Share News

RBI : కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్‌

ABN , Publish Date - May 23 , 2024 | 05:50 AM

ఎన్నికల తర్వాత కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వానికి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ గిఫ్ట్‌ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి

RBI : కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్‌

రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌

ఆర్బీఐ చరిత్రలోనే అత్యధికం

బ్యాంకు కేంద్రబోర్డు భేటీలో నిర్ణయం

ఆర్థికరంగం బలోపేతం నేపథ్యంలో భారీ డివిడెండ్‌కు ఆమోదం

ద్రవ్యలోటు లక్ష్యసాధనలో కేంద్రానికి ఉపయోగపడనున్న నిధులు

ముంబై, మే 22: ఎన్నికల తర్వాత కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వానికి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ గిఫ్ట్‌ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది అత్యధికం. ఇప్పటి వరకూ 2018-19లో ప్రకటించిన రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ అత్యధికం కాగా.. తాజా డివిడెండ్‌ దీనిని అధిగమించింది. గత ఏడాది డివిడెండ్‌తో పోలిస్తే ఇది దాదాపు 140 శాతం ఎక్కువ. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేంద్రానికి రూ.87,416 కోట్ల మొత్తాన్ని అందించింది. బుధవారం ముంబైలో ఆర్బీఐ కేంద్రబోర్డు 608వ సమావేశం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస అధ్యక్షతన జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో నెలకొన్న పరిస్థితులను ఈ భేటీలో చర్చించారు. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కొవిడ్‌ విజృంభణ, ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో ఆర్బీఐ బ్యాలెన్స్‌షీట్‌లో కంటింజెన్సీ రిస్క్‌ బఫర్‌ (సీఆర్‌బీ)ను 5.5 శాతం వద్ద కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.


2023లో ఆర్థికవృద్ధి పునరుద్ధరణ మొదలవటంతో సీఆర్‌బీని 6 శాతానికి పెంచాం. 2024 ఆర్థిక సంవత్సరానికి దీనిని మరింత పెంచుతూ 6.5 శాతంగా బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వానికి రూ.2,10,874 కోట్ల మిగులును బదిలీ చేయాలనే నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపింది’ అని ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ (2024-25)లో ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్‌ రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, దీనికి రెట్టింపుకన్నా అధికంగా డివిడెండ్‌ను ఆర్బీఐ ప్రకటించటం విశేషం. ఆర్బీఐ డివిడెండ్‌తో కేంద్రం వద్ద అందుబాటులో ఉండే ఆర్థిక వనరులు బలోపేతం కావటమేగాక బడ్జెట్‌ లోటును పూడ్చుకోవటానికి కూడా ఇది దోహదం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.17.34 లక్షల కోట్లకు (జీడీపీలో 5.1 శాతానికి) తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

Updated Date - May 23 , 2024 | 05:50 AM