Manmohan Singh: ఆర్థిక మార్గదర్శి అస్తమయం
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:33 AM
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది! కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు!! మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు..
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత
ప్రస్తుత మీడియా, ఆ మాటకొస్తే పార్లమెంటులోని విపక్షాల కన్నా.. చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయతీగా నమ్ముతున్నా. ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను కానీ, సంకీర్ణ రాజకీయాల అనివార్యతలను దృష్టిలో పెట్టుకొని, ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించా.
- 2014 జనవరి 3న ప్రధానమంత్రిగా
తన చివరి విలేకరుల సమావేశంలో మన్మోహన్‌సింగ్
ఆయన మాటలు గట్టిగా వినిపించవు! ‘మౌనమే’ ఘనంగా పని చేస్తుంది!
అంతుపట్టని ఆయన ఆలోచనల లోతు... దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది!
ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం... నేడు ఘనంగా కనిపిస్తోంది!
పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో, ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది!
నేటి తరం రాజకీయాల్లో ‘మిస్టర్ క్లీన్’... రేపటి తరానికి ఆదర్శం... విద్యా వేత్త, ఆర్థిక వేత్త, సంస్కరణల రూప శిల్పి... నిగర్వి, నిష్కళంకుడు, నిరాడంబరుడు... మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం ముగిసింది!
ఎవరేమన్నా... ఎవరెన్ని విమర్శలు చేసినా... ‘మౌనం’గా పని చేసుకుంటూ వెళ్లిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు! కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస వదిలారు. ఆయన అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు! అంతే ఆకస్మికంగా, అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలూ చేపట్టారు! 92ఏళ్ల జీవితం.. దేశ విభజన తర్వాత పాకిస్థాన్ నుంచి భారత్‌లో వలస జీవనం... ఎన్నెన్నో మలుపులు, మెరుపులు! డాక్టర్ మన్మోహన్‌సింగ్ సేవలను భారతదేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.
ఆర్థిక సంస్కరణలు.. జీడీపీ వృద్ధిలో ఉరకలు
దివాలా స్థాయి నుంచి.. దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్
అగ్నిపరీక్షలో.. మన్మోహన్‌కు పీవీ దన్ను!
భారత్‌ను గట్టెక్కించిన ‘ఆర్థిక’ బంధం
దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్
నెల రోజుల్లోనే తయారు చేసిన మన్మోహన్
దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి
మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు విశేష కృషి చేశారు
- నరేంద్ర మోదీ
దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి.
- మల్లికార్జున ఖర్గే
గురువును, మార్గదర్శకుడిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో ఆయన దేశాన్ని నడిపించారు
- రాహుల్ గాంధీ
వృద్ధాప్య సమస్యలతో మాజీ ప్రధాని తుదిశ్వాస
గురువారం రాత్రి 9:51 గంటలకు ఎయిమ్స్‌లో మృతి
హుటాహుటిన ఆస్పత్రికి సోనియాగాంధీ, ప్రియాంక
బెళగావి నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ, ఖర్గే
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం
అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు ఏడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది! కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు!! మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు.. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయన్ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని... రాత్రి 9:51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. మన్మోహన్‌సింగ్‌కు భార్య గురుచరణ్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, అమృత్, దమన్ ఉన్నారు.
మన్మోహన్‌ను ఆస్పత్రిలో చేర్పించారన్నవార్త తెలిసిన వెంటనే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక.. కర్ణాటకలోని బెలగావీలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.. మన్మోహన్ మరణవార్త తెలియగానే ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన గౌరవార్థం.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే ఏడు రోజులపాటు నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2025 జనవరి 3న పార్టీ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. అప్పటిదాకా పార్టీ జెండాను అవనతం చేస్తామని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాగా.. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని గురువారం రాత్రే ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కాగా.. ఆయన గౌరవార్థం కేంద్రం ఏడురోజులు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించింది.
మోహనా.. మోహనా..
