Share News

అఫ్ఘాన్‌ శరణార్థుల కోసం..!

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:08 AM

‘‘సరిగ్గా ఏడున్నరేళ్ల కిందట... నేను, నా భర్త బిశ్వదీప్‌ మోయిత్రా ఢిల్లీలోని అఫ్ఘానిస్థాన్‌ శరణార్థుల శిబిరానికి వెళ్లాం. అక్కడ మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చేతిలో డబ్బు లేక, సంపాదన మార్గాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టడం...

అఫ్ఘాన్‌ శరణార్థుల కోసం..!

ఆసరా

స్వదేశం ఫ్రాన్స్‌. కళపై మక్కువతో

ఓ ప్రాజెక్ట్‌ పనిపై భారత్‌ వచ్చిన ఆమె...

ఆ తరువాత ఇక్కడే స్థిరపడ్డారు.

ఔత్సాహికులను కళాకారులుగా తీర్చిదిద్దడమే కాదు...

ఎంతోమంది అఫ్ఘానిస్థాన్‌ మహిళా శరణార్థులకు

ఉపాధి మార్గం చూపారు. భర్తతో కలిసి వారి

అభ్యున్నతికి బాటలు వేసిన ఐరిస్‌ స్ర్టిల్‌ జర్నీ ఇది.

‘‘సరిగ్గా ఏడున్నరేళ్ల కిందట... నేను, నా భర్త బిశ్వదీప్‌ మోయిత్రా ఢిల్లీలోని అఫ్ఘానిస్థాన్‌ శరణార్థుల శిబిరానికి వెళ్లాం. అక్కడ మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చేతిలో డబ్బు లేక, సంపాదన మార్గాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టడం, అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం తదనంతర పరిణామల నేపథ్యంలో అఫ్ఘాన్‌ మహిళలు భారత్‌కు వలస వచ్చారు. ఢిల్లీలో వారిని కలిసినప్పుడు తమ బాధలు చెప్పుకున్నారు. బతకడానికి వేరే దారి లేక స్వదేశం నుంచి వెంట తెచ్చుకున్న తమ వస్తువులన్నిటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఏ పూటకాపూట కష్టం నెట్టుకొస్తున్నారు. వారి బాధలు విని మా గుండె బరువెక్కింది. దీనికి పరిష్కారం ఏమిటి? ఏదో తోచిన సాయం చేసి చేతులు దులుపుకొంటే సరిపోదు. ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే వారికి మనుగడ. అందుకు మేం ఏం చేయగలం? నేను, బిశ్వదీప్‌ తీవ్రంగా ఆలోచించాం.


సాధికారత వైపు అడుగులు...

అఫ్ఘాన్‌ శరణార్థ మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలంటే... వారికి వృత్తి విద్యల్లో నైపుణ్యం కావాలి. అటు వైపు వారిని ప్రోత్సహించాం. తద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చని చెప్పాం. తొలుత ఒకరిద్దరు మహిళలు మాత్రమే మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చారు. ఒక ఏడాది తరువాత మరికొంతమంది జత కలిశారు. వీరందరి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని 2018లో నేను, మావారు కలిసి ‘సిలైవాలీ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాం. దీని ద్వారా క్లాత్‌ బొమ్మలు, పౌచ్‌లు, పర్సులు, వాల్‌ ఆర్ట్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌ తయారు చేసి, విక్రయిస్తాం. రెడీమేడ్‌ దుస్తుల తయారీ పరిశ్రమల్లో వ్యర్థంగా పడేసే వస్త్రాన్ని సేకరించి, వాటితో ఈ ఉత్పత్తులు రూపొందిస్తాం.


పర్యావరణ పరిరక్షణ కూడా...

ఒకరిద్దరితో మొదలైన మా సంస్థలో ఇప్పుడు డెబ్భై మంది అఫ్ఘాన్‌ మహిళలు ఉన్నారు. వారందరికీ బొమ్మలు, ఇతర వస్తువుల తయారీలో పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాం. అనంతరం సంస్థ ద్వారా జీవనోపాధి కల్పించాం. ఇప్పుడు ఆ మహిళలందరూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు. సంతోషంగా జీవనం సాగించగలుగుతున్నారు. నెలకు పన్నెండు వేల నుంచి పధ్నాలుగు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. డిమాండ్‌ అధికంగా ఉండే నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మాసాల్లో మరింత ఆదాయం లభిస్తుంది. అంతేకాదు... ఇప్పటివరకు 15 వేల కేజీలో ఫ్యాబ్రిక్‌ వేస్ట్‌ చెత్త కుప్పల్లో చేరి, భూమికి భారం కాకుండా చూడగలిగాం. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కొంతవరకు దోహదపడగలిగాం.

