Rajya Sabha Elections: 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:40 PM
Rajya Sabha Elections: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం నాడు ఎన్నిక షెడ్యూల్‌ని విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
Rajya Sabha Elections: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం నాడు ఎన్నిక షెడ్యూల్‌ని విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో కే. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ అయ్యింది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలివే..
12 రాజ్యసభ స్థానాల ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగష్టు 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆగష్టు 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అలాగే.. బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు.. ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు ప్రకటించింది ఎన్నికల కమిషన్. సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 27వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అయితే, మొత్తం 12 సీట్లలో 11 సీట్లు ఎన్డీయే కూటమి గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక సీటు మాత్రం కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది. అది కూడా తెలంగాణ నుంచే కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీట్ కైవసం చేసుకోనుంది.