నెహ్రూ అంతటి వ్యక్తే స్వయంగా పిలిచినా.. ‘నేను పాఠాలు చెప్పుకొంటాను తప్ప, రాజకీయాల్లోకి రాను’ అన్న మన్మోహన్.. ప్రస్తుత పాకిస్థాన్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26న గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్‌కౌర్ దంపతులకు జన్మించారు. చిన్నవయసులోనే తల్లి చనిపోవడంతో.. మన్మోహన్ తన అమ్మమ్మ జమ్నాదేవి వద్దే పెరిగారు. చిన్నతనంలో అందరూ ఆయనను ముద్దుగా మోహనా.. మోహనా అని పిలిచేవారు. ఆయన పెరిగిన ఊళ్లో స్కూలు కూడా లేదు. రోజూ స్నేహితుడితో కలిసి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నారు. పదో ఏడు వచ్చేదాకా ఆయన విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే జరిగింది. అందుకే.. ఆయన జీవితమంతా తన హిందీ ప్రసంగాలను కూడా ఉర్దూలోనే రాసుకుని చదివేవారు (కొన్నికొన్నిసార్లు తన మాతృభాష అయిన పంజాబీలో రాయడానికి గురుముఖి లిపిని వాడేవారు). దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే.. అంటే 1948లో అమృత్‌సర్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ (1952లో), పీజీ (1954లో) పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ఆనర్స్ పూర్తిచేశారు. పాఠశాల స్థాయి నుంచి కేంబ్రిడ్జి దాకా.. చదువులో ఆయన ఎప్పుడూ టాపరే. స్కాలర్‌షి్‌ప్సతోనే ఆయన చదువులన్నీ సాగాయి.
డాక్టరేట్ చేసిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. మానవ జీవితాలను రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని తాను కేంబ్రిడ్జి వర్సిటీలో ఉన్న రోజుల్లోనే తెలుసుకున్నానని మన్మోహన్ 2005లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంబ్రిడ్జిలో ఉన్నత విద్య పూర్తిచేసుకున్న అనంతరం భారతదేశానికి తిరిగివచ్చిన ఆయన.. పంజాబ్ వర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మళ్లీ 1960లో ఇంగ్లండ్‌కు వెళ్లి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో డీఫిల్ చేశారు. ‘ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ పెర్ఫార్మెన్స్, 1951-1960, ఎక్స్‌పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్’ అనే అంశంపై డాక్టొరల్ థీసిస్ రాశారు. దరిమిలా ఆ థీసిస్ ఆధారంగానే.. ‘ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టెయిన్డ్ గ్రోత్’ అనే పుస్తకం రాశారు. డీఫిల్ పూర్తయ్యాక మళ్లీ ఇండియాకు తిరిగొచ్చి పంజాబ్ వర్సిటీలో రీడర్‌గా పనిచేశారు. 1963 నుంచి 1965 దాకా ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా వ్యవహరించారు. 1966 నుంచి 1969 దాకా ‘యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవల్‌పమెంట్’కు పనిచేశారు. ఆర్థికవేత్తగా ఆయన ప్రతిభను గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ఎంపీ లలిత్‌నారాయణ్ మిశ్రా.. ఆయన్ను విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారుగా నియమించారు. బ్యూరోక్రాట్‌గా మన్మోహన్ ప్రస్థానం అలా ప్రారంభమైంది. 1969 నుంచి 1971 దాకా ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో ప్రొఫెసర్‌గా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన పాఠాలు బోధించారాయన.
ప్రభుత్వంలోకి..
