Share News

Maharashtra: ఛావా ఎఫెక్ట్.. ఔరంగజేబు సమాధిపై రచ్చ.. పోలీసు బలగాల మోహరింపు

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:39 PM

Maharashtra : ఛావా సినిమా ఎఫెక్ట్ ఔరంగజేబు సమాధిపై పడింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఔరంగజేబు సమాధికి మరాఠా గడ్డపై స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఓ ముఠా సమాధిని ధ్వంసం చేయనుందనే సమాచారం పోలీసులకు అందడంతో.

Maharashtra: ఛావా ఎఫెక్ట్.. ఔరంగజేబు సమాధిపై రచ్చ.. పోలీసు బలగాల మోహరింపు
Aurangzeb Tomb

Maharashtra Aurangazeb Tomb : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలనే డిమాండ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరాఠా భూమిపై దీనికి స్థానం లేదని ఇప్పటికే పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేసేందుకు కొందరు మూకుమ్మడిగా దాడి చేస్తారనే సమాచారం పోలీసులకు అందింది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు దారి తీస్తాయనే ఉద్దేశంతో సమాధి వద్ద భారీ బలగాలను మోహరించింది ప్రభుత్వం.


ముదిరిన సమాధి వివాదం..

మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి చుట్టూ రాజకీయ, మతపరమైన వివాదాలు ముదిరాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు సమాధిని కూల్చివేయడమే మంచిదని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజ్మీ ఇటీవల ఔరంగజేబు పాలనను ప్రశంసించడంతో పరిస్థితి ఇంకా దిగజారింది. దీంతో, సమాధి భద్రతకు ముప్పు పెరిగింది. ఓ గుంపు సమాధిపై దాడి చేయవచ్చనే సమాచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనేక మితవాద సంస్థలు సమాధిని కూల్చివేస్తామని బెదిరించడం వల్ల అక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించారు.


కూల్చివేతకు నేను అనుకూలం: సీఎం ఫడ్నవీస్

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఔరంగజేబు సమాధిని కూల్చివేయడానికి తాము అనుకూలమని వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ దీనికి అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఈ సమాధిని భారత పురావస్తు సంరక్షణ సంస్థ (ASI) ఆధీనంలోకి అప్పగించడంతో ఇది రక్షిత ప్రదేశంగా మారింది. ఫలితంగా, దీనిని తొలగించడం అంత సులభం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


ప్రవేశం నిషేధం..

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఔరంగజేబు సమాధికి ప్రత్యక్ష ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సమాధిలోకి నేరుగా ప్రవేశించేందుకు సందర్శకులకు అనుమతి లేదు. ప్రస్తుతం రోడ్లపై ఎటువంటి ఆంక్షలు విధించకపోయినా రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ను సమాధి వద్ద మోహరించారు. భద్రతా దళాలను ఎవరినీ నేరుగా సమాధిలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు.


ప్రజల దృష్టి మరల్చేందుకే : ప్రతిపక్షాలు

ప్రతిపక్షాలు మాత్రం మహాయుతి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు ఔరంగజేబు వివాదాన్ని ముందుకు తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత అంబదాస్ దన్వే ఈ సమాధి నిర్వహణ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని చెప్పారు. పౌర ఎన్నికల నేపథ్యంలోనే ఈ వివాదాన్ని లేవనెత్తారని కూడా ప్రతిపక్షం ఆరోపిస్తోంది. జల్నా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కళ్యాణ్ కాలే మాట్లాడుతూ, "ఈ సమాధి చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోసం ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు," అని అన్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కూడా సమాధిని కూల్చివేయాలనే డిమాండ్‌ను తీవ్రంగా ఖండించారు. "ఒక సమాధి లేకపోయిన మాత్రాన చరిత్ర మారదు. అందువల్ల ప్రభుత్వం దీనిని రక్షించాలి," అని ఆయన అన్నారు.


Read also : Hyperloop Tube: గంటకి వెయ్యి కి.మీ ప్రయాణం..హైపర్‌లూప్ ట్యూబ్ వీడియో చూశారా..

Ranya Rao: ప్రైవేటు భాగాల్లో బంగారు దాచిపెట్టి.. రన్యారావుపై షాకింగ్ కామెంట్స్
Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ

Updated Date - Mar 17 , 2025 | 05:44 PM