Tornado Effect: టోర్నడోల విధ్వంసం .. ఇప్పటివరకు 29 మంది మృతి
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:36 AM
అమెరికాను విధ్వంసకర తుఫానులు మళ్లీ ముంచెత్తాయి. రాత్రి వచ్చిన టోర్నడోల కారణంగా అనేక ఇళ్లు నేలకూలాయి. దీంతో ఇప్పటివరకు 29 మంది మృతి చెందినట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ టోర్నడోల విధ్వంసానికి గురైంది. ఈ క్రమంలో అమెరికా మిడ్‌వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో వస్తున్న తుఫానులు అనేక రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ఈ టోర్నడోలు, దుమ్ము తుఫానులు, కార్చిచ్చులు మిస్సోరి, అర్కాన్సాస్, టెక్సాస్, ఒక్లహోమా, కాన్సాస్, మిస్సిసిప్పి రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అనేక మంది విద్యుత్ లేకుండా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
విధ్వంసం ఎక్కడ ఎక్కువగా
తుఫానుల ధాటికి మిస్సోరిలో 12 మంది మృతి చెందారు. రాత్రిపూట వచ్చిన టోర్నడోలు అనేక ఇళ్లను నేలమట్టం చేశాయి. వేన్ కౌంటీలో రక్షక సిబ్బంది ఓ ఇంటి బయట ఐదు మృతదేహాలను గుర్తించారు. బట్లర్ కౌంటీలో పరిస్థితి గురించి కరోనర్ జిమ్ అకర్స్ చెబుతూ .. ఇక్కడ ఇళ్లు కనిపించడం లేదని, శిథిలాల క్షేత్రంలా మారిందన్నారు. కాన్సాస్‌లో, షెర్మాన్ కౌంటీలో వచ్చిన దుమ్ము తుఫాను భారీ రహదారిపై ఘోర ప్రమాదాన్ని తెచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో ఎనిమిది మంది మరణించగా, 50 కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు.
మరోవైపు మంటలు..
అర్కాన్సాస్‌లో కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఇండిపెండెన్స్ ప్రాంతంలో ముగ్గురు మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. అక్కడి రాష్ట్ర గవర్నర్ సారా హకబీ సాండర్స్ అత్యవసర సహాయక చర్యలను ప్రారంభించారు. టెక్సాస్‌లో తుఫాను మూలంగా జరిగిన కారు ప్రమాదాలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒక్లహోమా అడవిలో మంటలు భీకరరూపం దాల్చాయని, 130 చోట్ల మంటలు నమోదైనట్లు వెల్లడించారు.
మరిన్ని ప్రమాదాలకు అవకాశం
ప్రస్తుతం ఈ తీవ్ర వాతావరణ వ్యవస్థ యుఎస్‌లోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. గంటకు 80 kmph వేగంతో గాలులు వీస్తున్నాయి. మిన్నెసోటా, దక్షిణ డకోటాల్లో మంచు తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు టెక్సాస్, ఒక్లహోమా రాష్ట్రాల్లో అడవి మంటలు తీవ్రంగా ఉన్నాయి. వందలాది చదరపు మైళ్ల విస్తీర్ణంలో కార్చిచ్చులు విజృంభిస్తున్నాయి. తుఫానులు తూర్పు దిశగా కదులుతుండటంతో మరింత విధ్వంసం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లూసియానా నుంచి ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ వరకు ఈ తుఫాను ప్రభావం ఉండొచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News