1972లో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా.. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1980-1982 నడుమ ప్రణాళిక సంఘంలో పనిచేసిన మన్మోహన్‌ను.. 1982లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమించారు. 1985 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1985-87 నడుమ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1990 దాకా జెనీవాలోని ఎకనమిక్ పాలసీ థింక్ ట్యాంక్ ‘సౌత్ కమిషన్’కు సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. 1990 నవంబరులో భారత్‌కు తిరిగొచ్చి.. అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. 1991 జూన్‌లో.. మైనారిటీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశాన్ని సంస్కరణల పథంలో నడపాలంటే మన్మోహన్ వంటి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు! తొలుత ఆ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మన్మోహన్‌కు పీవీ తెలియపరచగా.. ఆయన దాన్ని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. దాంతో పీవీ.. వెంటనే చక్కగా తయారై రాష్ట్రపతి భవన్‌కు రావాలంటూ మన్మోహన్‌ను ఆదేశించారు. అలా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మన్మోహన్‌తో మంత్రిగా ప్రమాణం చేయించి.. ఆర్థిక శాఖను అప్పజెప్పారు! ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టేనాటికి మన దేశ ద్రవ్యలోటు జీడీపీలో 8.5 శాతానికి.. కరెంటు ఖాతా లోటు 3.5శాతానికి దగ్గర్లో ఉన్నాయి. మన విదేశీ మారక నిల్వలు కేవలం 2వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే (దాదాపు 100 కోట్ల డాలర్లు) ఉన్నాయి!! అలాంటి ఆర్థిక వ్యవస్థను ఆయన.. ప్రధాని పీవీ సహకారంతో సంస్కరణల పథంలో నడిపించి గాడిన పెట్టారు. పర్మిట్‌రాజ్‌కు చుక్క పెట్టి.. ఆర్థికవ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) బాట పట్టించి దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేశారు. 2009లో ప్రధానిగా ఆయన తొలి పదవీకాలం పూర్తిచేసే సమయానికి మన విదేశీ మారక నిల్వలు ఏకంగా 600 బిలియన్ డాలర్లకు చేరాయంటే.. నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు పునాదిరాళ్లనడంలో సందేహం లేదు.
ప్రధానిగా..
అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. 2014 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక మంత్రి హోదాలో కొనసాగించిన పాత ఒరవడినే అందిపుచ్చుకుని సంస్కరణల పథంలో ముందుకు సాగారు. దీంతో అనతికాలంలోనే మన ఆర్థిక వృద్ధిరేటు పెరగడం ప్రారంభించి.. 2007లో అత్యధికంగా 9ు మైలురాయిని దాటింది. ఆయన హయాంలో వచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం దేశచరిత్రలోనే కొత్త అధ్యాయలను లిఖించాయి! వాజపేయి హయాంలో ప్రారంభించిన స్వర్ణచతుర్భుజి వంటి కార్యక్రమాలను మన్మోహన్ సర్కారు కొనసాగించడంతో అభివృద్ధి ఎక్కడా కుంటుపడలేదు. 2009లో ఆయన హయాంలోనే విద్యాహక్కుచట్టం అమల్లోకి వచ్చింది. ఏపీ (ఉమ్మడి), బిహార్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 ఐఐటీ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. అలా పదేళ్లపాటు ప్రధానిగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మన్మోహన్ సింగ్ పదవీకాలం 2014 మే 17న ముగిసింది. 1991 అక్టోబరు 1 నుంచి 2024 దాకా 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది. దేశ తొలి సిక్కు ప్రధానిగా.. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా.. నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువకాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా.. ఎన్నో ఘనతలు సాధించిన ఆయన దేశ ప్రజల మనోయవనికలపై తనదైన చెరగని ముద్ర వేశారు!
కేంబ్రిడ్జ్‌లో తమాషా
కేంబ్రిడ్జిలో చదువుకునే రోజుల్లో కూడా మన్మోహన్ చాలా సిగ్గరిగా ఉండేవారు. అక్కడ ఉన్నతంకాలం ఆ చలిలో కూడా చన్నీళ్ల స్నానమే చేసేవాడినని ఆయన ఒకసారి బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. ‘‘సర్దార్జీని కావడంతో నాకు పొడవాటి జుట్టు ఉండేది. వేడినీళ్లు వస్తున్నప్పుడు అందరూ స్నానాలు చేసేవారు. నేను వారితో కలిసి స్నానం చేయడానికి మొహమాటపడేవాడిని. తలపాగాతీస్తే నా పొడవాటి జుట్ట చూసి హేళన చేస్తారని వాళ్లంతా వెళ్లాక చన్నీళ్లతోనే స్నానం ముగించేవాడిని’’ అని మన్మోహన్ చెప్పుకొన్నారు.
