Ratan tata: అధికారిక లాంఛనాలతో.. ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:00 PM
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.
ముంబయి: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
కడచూపుకు తరలివచ్చి..
అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న రతన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. న్యూయార్క్‌లోని ఇథాకాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదువుకున్న రతన్ టాటా 1962లో భారత్‌కు తిరిగి వచ్చి కుటుంబాన్ని పోషించడానికి ఓ దుకాణంలో పనిచేశారు. డిసెంబర్ 28, 1937న నావల్ టాటా, సూని టాటా దంపతులకు పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. రతన్‌కు జిమ్మీ నావల్ టాటా, నోయెల్ టాటా అనే సోదరులున్నారు. రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ ముంబయి డౌన్టౌన్లో నివసించే అమ్మమ్మ నవాజ్‌బాయి దగ్గర పెరిగారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వేల సంఖ్యలో నేతలు, ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.