Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామా? ఎందుకంటే..!
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:14 PM
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ రాహుల్ ఎంపీగా పోటీ చేశారు. ఈ రెండు చోట్లా రాహుల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, నిబంధన ప్రకారం.. ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు వారాల్లో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇటీవల వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు రాహుల్.. వయనాడ్, రాయబరేలీ నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరి రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రియాంక పోటీ..?
రాహుల్ గాంధీ వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తే ఆ చోటు నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ కూడా అప్పుడే ప్రారంభమైంది. వయనాడ్ నియోజకవర్గానికి రాహుల్ రిజైన్ చేస్తే.. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే కేరళకు చెందిన సీనియర్ నేతను అక్కడి నుంచి పోటీకి దించే అవకాశం కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే యూపీలో కాంగ్రెస్ పుంజుకోవడం అనివార్యం. అందుకే.. రాహుల్ గాందీ రాయబరేలీ స్థానంలోనే కొనసాగాలని యూపీ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో రాహుల్ సైతం రాయబరేలీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.