Share News

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:43 AM

ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

  • చిరంజీవి, బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారాలు

  • ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సమంత.. ఉత్తమ చిత్రంగా ‘దసరా’

అబుదాబి: ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలువురు అగ్రతారలు హాజరయ్యారు. 2024కు గాను అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఐఫా గోల్డెన్‌ లెగసీ పురస్కారాన్ని స్వీకరించారు. ఐఫా ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం సమంతకు దక్కింది. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ విలన్‌గా షైన్‌ టామ్‌ చాంకో అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించేందుకు వేదికపైకి వచ్చిన ఐశ్వర్యారాయ్‌బచ్చన్‌ బాలకృష్ణ పాదాలకు నమస్కరించి పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

  • పీఎస్‌ 2కు అత్యధిక పురస్కారాలు

తమిళ పరిశ్రమ నుంచి ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రం అత్యధిక పురస్కారాలను కైవసం చేసుకుంది. ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, ఉత్తమ నటుడిగా విక్రమ్‌, ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏ ఆర్‌ రెహమాన్‌, ఉత్తమ సహాయ నటుడిగా జయరామ్‌ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రంగా ‘జైలర్‌’ నిలిచింది. ఎస్‌. జే సూర్య (మార్క్‌ ఆంటోని)కు ఉత్తమ విలన్‌ పురస్కారం దక్కింది. కన్నడ సీమ నుంచి ‘కాటేరా’ చిత్రానికి గాను జగపతిబాబు ఉత్తమ విలన్‌, తరుణ్‌ సుధీర్‌ ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని దక్కించుకున్నారు.

  • విజేతలు వీరే

  1. ఉత్తమ దర్శకుడు - అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)

  2. ఉత్తమ సినిమాటోగ్రఫీ - ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’

  3. ఉత్తమ సహాయ నటుడు - బ్రహ్మానందం (రంగమార్తాండ)

  4. ఉత్తమ నటి - మృణాల్‌ ఠాకూర్‌, (హాయ్‌ నాన్న),

  5. ఉత్తమ సహాయ నటి - వరలక్ష్మి శరత్‌కుమార్‌ (వీరసింహారెడ్డి)

  6. ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ (హాయ్‌ నాన్న)

  7. ఉత్తమ గీత రచయిత - అనంత్‌ శ్రీరామ్‌ (బేబీ)

  8. ఉత్తమ నేపథ్య గాయకుడు - రాహుల్‌ సిప్లిగంజ్‌

  9. ఉత్తమ నేపథ్య గాయని - మంగ్లీ (బలగం)

Updated Date - Sep 29 , 2024 | 04:43 AM