులు కూడా అవసరం లేకపోయింది. మరిన్ని డెత్‌స్క్వాడ్‌లు తయారైనాయి. పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చి, ప్రాణానికి ఇంత అంటూ వెలగట్టడంతో వారు అడ్డూఆపూ లేకుండా రెచ్చిపోయారు. అనుమానితులను తిరగబడేట్టుగా చేసి కాల్చిపారేయమని తానే చెప్పానని ఒక దశలో దుతర్తే గొప్పలకు పోయాడు. ఆయన ఆధ్వర్యంలో సాగిన మాదకద్రవ్యాలమీద యుద్ధంలో కనీసం ముప్పైవేలమంది మరణించారని అంచనా.


మానవహక్కుల ఉల్లంఘనలు, హత్యలపై ఐసిసి దర్యాప్తు ఆరంభించడంతో ఆయన 2019లో తన దేశాన్ని రోమ్‌ ఒప్పందంనుంచి బయటకు తెచ్చేశారు. ఐసిసికి విచారణార్హతలేదనో, పరిధి కాదనో ఆయన ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. 2022 ఎన్నికల్లో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ మార్గాన్ని సుగమం చేయడంతో ఐసిసికి మళ్ళీ 2023జులైనుంచి దర్యాప్తు కొనసాగించే అవకాశం వచ్చింది. ఫిలిప్పీన్స్‌ అంతర్గత రాజకీయవైరాలు ఈ మాజీ అధ్యక్షుడి అరెస్టులో కీలకపాత్ర పోషించినమాట వాస్తవం. ప్రస్తుత అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌, దుతర్తే కుమార్తె సారా దుతర్తే కలసి 2022 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్యా చెడింది. అధ్యక్షుడినే హత్యచేయించడానికి ప్రయత్నించారన్న ఆరోపణతో సహా పలు అభియోగాలతో ఉపాధ్యక్షురాలిని అభిశంసించే ప్రక్రియసాగుతోంది. యుద్ధాలు చేస్తున్న పుతిన్‌, నెతన్యాహూలమీద కూడా అరెస్టువారెంట్లు జారీ చేసినా, వారిని పట్టితేలేకపోయిన ఐసిసికి దుతర్తే రాక కాస్తంత ఉపశమనం. గాజాలో మానవహననానికి పాల్పడిన నెతన్యాహూమీద అరెస్టువారెంట్‌ జారీచేయించినందుకు ఐసిసి చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీంఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలురకాల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దుతర్తేమీద విచారణ ఎన్ని సంవత్సరాలు సాగుతుందో, ఆయనకు ఏ శిక్షపడుతుందో తెలియదు కానీ, ప్రజల ప్రాణాలంటే విలువలేని, మానవహక్కులమీద గౌరవం లేని పాలకులకు ఇది ఒక హెచ్చరిక. అధికారంలో ఉండగా తిరుగులేదని, ఎదురులేదని విర్రవీగుతూ, చట్టవ్యతిరేకంగా వ్యవహరించేవారికి గుణపాఠం.

Updated Date - Mar 15 , 2025 | 03:22 AM