Share News

YCP Activists : బెంగళూరు వెళ్లినా.. బిల్లుల గోలే!

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:18 AM

పెండింగ్‌ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు.

YCP Activists : బెంగళూరు వెళ్లినా.. బిల్లుల గోలే!

జగన్‌కు చుక్కలు చూపుతున్న వైసీపీ కార్యకర్తలు

  • యలహంక ప్యాలెస్‌ వద్ద శ్రేణుల ఆందోళన

  • లోపలకు రాకుండా గేట్లు మూసేసిన సిబ్బంది

బెంగళూరు/అమరావతి-ఆంధ్రజ్యోతి/పులివెందుల, జూన్‌ 24: పెండింగ్‌ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు నిరసన తెలిపారు. ఆయన బెంగళూరు వెళ్లినా అక్కడకు వెళ్లి ఆగ్రహంతో నినాదాలు చేశారు.

పులివెందుల అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పాడా) పనులు చేపట్టిన స్థానిక ఛోటామోటా నేతల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం.. జగన్‌ మాజీ అవడంతో తమ పరిస్థితేంటని శని, ఆదివారాల్లో ఆయన్ను నిలదీశారు.

సోమవారం కూడా పలువురు ఆయన్ను కలిశారు. బిల్లులు ఆగిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని వాపోయారు జగన్‌ స్పందిస్తూ ఎవరు అధైర్యపడొద్దని.. అందరికీ బిల్లులు వచ్చేలా కోర్టు ద్వారా సాధించుకుందామని సూచించారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో భార్యాసమేతంగా బెంగళూరు యలహంక ప్యాలె్‌సకు వెళ్లారు. అయితే పులివెందులకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడకు కూడా పెద్దసంఖ్యలో చేరుకున్నారు.


పెండింగ్‌ బిల్లులకు నిధులు విడుదల చేయించాలంటూ ఆయన్ను ఘెరావ్‌ చేసినట్లు తెలిసింది. అయితే జగన్‌ను కలిసేందుకు వీలులేకుండా సిబ్బంది ప్యాలెస్‌ గేట్లు మూసివేయడంతో కార్యకర్తలు మండిపడ్డారు. ‘సైకో జగన్‌ డౌన్‌డౌన్‌’ అంటూ వారు నినాదాలు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

పదేళ్ల తర్వాత బెంగళూరు ప్యాలె్‌సకు జగన్‌!

బెంగళూరులోని తన యలహంక ప్యాలె్‌సకు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పదేళ్ల తర్వాత వచ్చారు. ఇక్కడ ఆరు రోజులపాటు బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు జగన్‌ యలహంకలో ప్రత్యేక ఆసక్తితో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ప్యాలె్‌సను నిర్మించుకున్నారు. లోపల హెలిప్యాడ్‌తోపాటు వివిధ సౌలభ్యాలు ఉన్నాయి. వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్‌ ఎక్కువగా ఇక్కడే గడిపేవారు.

Updated Date - Jun 25 , 2024 | 04:18 AM