Delhi: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు..
ABN, Publish Date - Jun 18 , 2024 | 05:02 AM
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు వారాలు కూడా గడవకముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది.
ఎన్నికల ఇన్‌చార్జిగా అధిష్ఠానం ప్రకటన
మహారాష్ట్రకు.. కేంద్ర మంత్రులు
భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్
హరియాణాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్
ఝార్ఖండ్‌కు శివరాజ్, హిమంత
అసెంబ్లీ ఎన్నికలకు కమలం కసరత్తు
న్యూఢిల్లీ, జూన్ 17: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు వారాలు కూడా గడవకముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిల పేర్లను సోమవారం ప్రకటించింది. అత్యంత కీలకమైన మహారాష్ట్రకు ఇద్దరు కేంద్ర మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇన్‌చార్జిగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహ ఇన్‌చార్జిగా ఉంటారని పార్టీ ప్రకటించింది. 2014 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూకశ్మీరుకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది.
జమ్మూకశ్మీర్‌లో ఈ సెప్టెంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక మరో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు హరియాణా బాధ్యతలు అప్పగించింది. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌కుమార్ ఆయనకు సహాయంగా ఉంటారని ప్రకటిచింది. ఝార్ఖండ్ ఇన్‌చార్జిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను నియమించింది. ఆయనకు అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ మద్దతుగా ఉంటారని తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణాల్లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందడమేగాక.. అత్యధిక లోక్‌సభ సీట్లున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ తొలిసారి పూర్తిగా కొత్త కూటమితో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కలిసి.. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన పార్టీల కూటమిపై పోటీ చేస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ బాగా దెబ్బతిన్నది. మొత్తం 48 సీట్లకు గాను 2019లో 23 గెలిచిన ఆ పార్టీ బలం ఈసారి 9 సీట్లకు పడిపోయింది. అదేసమయంలో కాంగ్రెస్ ఒక్క సీటు నుంచి 13 సీట్లకు చేరుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు బీజేపీ ఇన్‌చార్జిలుగా భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. వీరి నేతృత్వంలో గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 230 సీట్లకు గాను 163 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసింది.
హరియాణాలో మూడోసారి గెలుపే లక్ష్యం
హరియాణాలోనూ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లకు గాను ఐదింట్లోనే గెలిచింది. అయితే, రాష్ట్రంలో వరసగా మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్‌కుమార్‌లను ఇన్‌చార్జిలుగా నియమించింది.
Updated Date - Jun 18 , 2024 | 05:10 AM