RIP Ratan Tata: జంతు ప్రేమికుడు రతన్ టాటా.. శునకం కోసం అవార్డునే కాదన్నారు
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:54 PM
రతన్ టాటా జంతు ప్రేమికుడనే విషయం మీకు తెలుసా. ఆయనకు చిన్ననాటి నుంచే శునకాలంటే ఎంతో ఇష్టం. రతన్ టాటా మరణించడంతో.. ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే శునకం దీనంగా ఎదురుచూసింది.
ముంబయి: రతన్ టాటా జంతు ప్రేమికుడనే విషయం మీకు తెలుసా. ఆయనకు చిన్ననాటి నుంచే శునకాలంటే ఎంతో ఇష్టం. రతన్ టాటా మరణించడంతో.. ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే శునకం దీనంగా ఎదురుచూసింది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లారు. రతన్ టాటా భౌతికకాయాన్ని చూస్తూ ఆ శునకం దీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శునకాలంటే అమితమైన ప్రాణం..
టాటాకు మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో చెప్పే ఘటన ఇది. పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉందని కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమాన్ని రతన్ టాటా వాయిదా వేసుకున్నారు. సుహెల్ సేథ్ అనే వ్యాపారవేత్త ఈ ఘటన గురించి వెల్లడించారు. వ్యాపారాన్ని చూసుకుంటూనే జంతువులపై ప్రేమను చాటుకున్నందుకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించారు. రతన్ టాటా నుంచి తనకు 11 ఫోన్ కాల్స్ వచ్చాయని చివరకు తనను సంప్రదించగా తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోలేనని అన్నారని సుహెల్ సేథ్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్‌ను అభినందించారు. రతన్ టాటా గోవా అనే శునకాన్ని దత్తత తీసుకున్నారు. ఇది గోవాలో దొరకడంతో దానికి ఆ పేరు పెట్టారు. సమావేశాలకు వెళ్తే గోవా కూడా రతన్‌తో కలిసి వెళ్లేది.
జంతువులకు ప్రత్యేక ఆసుపత్రి..
2024 జులైలో రతన్ టాటా ముంబయిలో చిన్న జంతు ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందేలా నిపుణులైన వైద్యులు కూడా సేవలందిస్తున్నారు. ముంబయిలోని తాజ్‌మహల్ హోటల్‌లో జంతువులను దయగా చూసేలా చూడాలని రతన్ టాటా ఆదేశించారు. హోటల్ ఆవరణలోకి వచ్చే జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.