Share News

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:22 PM

మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..
Maharashtra Leaders

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి, మహా వికాస్ అఘాడి మధ్య జరిగిన పోరులో బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహాయుతి సృష్టించిన సునామీకి కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(యూబీటీ)లు కలిసిన మహా వికాస్ అఘాడి పత్తా లేకుండా పోయింది. మహారాష్ట్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి అభ్యర్థులు గెలిచిన స్థానాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ సాధించారు. మహా వికాస్ అఘాడి గెలిచిన స్థానాల్లో శివసేన(యూబీటీ) అభ్యర్థుల్లో ఒకరే 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మిగతా అభ్యర్థులు 50 వేల లోపు మెజార్టీ సాధించారు. మహాయుతి కూటమిలో మాత్రం దాదాపు 15 మంది లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. బీజేపీ అభ్యర్థులు ఎనిమిది చోట్ల, షిండే నేతృత్వంలోని శివసేన మూడు చోట్ల, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల లక్షకు పైగా మెజార్టీ సాధించింది. మొత్తం మహాయుతి కూటమి 235 స్థానాల్లో మహా వికాస్ అఘాడి 49, ఎంఐఎం ఒకటి, పీడబ్ల్యూపీఐ ఒక స్థానంలో గెలుపొందగా ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో ఎక్కువమంది బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన అభ్యర్థులే ఉన్నారు.


అత్యధికం.. అత్యల్ప స్థానాలు ఇవే..

మహారాష్ట్రలోని సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాశీరామ్ వెచన్ పవార్ తన సమీప ప్రత్యర్థి స్వతంత అభ్యర్థి డాక్టర్ జితేంద్ర యువరాజ్ ఠాకూర్‌పై లక్షా 45వేల 944 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్ర మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా కాశీరామ్ వెచన్ పవార్ రికార్డు సృష్టించారు. ఇక ఎంఐఎం అభర్థి ముఫ్తీ మహ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ మాలేగావ్ సెంట్రల్ నుంచి కేవలం 162 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి 38,519 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి ముఫ్ మహ్మాద్ ఇస్మాయిల్ ఈ ఎన్నికల్లో కేవలం 162 ఓట్ల తేడాతో గెలిచారు. మహారాష్ట్రలో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా ఇస్మాయిల్ నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చెందిన నానాబహు ఫల్లుణరావ్ పటేల్ సకోలి నియోజకవర్గం నుంచి 208 ఓట్ల తేడాతో గెలిచారు.


మహా ఓటరు తీర్పులో ట్విస్ట్‌లు..

మహారాష్ట్ర ఓటర్లు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఎక్కువ స్థానాలు సాధించడంతో మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, పార్టీని చీల్చారనే ఉద్దేశంతో షిండే, అజిత్ పవార్‌పై ప్రజలు కోపంగా ఉన్నారంటూ మహా వికాస్ అఘాడి చేసిన ప్రచారం అసత్యమని ఫలితాల ద్వారా తెలుస్తోంది. మహాయుతి కూటమి అధికారంలో ఉండాలని ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వగా.. ఈ ఎన్నికల్లో మాత్రం హిందూ ఓట్లు పోలరైజ్ అయ్యాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సీట్లలో 80 శాతానికి పైగా సీట్లను మహాయుతి కూటమి గెలుచుకోవడంతో ఓట్ల పోలరైజేషన్ జరిగిందనే చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 24 , 2024 | 03:22 PM