Ratan Tata: రతన్ టాటాకు ఘన నివాళి.. ప్రారంభమైన అంతిమయాత్ర
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:10 PM
దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata)కు యావత్ భారతావని నివాళి అర్పించింది. అనంతరం ఆయన అంతిమయాత్ర గురువారం సాయంత్రం ప్రారంభమైంది.
ముంబయి: దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata)కు యావత్ భారతావని నివాళి అర్పించింది. అనంతరం ఆయన అంతిమయాత్ర గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగుతోంది. మహనీయుడిని కడసారి చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. దేశవిదేశాల నుంచి ప్రముఖులు ఆయన కడసారి చూపుకోసం తరలివచ్చారు. అనంతరం అంతిమయాత్రవైపుగా తరలివెళ్తున్నారు. అంతిమ యాత్ర వీడియోను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
రతన్ సోదరుడి గురించి..
అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న రతన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. న్యూయార్క్‌లోని ఇథాకాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదువుకున్న రతన్ టాటా 1962లో భారత్‌కు తిరిగి వచ్చి కుటుంబాన్ని పోషించడానికి ఓ దుకాణంలో పనిచేశారు.డిసెంబర్ 28, 1937న నావల్ టాటా, సూని టాటా దంపతులకు పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. రతన్‌కు జిమ్మీ నావల్ టాటా, నోయెల్ టాటా అనే సోదరులున్నారు. రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ ముంబయి డౌన్‌టౌన్‌లో నివసించే అమ్మమ్మ నవాజ్‌బాయి దగ్గర పెరిగారు.