నిజాయతీకి నిలువెత్తురూపం
నిజాయతీకి, నిబద్ధతకు మన్మోహన్ నిలువెత్తు ప్రతిరూపం అంటారు ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్. ‘‘1999లో ఆయన ఒకేసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ అంటే మాటలు కాదు. అంతకాలంగా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా ఆయన వద్ద డబ్బు ఉండేది కాదు. ఎన్నికల ఖర్చు కోసం రెండు లక్షలు కావాలని అడిగారు. ఆయన అల్లుడికి ఇచ్చి డబ్బు పంపాను. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ మరుసటి రోజే నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు. డబ్బు నా చేతిలో పెట్టి.. ‘‘ఖర్చు కాలేదు. అలానే ఉంది. తీసుకోండి.. థ్యాంక్స్’’ అని వెళ్లిపోయారు.. అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు’’ అన్నారు కుష్వంత్ సింగ్.
మారుతి 800 రెండు ఫ్లాట్లు
దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా, ఆర్థిక మంత్రిగా, పదేళ్లు ప్రధానిగా ఉన్నా ఆయన సాదాసీదా జీవితం గడిపేందుకే ఇష్టపడేవారు. పాత మారుతి 800 కారు, ఢిల్లీ, చండీఘర్‌లలో రెండు అపార్ట్‌మెంట్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు.. ఇవే ఆయన సంపాదించుకున్న ఆస్తిపాస్తులు!
మన్మోహన్‌కు మొహం చాటేసిన అధికారులు
బెల్లం చుట్టూ ఈగలు.. అధికారంలో ఉన్న నేతల చుట్టూ అనుచరగణాలు మూగడం నిత్యసత్యం. అదే అధికారం పోయాక.. అప్పటిదాకా చుట్టూ తిరిగినవారే క్షణాల్లో ముఖం చాటేస్తారు. అంతకుముందు వరకూ సెల్యూట్ చేసినవారే.. ఎదురుపడినా చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కూ అలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో.. దానికి సంబంధించిన వివరాల కోసం ఆయన తన హయాంలో పీఎంవోలో పనిచేసిన ఓ కీలక అధికారికి ఫోన్ చేశారు. కానీ, సదరు అధికారి మన్మోహన్ సింగ్ ఫోన్‌కాల్‌కు స్పందించలేదు. పోనీ.. అప్పుడు ఆయన ఏదో బిజీగా ఉండి ఉంటాడని సరిపెట్టుకున్నా.. కనీసం తిరిగి కాల్ కూడా చేయలేదు. దీంతో మన్మోహన్ చాలా బాధపడ్డారు. తనను తాను రక్షించుకోవడానికే ఆ అధికారి మొహం చాటేశారని ఆయన భావించారు. ఇటువంటి సంఘటనలతో ఆయన మనోధైర్యం సడలిందని ఆయన సన్నిహితులు చెబుతారు.
మన్మోహన్ మరణంపై ప్రముఖుల సంతాప సందేశాలు
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దేశ ఆర్ధికవ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి
- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పి. కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు.
- జగదీప్ ధన్‌ఖడ్, ఉపరాష్ట్రపతి
మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్ధికవేత్తగా ఎదిగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విశేష కృషి చేశారు
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గురువును, మార్గదర్శకుడిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో ఆయన దేశాన్ని నడిపించారు
- రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత
దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి.
- మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ చీఫ్
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత అందరికీ ఆదర్శం
- వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
మన్మోహన్ సింగ్ నిజాయితీ మాకు నిరంతర స్ఫూర్తి. ప్రత్యర్థుల నుంచి వ్యక్తిగత దాడులు జరుగుతున్నా ఆయన దేశ సేవలో అంకితభావంతో నిమగ్నమయ్యారు.
- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ
1991 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశ చరిత్రలో స్వర్ణ యుగమే. ఆయన వినయవిధేయతలున్న వ్యక్తిని నేను ఇప్పటివరకు కలవలేదు. లభించిన విజయాలు తన వల్లే అని ఆయన ఏనాడూ చెప్పుకోలేదు
- చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరని లోటు, జ్ఞానం, వినయం, సమగ్రత మూర్తీభవించిన ఆయన గొప్ప మేధావి, రాజనీజ్ఞుడు.
- చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి