Mizoram: కుప్పకూలిన మయన్మార్ ఆర్మీ విమానం.. ఆరుగురికి గాయాలు
ABN , Publish Date - Jan 23 , 2024 | 03:07 PM
మిజోరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ సైనిక విమానం మంగళవారంనాడు కుప్పకూలింది. దీంతో విమానంలోని ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.
లెంగ్‌పుయ్: మిజోరం (Mizoram)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ సైనిక విమానం (Myanmar Army Plance) మంగళవారంనాడు కుప్పకూలింది. దీంతో విమానంలోని ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. విమానంలో పైలట్ సహా 14 మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను లెంగ్‌పుయ్ ఆసుపత్రికి తరలించినట్టు మిజోరం డీజీపీ తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భారత భూభాగంలోకి గతవారంలో ప్రవేశించిన మయన్మార్ సైనికులను తిరిగి తీసుకువెళ్లేందుకు మయన్మార్ ఆర్మీ విమానం వచ్చినప్పుడు ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మయన్మార్‌లో చొరబాటు గ్రూపుకు, సైన్యానికి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకోవడంతో 276 మంది మయన్మార్ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారు. వీరిలో 184 మందిని సోమవారంనాడు వెనక్కి పంపారు. మిగతా 94 మందిని స్వదేశానికి మంగళవారంనాడు పంపాల్సి ఉందని అధికారులు తెలిపారు. భారత భూభాగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మయన్మార్ సిబ్బంది అసోం రైఫిల్స్ పర్యవేక్షణలో ఉన్నారు. వీరిని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి మయన్మార్ పంపేందుకు గత శని, ఆదివారాల్లో ఐజ్వాల్ తీసుకువచ్చారు. ఒక కల్నల్ సారథ్యంలో 36 మంది ఆఫీసర్లు, 240 మంది లోయర్ ర్యాంక్ సిబ్బంది ఈ గ్రూపులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.