Delhi: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఏమందంటే
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:45 PM
సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యావసానాలను తెలుసుకోవాలని పేర్కొంది.
ఢిల్లీ: సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యావసానాలను తెలుసుకోవాలని పేర్కొంది. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేసిన తర్వాత సుప్రీంను ఆశ్రయించడమేంటని ప్రశ్నించింది.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు తెలుసా? మీరు సామాన్యులు కాదు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించి.. కేసు తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది.
ఉదయనిధి ఏమన్నారంటే..
గతేడాది జరిగిన సనాతన నిర్మూలన కాన్ఫరెన్స్‌లో భాగంగా ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని.. కొన్నింటిని వ్యతిరేకించి ఊరుకోకూడదని.. వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై తమిళ నాడు బీజేపీ మండిపడింది. స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. బీజేపీ పంపే లీగల్ నోటీసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ వివాదం కాస్తా.. రాజకీయాలను హీటెక్కించి.. చివరికి సుప్రీం కోర్టు వరకు చేరింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి