Manmohan Singh: నిష్కళంక నాయకా సెలవిక
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:56 AM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పించింది.

ఆర్థిక సంస్కర్త మన్మోహన్‌సింగ్‌కు అంతిమ వీడ్కోలు
యమున ఒడ్డున లాంఛనాలతో అంత్యక్రియలు
చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్
రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, రాహుల్ నివాళి
శ్మశానవాటికలో అంత్యక్రియలపై కాంగ్రెస్ అభ్యంతరం
స్మారకానికి స్థలమిస్తాం.. రాజకీయం తగదు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పించింది. దేశ ఆర్థిక సంస్కర్తకు శనివారం ఉదయం ఢిల్లీలో యమునానది ఒడ్డున ఉన్న నిగమ్ బోధ్ ఘాట్‌లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మన్మోహన్‌సింగ్ చితికి ఆయన పెద్ద కుమార్తె ఉపిందర్‌సింగ్ నిప్పంటించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, త్రివిధ దళాల అధిపతులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలు రాష్ట్రాల సీఎంలు మన్మోహన్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఆర్మీ ఫిరంగి వాహనంలో ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ భౌతికకాయాన్ని నిగమ్ బోధ్ ఘాట్‌కు అంతిమయాత్రగా తీసుకొచ్చారు. అనంతరం 21 తుపాకులతో త్రివిధ దళాల సైనిక వందనం ఇచ్చాయి. మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ , రెండో కుమార్తె దమన్ సింగ్, మూడో కుమార్తె అమృత్ సింగ్ నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చివరి ప్రయాణంలోనూ డాక్టర్ మన్మోహన్‌సింగ్ తనకు ఇష్టమైన నీలి రంగు తలపాగా ధరించేలా ఏర్పాట్లు చేశారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ సహా పలువురు విదేశీ నేతలు సైతం అంత్యక్రియలకు హాజరయ్యారు. సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చితిని పేర్చి పార్థివదేహాన్ని దహనం చేశారు.
ఏఐసీసీలో పార్థివదేహం
మన్మోహన్ గురువారం రాత్రి మృతి చెందగా శుక్రవారం ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచారు. శనివారం ఉదయం గురుద్వార్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 9 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ మన్మోహన్‌సింగ్ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలు, అభిమానుల నివాళుల తర్వాత 10 గంటలకు అంతిమయాత్రను ప్రారంభించారు. రాహుల్‌గాంధీ మన్మోహన్ పాడెను మోశారు. పార్థివదేహంతో పాటు అదే వాహనంలో నిగమ్ ఘాట్‌కు వెళ్లారు. అదే వాహనంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉన్నారు. రాహుల్‌గాంధీ స్వయంగా రేవంత్‌రెడ్డిని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్థం
అంతిమ సంస్కారం, స్మారక స్థూపంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్థం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన మన్మోహన్‌ను బీజేపీ సర్కారు అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయన బతికున్నంత కాలం ఎప్పుడైనా గౌరవించారా? అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. స్మారక నిర్మాణం చేపట్టేందుకు వీలున్న స్థలంలోనే మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్‌లో ఈ విషయం మాట్లాడారు. ఆ తర్వాత లేఖ రాశారు. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం దేశంలో సంప్రదాయంగా వస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఖర్గే లేఖపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. మన్మోహన్ స్మారకం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని తెలిపింది. స్మారకం నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. కేంద్రం స్పందించిన తీరుపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు, మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ జాతీయ నేత సుధాన్షు త్రివేది మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కనీసం సంతాప సభ నిర్వహించలేదని ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ మండిపడ్డారు. మన్మోహన్‌కు స్మారకం నిర్మించాలని ఖర్గే మోదీకి ప్రతిపాదన చేసిన నేపథ్యంలో శర్మిష్ట ఈ మేరకు ‘ఎక్స్’లో స్పందించారు. ‘2020 ఆగస్టులో నాన్న చనిపోయినప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కనీసం సంతాపం తెలిపేందుకు సీబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు’ అని శర్మిష్ట పేర్కొన్నారు.
కేంద్రం అవమానించింది: రాహుల్‌గాంధీ
మన్మోహన్‌ను కేంద్రం అవమానించిందని రాహుల్ ఆరోపించారు. ‘‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థిక రంగంలో దేశం అద్భుతంగా ఎదగడంలో మన్మోహన్ సేవలు వెలకట్టలేనివి. అటువంటి గొప్ప మనిషిని ఎన్డీఏ ప్రభుత్వం అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించారు. అది ముమ్మాటికీ మన్మోహన్‌ను అవమానించడమే’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.