Share News

BJP: మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజీనామా

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:53 AM

రాజస్థాన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కి సరిగ్గా 10 రోజులు కూడా గడవకముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమిపాలయ్యారు.

BJP: మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజీనామా

జైపూర్: రాజస్థాన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కి సరిగ్గా 10 రోజులు కూడా గడవకముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో సురేంద్రపాల్ సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేయడం, రాజీనామ పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పంపించడం, ఆయన దానిని గవర్నర్‌కు పంపించడం, గవర్నర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. సురేంద్రపాల్ సింగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారని రాజ్‌భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ 11,283 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రూపిందర్ సింగ్‌కు 94,950 ఓట్లు రాగా.. సురేంద్రపాల్ సింగ్‌కు 83,667 ఓట్లు వచ్చాయి.


కాగా గత నెల డిసెంబర్ 30వ తేదీనే సురేంద్రపాల్ సింగ్‌ను బీజేపీ అధిష్టానం తమ మంత్రివర్గంలోకి తీసుకుంది. ఆయనకు వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు, ఇందిరా గాంధీ కెనాల్ శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. అయితే అప్పటికీ సురేంద్రపాల్ సింగ్‌ ఎమ్మెల్యేగా లేరు. దీంతో మంత్రిగా నియమితులైన 6 నెలల్లోపు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జనవరి 5న జరిగిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజానామా చేయాల్సి వచ్చింది. కాగా 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ చనిపోవడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదాపడింది. దీంతో జనవరి 5న అక్కడ పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుర్మీత్ సింగ్ కుమారుడు రూపిందర్ సింగ్‌నే విజయం వరించింది. కాగా డిసెంబర్ 3న వెలువడిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 115 స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

Updated Date - Jan 09 , 2024 | 10:53 AM