Delhi: కోర్టు మెట్లెక్కిన ఈడీ.. కారణం అదే
ABN , Publish Date - Feb 04 , 2024 | 08:44 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో పంపిన సమన్లను సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై ఈడీ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసేందుకు దర్యాప్తు సంస్థ కోర్టు మెట్లెక్కింది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో పంపిన సమన్లను సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై ఈడీ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసేందుకు దర్యాప్తు సంస్థ కోర్టు మెట్లెక్కింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోదియాతో పాటు మరి కొందరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై దర్యాప్తు కోరుతూ ఈడీ ఇప్పటికే ఐదుసార్లు సమన్లు పంపింది.
అయితే కేజ్రీవాల్ వాటిని దాటవేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన సమన్లను పాటించడం లేదని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అయితే ఈడీ సమన్లను కేజ్రీ చట్ట విరుద్ధమైనవిగా పరిగణిస్తూ.. రాజకీయ కక్షతోనే బీజేపీ తనను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు. 2023లో నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో సమన్లు వెళ్లాయి.
ఇదీ కేసు
రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు లిక్కర్ కంపెనీల నుంచి అధికార (ఆప్) పార్టీ నేతలకు వందలాది కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయని, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేసిందన్నది ప్రధానమైన ఆరోపణ.
ఢిల్లీ కొత్త మద్యం పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతోపాటు వారి సన్నిహితులకు కూడా ఈ అవినీతి, అక్రమాల్లో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి.