ప్రచారం కోసమే నాపై పరువు నష్టం కేసు: రాహుల్
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:57 AM
పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
సుల్తాన్పూర్ (యూపీ), జూలై 26: పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి, అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2018లో రాహుల్‌పై స్థానిక బీజేపీ నాయకుడు విజయ్ మిశ్ర ఈ దావా వేశారు.
ప్రత్యేక జడ్జి శుభం వర్మ ముందు హాజరైన రాహుల్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఎవరినీ కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. చౌకబారు ప్రచారం కోసమే ఈ దావా వేశారని ఆరోపించారు. వాదనలు విన్న జడ్జి తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేశారు.
కోర్టు నుంచి తిరిగి లఖ్‌నవూ వెళ్తూ దారిలో ఓ చెప్పులు కుట్టే షాపు దగ్గర రాహుల్ ఆగారు. షాపు యజమాని రాం చేట్ రాహుల్‌కు కూల్‌డ్రింక్ ఇచ్చారు. రాహుల్ అక్కడ అరగంట సేపు ఉన్నారు. కాగా, విపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని సునేహ్రీబాగ్ మార్గంలో 5వ నంబరు బంగ్లాను లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది ఎంపీగా అనర్హత వేటు పడిన సమయంలో రాహుల్ తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.