అలా భారత్‌కు వచ్చి...

నాకు మొదటి నుంచి కళలంటే మక్కువ. అందుకే ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ డిప్లమాలో చేరాను. ఫైనల్‌ ఇయర్‌ అసైన్‌మెంట్‌లో భాగంగా 1990లో తొలిసారి భారత్‌కు వచ్చాను. ఈ దేశం నాకు ఎంతో నచ్చింది. కళపై ఉన్న ఇష్టంతో ఇక్కడి పలు స్వచ్ఛంద సంస్థలో కలిసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చేదాన్ని. వారికి విభిన్న కళాకృతుల తయారీ నేర్పించేదాన్ని. అలా తరచూ భారత్‌కు వచ్చిపోతున్న నేను... 2006లో బిశ్వదీప్‌తో పెళ్లి తరువాత ఇక్కడే స్థిరపడిపోయాను. బిశ్వదీప్‌ ఒకప్పడు పాత్రికేయుడు. ఒక యోగా కేంద్రంలో తనతో పరిచయం అయింది. పెళ్లి తరువాత అంతర్జాతీయ వస్త్ర బ్రాండ్లకు డిజైన్‌ కన్సల్టెంట్‌గా పని చేసేదాన్ని. ఆ క్రమంలోనే నా దృష్టి భారత ఫ్యాషన్‌ పరిశ్రమలో టన్నులకు టన్నులు పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్‌ వేస్ట్‌పై పడింది.


వ్యర్థంతో ఆకర్షణీయ ఉత్పత్తులు...

ఎన్నో అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లకు కేంద్రం ఢిల్లీ. ఇక్కడ రోజుకు వందల కిలోల వస్త్ర వ్యర్థాలు చెత్తకుప్పలను ముంచెత్తుతున్నాయి. ఈ వ్యర్థాన్ని పనికొచ్చే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు అది ఒక ఉపాధి మార్గం అవుతుందని భావించాను. అందులో భాగంగానే అఫ్ఘాన్‌ మహిళలకు కళాకృతుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాను. దీనికి బిశ్వదీప్‌ కూడా మద్దతునిచ్చారు. పూర్తి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఒక ప్రముఖ ఆంగ్ల వారపత్రికలో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఉన్న ఆయన, తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒక మంచి లక్ష్యం కోసం ఇద్దరం కలిసి పని చేయడం ప్రారంభించాం. అందులో భాగంగానే ఫ్యాబ్రిక్‌ వేస్ట్‌ను అప్‌సైక్లింగ్‌ చేసి, కళాకృతులు రూపొందించాలని నిర్ణయించాం. అది సత్ఫలితాలను ఇచ్చింది. దానివల్ల అఫ్ఘాన్‌ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. వారి జీవితానికి ఒక భరోసా లభించింది.


ప్రపంచవ్యాప్తంగా...

మా సంస్థలో అఫ్ఘాన్‌ కళాకారులు రూపొందించిన బొమ్మలు, అల్లికలు, ఇంటి అలంకరణ వస్తువులు దేశవిదేశాల్లోని 150 నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. శరణార్థులు తయారు చేసే బొమ్మల్లో అద్భుతమైన సృజన మాత్రమే కాదు... వారి కథలు, వ్యక్తిత్వాలకు ప్రతిరూపాలుగా కనిపిస్తాయి. భారత్‌తో పాటు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జపాన్‌, కొరియా, ఆస్ర్టేలియా తదితర దేశాల్లో ఈ బొమ్మలకు మంచి డిమాండ్‌ ఉంది. ‘సిలైవాలీ’ కళాకృతుల ధరలు రూ.280 నుంచి రూ.5,400 వకు ఉన్నాయి. ఏడాదికి రెండు లక్షల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటివరకు మొత్తం నాలుగువందల మంది అఫ్ఘాన్‌ శరణార్థ మహిళలకు శిక్షణ ఇచ్చాం. వలస విధానాల వల్ల వీరిలో చాలామంది కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. ఏదిఏమైనా నేను, మావారు తీసుకున్న నిర్ణయంవల్ల వారి బతుకుల్లో వెలుగులు నింపగలిగాం. దీనికి మించిన సంతృప్తి, సంతోషం మాకు మరెందులోనూ లభించదు.’’

Updated Date - Sep 05 , 2024 | 04:08 AM