Dr. Ravi Chander : కేన్సర్లకు కారణం జీవనశైలే!
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:11 AM
ఈ మధ్యకాలంలో మన దేశంలో కేన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులేనంటారు హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి చందర్.
కేన్సర్ కేర్
ఈ మధ్యకాలంలో మన దేశంలో కేన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులేనంటారు హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి చందర్. ఇదే విధంగా కేన్సర్ చికిత్సలో అనేక మార్పులు కూడా వచ్చాయంటున్నారాయన. ఈ విషయాలపై ‘డాక్టర్’కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
కేన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోందా? దీనికి కారణాలేమిటి?
కేన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అతి ఎక్కువ కేసులు ఉండేది మన దేశంలోనే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది జీవన శైలిలో వచ్చిన మార్పులు. రెండోది మన పర్యావరణంలో వచ్చిన మార్పులు. ఈ మధ్యకాలంలో గర్భసంచి కేన్సర్, రొమ్ము కేన్సర్, పేవుల కేన్సర్, నోటీ కేన్సర్‌లు బాగా పెరిగాయి. ఇవన్నీ జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల వచ్చే కేన్సర్లు. పర్యావరణ కాలుష్యం వల్ల లంగ్ కేన్సర్లు ఎక్కువయ్యాయి. ఈ మధ్యకాలంలో 40 ఏళ్ల వాళ్లకు కూడా లంగ్ కేన్సర్ వస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా సిగరెట్లు తాగటం మొదలుపెట్టిన 25 ఏళ్ల తర్వాత లంగ్ కేన్సర్ వచ్చే అవకాశముంది. కానీ ఢిల్లీలో ఒక పసిపాప పుడితే ఆ పాప కాలుష్యంలోనే పెరుగుతుంది. అంటే చిన్న వయస్సులోనే ఆ పాపకు కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
ఎక్కువ కొవ్వు పదార్థాలు తినడం, ఐటిలో పని చేసే వాళ్ల సంఖ్య పెరగడం మనం చూస్తున్నాం. జంక్ ఫుడ్ తినేవారి సంఖ్య పెరిగింది. ఆకుకూరలు, కాయగూరలు మాత్రమే తినేవారి సంఖ్య తగ్గుతోంది. దీని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు శాకాహారులు ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు తింటారు. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఏవైనా రసాయనాలు ఉన్నా వీటిని ఈ ఫైబర్ పీల్చుకుంటుంది. ఫైబర్ తగ్గిపోతే మనకు ఈ రసాయనాల వల్ల ఎక్కువ ముప్పు ఏర్పడుతుంది. అంటే మనకు రక్షణ తగ్గిపోయినట్లే కదా! అంతే కాదు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు విటమిన్ల ద్వారా లభిస్తాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సిల ద్వారా ఇవి ఎక్కువ లభిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్, పండ్ల ద్వారా ఇవి లభిస్తాయి. వీటిని తినటం తగ్గిస్తే మనకు రక్షణ కూడా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల ఇతర జబ్బులతో పాటుగా కేన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
కేన్సర్లు సోకడంలో జన్యువుల పాత్ర ఎంత?
అన్ని క్యాన్సర్లకు జన్యువులే కారణం కాదు. నా ఉద్దేశంలో. 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే కేన్సర్లు జన్యువుల ద్వారా వస్తాయి. మిగిలిన 90 శాతం కేసుల్లో కేన్సర్ రావటానికి జన్యువులు కారణం కాదు.
మీకు వచ్చే కేసుల్లో సంఖ్యాపరంగా ఏవి ఎక్కువ ఉంటాయి?
మహిళల్లో 28 శాతం కేసులు రొమ్ము కేన్సర్లే ఉంటాయి. ఒవేరియన్ కేన్సర్లు కూడా ఎక్కువే వస్తాయి. ఇంతకు ముందు సర్వైకల్ కేన్సర్లు ఎక్కువగా వచ్చేవి. అయితే దీనికి వ్యాక్సిన్ వచ్చింది. హెచ్‌పీవీ వైరస్ వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి వ్యాక్సిన్ కనుగొనటం వల్ల ఈ కేన్సర్ వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సర్జరీలలో బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్లు, పెద్ద ప్రేవు కేన్సర్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. పాశ్చాత్య దేశాల్లో నోటి కేన్సర్ ఎక్కువగా కనిపించదు. మన దగ్గరే పొగాకు, గుట్కాలను వాడే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ కేన్సర్ వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పాశ్చాత్య దేశాల్లో పెద్ద ప్రేవు కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఇంతకు ముందు కడుపులో అల్సర్ల వల్ల కేన్సర్లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఇవి కూడా తగ్గాయి. ఏతావాతా చెప్పేదేమిటంటే- జీవనశైలి మారుతున్న కొలది క్యాన్సర్ల తీరు మారుతోంది.
కేన్సర్ ట్రీట్‌మెంట్‌లో వచ్చిన మార్పులు ఏమిటి?
