Share News

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:55 AM

స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది. సభ తీర్మానమని చెబుతూ ఆయన ఎమర్జెన్సీని ఖండించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయాన్ని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించి.. 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆ చర్యను నేను ఖండిస్తున్నాను. 1975లో ఇదే రోజు(జూన్‌ 26) ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది.

ఆ రోజు దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది’’ అని ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి అభినందిస్తున్నానని, వారు తమ పోరాటంతో భారత రాజ్యాంగాన్ని కాపాడారని పేర్కొన్నారు. సభ్యులు అంతా రెండు నిమిషాలు మౌనం పాటించాలని సూచిస్తూ.. సభను గురువారానికి వాయిదా వేశారు.

కాగా.. స్పీకర్‌ ఎమర్జెన్సీ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీని స్పీకర్‌ తీవ్రంగా ఖండించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో జరిగిన చీకటి అధ్యాయాన్ని ఎత్తిచూపడాన్ని అభినందిస్తూ.. నేటి యువత ఎమర్జెన్సీ రోజుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.


విపక్ష.. అధికార పక్ష నిరసనలు

స్పీకర్‌ ఓం బిర్లా ఎమర్జెన్సీపై మాట్లాడడాన్ని లోక్‌సభలో విపక్ష నేతలు ఖండించారు. తమతమ స్థానాల్లోంచి లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలోనే అభ్యంతరం చెబుతూ నినదించారు. ‘‘నియంతృత్వాన్ని ఆపండి’’ అని నినాదాలిచ్చారు. సభ వాయిదా పడ్డాక.. కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు లోక్‌సభ వెలుపల ఆందోళన చేపట్టారు.

‘‘ఎమర్జెన్సీపై కాంగ్రెస్‌ సిగ్గుపడాలి’’.. ‘‘ఎమర్జెన్సీ విధించినందుకు క్షమాపణలు చెప్పాలి’’.. అని హిందీలో రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ‘‘రాజ్యాంగ ప్రతులను చేతుల్లో పట్టుకున్న వాళ్లు అద్దంలో ఒకసారి చూసుకోవాలి. రాజ్యాంగాన్ని మార్చాలని చూసింది ఎవరో తెలుస్తుంది’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్‌ పాత్రా వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 27 , 2024 | 03:55 AM