Smriti Irani: గాంధీల కంచుకోటలో స్మృతి ఇరానీ మకాం.. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారుగా!
ABN , Publish Date - Feb 22 , 2024 | 09:13 PM
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే అమేఠీ (Amethi) తన శాశ్వత చిరునామాగా మారుతుందని అప్పటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే.. తన నియోజకవర్గంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం (22/02/24) తన భర్త జుబిన్ ఇరానీతో (Zubin Irani) కలిసి గృహప్రవేశం కూడా చేశారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే అమేఠీ (Amethi) తన శాశ్వత చిరునామాగా మారుతుందని అప్పటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే.. తన నియోజకవర్గంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం (22/02/24) తన భర్త జుబిన్ ఇరానీతో (Zubin Irani) కలిసి గృహప్రవేశం కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికలi సమీపిస్తున్న తరుణంలో ఆమె అమేఠీలో గృహప్రవేశం చేయడం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా.. అమేఠీ నియోజకవర్గం గాంధీల కంచుకోట. 2004 నుంచి 15 ఏళ్లుగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే.. 2019లో మాత్రం ఆయన స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. అంతకుముందు 2014లోనూ అమేఠీ నుంచి రాహుల్, స్మృతి పోటీ పడ్డారు. కానీ.. ఆ సమయంలో స్మృతి ఓడిపోయారు. అయినా పట్టువదలకుండా 2019లో పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో.. తనని గెలిపిస్తే, అమేఠీనే తన శాశ్వత చిరుమానాగా మార్చుకుంటానని హామీ ఇచ్చారు. దాంతో ఓటర్లు ఆమెకు విజయం కట్టబెట్టారు. తనని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు కాబట్టి, ఇచ్చిన మాట ప్రకారం ఆమె అమేఠీకి తన మకాం మార్చారు.
తొలుత 2021లో స్మృతి ఇరానీ అమేఠీలో 15 వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2023లో ‘కిచ్డీభోజ్’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఉజ్జయిని నుంచి వచ్చిన పూజారి ఆశిశ్ మహారాజ్ ఆధ్వర్యంలో.. తన భర్తతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ పరిణామం.. రాబోయే ఎన్నికల్లో స్మృతికి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రాహుల్, స్మృతి మళ్లీ పోటీ పడతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇద్దరి మధ్య పోటీ నెలకొంటే మాత్రం.. ఈసారి మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.
స్మృతి ఇరానీ ఇప్పటికే రాహుల్ గాంధీకి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే అమేఠీ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. అటు.. నియోజకవర్గ ప్రజలు కూడా అమేఠీ నుంచే రాహుల్ పోటీ చేయాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ (Congress) తెలిపింది. అయితే.. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందని పార్టీ పేర్కొంది. మరి, స్మృతి సవాల్‌ని రాహుల్ స్వీకరిస్తారా? అమేఠీ నుంచే మరోసారి పోటీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.