సర్జరీ పరంగా లేప్రోస్కోపిక్ అంటారు. రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల పేషెంట్లకు ఎక్కువ మేలు జరుగుతోంది. అదే విధంగా రేడియేషన్ ఇచ్చే విధానం కూడా మారింది. ఉదాహరణకు ఒక చిన్న భాగంలో కేన్సర్ కణాలు ఉన్నాయనుకుందాం. ఒకప్పుడు రేడియేషన్‌ను, ఆ కణజాలం మొత్తానికీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం ఏ భాగంలో ఉందో అక్కడే ఇవ్వగలుగుతున్నారు. దీని వల్ల చిన్న చిన్న ట్యూమర్లు ఉంటే వాటికి రేడియేషన్‌తో సరిపెట్టగలుగుతున్నాం. అంతే కాకుండా ఇంతకు ముందు నెలన్నర పాటు రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఐదు రోజుల్లో పూర్తి అయిపోతోంది. కీమో థెరపీలో అనేక మార్పులు వచ్చాయి. దానికి సంబంధించిన యాంటీబాడీస్ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్ని యాంటీ బాడీలు అందరికీ ఒకే విధంగా పనిచేయవు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఎవరికి ఎలాంటి యాంటీబాడీలు పనిచేస్తాయనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. దీని వల్ల టెస్టుల సంఖ్య పెరిగింది. అదే సమయంలో చికిత్స కచ్చితత్వం కూడా పెరిగింది. ఇమ్యూనో థెరిపీలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత దీని ఖరీదు కూడా తగ్గుతుంది.
పేషెంట్లలో అవగాహన పెరిగిందా?
పేషెంట్లలో అవగాహన అయితే ఎక్కువ ఉంది. కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవాళ్లు కూడా వస్తున్నారు. కొద్ది మంది గూగుల్‌లో లక్షణాలు చూసి వస్తూ ఉంటారు. పరీక్షలు చేయించుకొనేవారి సంఖ్య కూడా పెరిగింది.
ఈ మధ్యకాలంలో రోబోటిక్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. దీని వల్ల లాభాలేమిటి?
ఇది కూడా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ లాంటిదే. ముందు దీని గురించి చెప్పుకుందాం. ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో ఒక చిన్న కన్నం పెట్టి దాని నుంచి చిన్న పరికరాన్ని పంపి లోపలి భాగాలను చూడగలుగుతారు. అయితే ల్యాప్రోస్కొపిక్ పరికరాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వీటిని ఎక్కువగా కదిపేందుకు వీలు ఉండదు. రోబోటిక్ సర్జరీలో కూడా ఇలాగే చేస్తారు. కానీ దానిలో అత్యాధునిక పరికరాలను వాడతారు. దాని ద్వారా వచ్చే బొమ్మలు కూడా పదిరెట్లు పెద్దగా ఉంటాయి. శరీరం లోపల కూడా మనకు నచ్చిన విధంగా వాటిని కదపవచ్చు. మన చేయిని ఎలా కదుపుతామో వీటిని కూడా అలా కదపవచ్చు. ఈ సౌకర్యం వల్ల చిన్న చిన్న రక్తనాళాలకు.. కణజాలాలకు ఇబ్బంది కలగదు. రక్త స్రావం కూడా ఎక్కువ కాదు. అందువల్లే ప్రొస్ట్రేట్ సర్జరీకి ఎక్కువగా రోబోటిక్ సర్జరీనే చేస్తారు.
కానీ ఖరీదు కూడా ఎక్కువే కదా?
ఎందుకంటే రోబోటిక్స్‌లో ఎక్కువగా డిస్పోజబుల్స్ ఉంటాయి. అందువల్ల చికిత్స ఖరీదు ఎక్కువ. ఇప్పటి దాకా డావిన్సీ అనే ఒకే కంపెనీ రోబోటిక్ సర్జరీ యంత్రాలు తయారుచేసేది. దీని ఖరీదు 18 కోట్ల దాకా ఉండేది. ఈ మధ్యకాలంలో ఎస్‌ఎస్‌ఐ మంత్ర అనే కంపెనీ యంత్రాలు తయారుచేస్తోంది. ఇవి పూర్తిగా మేడిన్ ఇండియా యంత్రాలు. వీటి ఖరీదు ఐదు కోట్ల దాకా ఉంటుంది. ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే రోబోటిక్ సర్జరీ ఖరీదు గణనీయంగా తగ్గుతోంది. ఒకటి రెండేళ్లలో లేప్రోస్కోపిక్‌కు రోబోటిక్‌కు పెద్ద తేడా ఉండకపోవచ్చు.
పాశ్చాత్యదేశాల్లో గ్రూపు
ఎందుకంటే అక్కడ హాస్పటల్స్‌లో ఇన్ హౌస్ కన్సల్టెంట్స్ ఉండరు. గ్రూపు ప్రాక్టీసు ఉంటుంది. హాస్పిటల్స్‌ను హాస్పిటలిస్ట్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. వారే పేషెంట్లను చూసుకుంటారు. డాక్టర్లు పేషెంట్లను హాస్పటల్స్‌కు పంపుతారు. కానీ ఇక్కడ హాస్పటల్స్ డాక్టర్ల దగ్గరకు పంపుతాయి. ఏ హాస్పటల్ తన దగ్గర ఉన్న పేషెంట్లను కోల్పోవాలని చూడదు.